– పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యం
– ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఉచిత హామీలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను విస్మరిస్తున్నాయని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం అశ్వారావుపేట లోని స్థానిక శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రథమ మహాసభలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు సంఘం జిల్లా అధ్యక్షుడు నాయని రాజు సంఘ జెండాను ఆవిష్కరించారు. సభకు దాసరి సాయి, అమర్లపూడి రాము, ముద్దా బిక్షం అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా, జిల్లా కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రభుత్వాలపై విమర్శల వెల్లువ:
ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి నరసయ్య తన ప్రసంగంలో ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించినా సాధారణ కుటుంబానికి అవసరాలు తీర్చుకోవడం కష్టమైందని అన్నారు. కానీ కూలీలకు తగిన వేతనం ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ అంకెల గారడీ :
బడ్జెట్ ప్రసంగాలు వినడానికి ఆకర్షణీయంగా ఉన్నా, అమలు మాత్రం పేదల జీవనాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ప్రకటించిన హామీలను పక్కనబెట్టి కొత్త పేర్లతో పథకాలు తీసుకొస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రైతులు పోరాడి రద్దు చేయించిన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.
పోరాటమే మార్గమని పిలుపు:
దేశంలో అపారమైన వనరులు ఉన్నప్పటికీ రైతు, కూలీల జీవన స్థితి మెరుగుపడకపోవడం బాధాకరమని అన్నారు. హక్కులు, ఆత్మగౌరవం కోసం రైతులు, కూలీలు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అలరించిన అరుణోదయ కళా ప్రదర్శనలు:
మహాసభల సందర్భంగా అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎర్రజెండా పాటలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సభా ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి సంఘ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ కూలీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


