Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్‌, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

- Advertisement -

– ప్రకటించిన మోడీ
– మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌ అంటూ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : భారత్‌, యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై చర్చలు ముగిశాయని, ఒప్పందం కుదిరినట్లు ఇరు దేశాలు మంగళవారం ప్రకటించాయి. ఈ ఏడాది చివరిలో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయ, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు.
2007లో ఈ వాణిజ్య చర్చలు ప్రారంభం కాగా 18ఏళ్ళ తర్వాత చర్చల ప్రక్రియ ముగిసి, ఒప్పందం ఖరారైంది. ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికే 136 బిలియన్ల డాలర్లు దాటినందున, ఈ ఒప్పందం ప్రపంచంలోని అతిపెద్దదైన ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది.

మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఈ ఒప్పందం కుదిరిన విషయాన్ని తెలియచేస్తూ, అంతర్జాతీయ జీడీపీలో దీని వాటా 25శాతం వుంటుందని, అంతర్జాతీయ వాణిజ్యంలో మూడో వంతు వుంటుందని ప్రకటించారు. మన రైతులకు, చిన్న పరిశ్రమలకు యురోపియన్‌ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చారిత్రక ఒప్పందం అవకాశం కల్పిస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. తయారీ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, మన సేవా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ ఒప్పందం చారిత్రక స్వభావాన్ని కలిగివుందంటూ వాన్‌ డెర్‌ లేయన్‌ కూడా ప్రశంపించారు. ఇది ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’ అని ఆమె ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే రెండవది, నాలుగవదైన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి 200కోట్లమంది ప్రజలకు మార్కెట్‌ను సృష్టించామన్నారు. ఈనాడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు సహకారమే చక్కని సమాధానమని బలమైన సందేశం ఇచ్చామన్నారు.
ఈ ఒప్పందం వల్ల యురోపియన్‌ యూనియన్‌ ప్రాంతానికి భారత్‌ ఎగుమతి చేసే 99.5శాతం వస్తువులపై ఈయూ టారిఫ్‌లు తగ్గనున్నాయి. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే చాలావరకు టారిఫ్‌లు జీరో శాతానికి పడిపోతాయి. మరోవైపు భారత్‌, ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య విలువలో 97.5శాతం మేర టారిఫ్‌ల్లో రాయితీలను ఇచ్చింది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగిసినట్లు సంయుక్త ప్రకటనపై వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌, యురోపియన్‌ వాణిజ్య, ఆర్థిక భద్రతా వ్యవహారాల కమిషనర్‌ మార్కోస్‌ సెఫ్‌కొవిక్‌లు మంగళవారం సంతకాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇయు కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌, యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటానియో కోస్టాల సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది.

సున్నితమైన అంశాలకు మినహాయింపు
2007లో చర్చలు ప్రారంభమైనా అనేక అడ్డంకులు, అవాంతరాల నేపథ్యంలో ఒప్పందం కుదరడం కష్టమనుకున్న కొన్ని అంశాలను మినహాయించడానికి ఇరు పక్షాలు అంగీకరించడంలో తిరిగి 2022లో చర్చలు పునరుద్ధరించారు. ఆ రకంగా భారత్‌ అత్యంత వ్యూహాత్మకమైన వ్యవసాయ రంగాలను, డెయిరీ రంగాలను మినహాయించింది. అలాగే యురోపియన్‌ యూనియన్‌ తమకు అత్యంత ముఖ్యమని భావించిన ఉత్పత్తులు పందిమాంసం, చక్కెర, బియ్యం, పాల పొడి, తేనె, అరటిపళ్లు తదితర ఉత్పత్తులపై ప్రస్తుతమున్న టారిఫ్‌లనే అమలు చేయనుంది.
రాబోయే 15 రోజుల్లో ఒప్పంద పత్రంపై ఉపయోగించే భాష, పదజాలం అంతా సమీక్షిస్తారు. ఆ తర్వాత చట్టపరమైన సమీక్ష జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే ఈ ఒప్పందాన్ని తర్జుమా చేసి 27 యురోపియన్‌ దేశాలకు పంపిస్తారు. ఆ తర్వాత యురోపియన్‌ పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -