పలు కీలక రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు
రక్షణ భాగస్వామ్యం మరింత విస్తృతం
గాజా శాంతి ప్రణాళికకు మద్దతు
టెల్ అవీవ్ : వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, కృత్రిమ మేథస్సు, సైబర్ భద్రత, విద్య, డిజిటల్ చెల్లింపులు సహా పలు రంగాల్లో భారత్, ఇజ్రాయిల్ మధ్య పలు ఒప్పందాలు, ఎంఓయులపై సంతకాలు జరిగాయి. భారత్, ఇజ్రాయిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళినట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. త్వరలోనే పరస్పరం లబ్ది చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కూడా ఇరువురు నేతలు అంగీకరించారు.
ఇప్పటికే వున్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. సాంకేతికతల బదలాయింపు చట్రపరిధి కింద మిలటరీ హార్డ్‌వేర్‌ను సంయుక్తంగా అభివృద్ధి పరచడానికి, సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి పని చేయాలని నిర్ణయించాయి. సాధ్యమైనంత త్వరలో భారత్‌లో ప్రభుత్వాల మధ్య సమావేశం (గవర్నమెంట్ టు గవర్నమెంట్-జి2జి) నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రధాని మోడీతో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు, మోడీ పర్యటనపై ప్రశంసలు కురిపించారు. తమకు ఇంతలా మద్దతు తెలిపిన భారత్‌కు రుణపడి వున్నామని వ్యాఖ్యానించారు.
గాజాలో శాంతి చొరవలకు మద్దతు
గాజాలో శాంతి నెలకొల్పడానికి తీసుకున్న చొరవలకు మోడీ మద్దతు ప్రకటించారు. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో శాంతి సుస్థిరతలు భారతదేశ భద్రతా ప్రయోజనాలతో ప్రత్యక్షంగా ముడిపడి వున్నాయన్నారు. అందువల్ల తొలి నుండి కూడా చర్చలు, శాంతియుత పరిష్కార మార్గాలకే తాము మద్దతిస్తూ వచ్చామన్నారు. ఈ విషయంలో భారత్ వైఖరి చాలా స్పష్టంగా వుందన్నారు. ఘర్షణలకు మానవత్వం ఎన్నడూ బలి కారాదని తమ వైఖరి అని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో కూడా అన్ని దేశాలతో తమ చర్చలు, సహకారం ఇలాగే కొనసాగుతాయని అన్నారు. ఇజ్రాయిల్ నిర్మాణ, సంరక్షణా రంగాలకు భారత్ గణనీయంగా దోహదపడిందని మోడీ పత్రికా సమావేశంలో తెలిపారు. నిజాయితీతో కూడిన, కష్టించి పనిచేసే తత్వం ద్వారా భారతీయ కార్మికులు విశ్వాసం సంపాదించుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విశ్వాసం వాణిజ్య, సేవలు వంటి రంగాలకు కూడా విస్తరించడం సంతోషంగా వుందన్నారు. భారత్, ఇజ్రాయిల్ అకడమిక్ ఫోరమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యువతను, పరిశోధకులను అనుసంథానించడం కీలకమన్నారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే అంశంపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు.
అలాగే ఇజ్రాయిల్‌లో యుపిఐ వినియోగించడంపై కూడా ఒప్పందం కుదిరినట్లు ప్రధాని మోడీ తెలిపారు. అంతకుముందు ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్‌తో మోడీ విస్తృతాంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రజలు కలిసి మరింత బలంగా తయారయ్యారు. వారు కలిసి మరింత సాధికారత సంపాదించుకున్నారని హెర్జోగ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ గురువారం బిజీ బిజీగా గడిపారు. భారత్‌లో పర్యటించాలని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును ఆహ్వానించారు.అనంతరం రెండు రోజుల పర్యటన ముగించుకుని మోడీ భారత్‌కు బయలుదేరారు. టెల్‌అవీవ్ విమానాశ్రయంలో నెతన్యాహు దంపతులు ప్రధానికి వీడ్కోలు పలికారు.



