పెద్ద దిక్కు కోల్పోయిన అసంఘటితరంగ కార్మికులు
నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్ తదితరులు
పొలిట్‌బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, వ్యకాస జాతీయ కార్యదర్శి వెంకట్ సంతాపం
నేడు బాన్సువాడలో అంత్యక్రియలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/కంఠేశ్వర్
కార్మిక హక్కుల పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్(45) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన ఆమె.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో ఈ ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటితరంగ కార్మికులు పెద్ద దిక్కు కోల్పోయినట్టయింది. నూర్జహాన్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి సీపీఐ(ఎం) కార్యాలయానికి తరలించి ప్రజల సందర్శనార్ధం ఉంచారు. ఆమె మృతదేహాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కార్యదర్శివర్గసభ్యులు, ఇతర నేతలు సందర్శించి నివాళు లర్పించారు. ఆమె భర్త, కుమారులు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పోరాటాలకు ప్రతీక..
నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర రంగాల కార్మికుల హక్కుల సాధన కోసం ఆమె నిరంతరం పోరాటాలు నడిపారు. తక్కువ వేతనాలు, అసమాన పని పరిస్థితులు, ఉద్యోగ భద్ర త లేకపోవడం వంటి సమస్యలపై ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళనలు, పోరాటాలు మాత్రమే కాకుండా.. స్థానికంగా పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.
కార్మికుల ప్రతి సమస్యనూ తన సమస్యగా భావించి, వారి మధ్యే ఉండి, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యారు. ఒక దశలో అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపిన నూర్జహాన్.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చి సీపీఐ(ఎం)లో ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కష్టకాలాల్లో వెనుకడుగు వేయని ధైర్యసాహసాలు, అంకితభావం ఆమెను ప్రజా నాయకురాలిగా నిలిపాయి. నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ, పార్టీ నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. నూర్జహాన్ భర్త ఆనంద్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారికి కొడుకులు అబ్బాస్, ఆజాద్ సంతానం.
నివాళులర్పించిన పలువురు
నూర్జహాన్ మృతిపట్ల పలువురు తమ సంతాపం ప్రకటించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, జయలక్ష్మి, నవతెలంగాణ పత్రిక ఎడిటర్ రాంపల్లి రమేశ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ్మ, డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాల కార్మికులు నూర్జహాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పల్లపు వెంకటేష్, శంకర్‌గౌడ్, నాయకులు ఏశాల గంగాధర్, సుజాత తదితరులు నివాళులర్పించారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ సంతాపం
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ఎస్.రమ తమ సంతాపం ప్రకటించారు.
పార్టీ కోసం అహర్నిశలు కృషి :సీఐటీయూ జాతీయు కోశాధికారి ఎం.సాయిబాబు
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ మరణం బాధాకరమని సీఐటీయూ జాతీయు కోశాధికారి ఎం.సాయిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్త అకస్మాత్తుగా మృతి చెందడం కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. పార్టీ సమావేశాలు, మహాసభల్లో చురుగ్గా పాల్గొనెదేదని ఆయన గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రజా ఉద్యమాల నాయకురాలు : ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
తెలంగాణ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యు రాలు, ప్రజా ఉద్యమాల నాయకురాలు నూర్జహాన్ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటన్నారు. నిజామాబాద్‌లో ఇండ్ల స్థలాలు, కార్మిక హక్కుల సాధనలో ఆమె ఎప్పుడూ మిలిటెంట్‌గా పోరాడేదని గుర్తుచేశారు. అభ్యుదయ భావాలతో జీవించిన ఆమె చివరివరకు సమాజ మార్పు కోసం నిరంతరం కృషిచేసిందని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చాలా బాధాకరం : అబ్బాస్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మనతో కలిసిమెలిసి పనిచేసిన నూర్జహాన్ మనల్ని వదిలివెళ్లడం జీర్ణించుకోలేనిది. ఆమె పోరాటా లను, ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
ఎన్నో ప్రజా, కార్మిక ఉద్యమాలు :బుర్రి ప్రసాద్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
పీడిత ప్రజల కోసం.. వారి హక్కుల కోసం, సమానత్వం కోసం నూర్జహాన్ ప్రజా, కార్మిక ఉద్యమాలు చేపట్టారు. ఒక మహిళగా ఉండి ఎక్కడా వెనుకడుగు వేయకుండా పోరాటాల్లో ముందుకు సాగారు. అలాంటి నాయకురాలిని కోల్పోవడం బాధాకరం.
నమ్మకం కలగడం లేదు : జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
కష్టజీవుల అండగా నిలబడిన నూర్జహాన్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం. చిన్న వయసులో ఆమె చనిపోయారంటే నమ్మకం కలగడం లేదు.
కార్మిక వర్గానికి తీరనిలోటు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నూర్జహాన్ మరణం కార్మిక వర్గానికి తీరని లోటు అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు వారు శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. నూర్జహాన్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, కార్మిక వర్గ నాయకురాలిగా అత్యంత చురుగ్గా ఉండేదని గుర్తుచేశారు. కుటుంబం మొత్తం ఉద్యమంలో పని చేస్తున్నదనీ, మిలిటెంట్ నాయకురాలిగా పోరాటాల్లో ప్రత్యక్షంగా ముందువరుసలో ఉండేదని తెలిపారు. చిన్న వయసులో అలాంటి నాయకురాలిని కోల్పోవడం పార్టీకి చాలా నష్టమని పేర్కొన్నారు. నూర్జహాన్ మరణానికి సంతాపం, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రాణాలకు తెగించి పోరాటాలు
నూర్జమాన్ అతి చిన్న వయసులోనే పీడిత ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేశారు. ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పోరాటాలు చేసి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజల కోసం జైలు జీవితం గడిపారు. అలాంటి నాయకురాలిని కోల్పోవడం పార్టీకి తీవ్ర లోటు. సమాన హక్కులు సాధించడం, దోపిడీరహిత సమాజ నిర్మాణం, అసమానతలు తొలగేలా పోరాటాలు చేయడమే ఆమెకు జోహార్లు అర్పించడం. అదే ఆమెకు నిజమైన నివాళి. ఆమె కుటుంబానికి సానుభూతి. -జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి



