చరిత్రను ఎప్పుడు తిరగేసినా, ఒక దృశ్యం పదే పదే ఎదురవుతుంది. ఒక దేశం తన వనరులపై హక్కులు ప్రకటించినప్పుడల్లా అక్కడ ”ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది” అనే అలారం మోగుతుంది. ప్రజలకోసం సంపదను వినియోగిస్తే, అది ”నియంత పాలన”గా ముద్ర వేయబడు తుంది. సామ్రాజ్యవాద దురాక్రమణల పర్వంలో ఇది కొత్త కథేమీకాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాతకథే. ఈ కథలో తాజా అధ్యాయం వెనిజులా. ”స్వేచ్ఛ”, ”మానవ హక్కులు”, ”ప్రజాస్వామ్యం” అనే అందమైన పదాల వెనక దాగి ఉన్న అమెరికా అసలైన ముఖం ఇక్కడ మరోసారి బట్టబయలైంది. చమురు, ఆధిపత్యం, లాభాల కోసం ఒక దేశాన్ని మోకాళ్ల మీద కూర్చోబెట్టాలన్న క్రూర ప్రయత్నమే ఈ రోజు వెనిజులాపై జరుగుతున్న దుశ్చర్యల సారాంశం. సామ్రాజ్యవాదం అనేది కేవలం ట్రంపులాంటి దుర్మార్గ పాలకుల స్వభావం మాత్రమే కాదు. అది పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక నిర్దిష్ట దశలోకి ప్రవేశించిన ప్పుడు అనివార్యంగా పుట్టుకొచ్చే రాజకీయ, సైనిక రూపం. దానికి తన లాభాల కోసం మార్కెట్లు కావాలి, వనరులు కావాలి, కారుచౌకగా కార్మికుల శ్రమ కావాలి. అవి దొరక్కపోతే ఆయుధాలు మాట్లాడతాయి. ఇదే దాని సిద్ధాంతం. వెనిజులాపై దాడి, మదురో అపహరణ ఈ సిద్ధాంతానికి అత్యంత స్పష్టమైన తాజా ఉదాహరణ.
వెనిజులా అమెరికాకు అకస్మాత్తుగా శత్రువుగా మారలేదు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంగా వెనిజులా ఎప్పటినుంచో అమెరికా పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రాంతం. వెనిజులా చమురు క్షేత్రాలపై అమెరికా కంపెనీలది తిరుగులేని ఆధిపత్యం. కానీ 1998లో హ్యూగో చావెజ్ అధికారంలోకి రావడం దీనికి గండికొట్టింది. చావెజ్ చమురు నిక్షేపాలన్నిటినీ జాతీయం చేశాడు. వెనిజులా చమురు మీద హక్కు బహుళజాతి కంపెనీల నుంచి వెనిజులా ప్రజల చేతుల్లోకి వెళ్లింది. ఇది అమెరికా సామ్రాజ్యవాదానికి అతిపెద్ద సవాల్‌గా మారింది. చావెజ్ ప్రభుత్వం చమురు ఆదాయాన్ని విద్య, వైద్యం, గృహాలు, పేదల సంక్షేమంపై ఖర్చు చేయడం, లాటిన్ అమెరికాలో సామ్రాజ్య వాద వ్యతిరేక ఐక్యతకు ఊపిరి పోయడం, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాల రూపకల్పనకు పూనుకోవటం, చావెజ్ అనంతరం మదురో దాన్ని కొనసాగించడం… ఇవన్నీ అమెరికా లక్ష్యాలకు ఆటంకంగా మారాయి.
అమెరికాకు అసలు సమస్య మదురో కాదు. అక్కడి ఎన్నికల విధానమూ కాదు. వెనిజులా ఒక ప్రత్యామ్నాయ విధానానికి నమూనాగా మారడమే. ఒక దేశం తన వనరులపై తనకు హక్కుందని చెప్పడం, ప్రజల కోసం సంపదను వినియోగించడం, అమెరికా ఆదేశాలను లెక్కచేయకపోవడం… ఇవన్నీ ఇతర దేశాలకు కూడా ప్రేరణ అవుతాయన్న భయం అమెరికాను వెంటాడుతోంది. అందుకే వెనిజులాను ”విఫల దేశం”, ”నియంత పాలన” అంటూ చిత్రీకరించడం మొదలు పెట్టి కొనసాగిస్తోంది. అమెరికా సామ్రాజ్య వాదం ఎప్పుడూ ఒక నాటకం ఆడుతుంది. తను ఏ దేశాన్నయితే కబళించాలని అనుకుంటుందో ముందుగా ఆ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటుంది. తర్వాత మానవ హక్కుల పేరుతో విమర్శలు చేస్తుంది. ఆపై ఆంక్షల చట్రంలో బంధిస్తుంది. ప్రజలు ఆకలితో, మందుల కొరతతో అల్లాడుతుంటే, ఆ బాధను ఆ దేశ ప్రభుత్వాల వైఫల్యంగా చిత్రిస్తుంది. చివరికి ”ప్రజలను కాపాడేందుకు” జోక్యం చేసుకుంటామంటుంది. ఇరాక్‌లో ఇదే జరిగింది. లిబియాలోనూ ఇదే జరిగింది. వెనిజులాలో కూడా ఇప్పుడు అదే కథ తిరిగి రాయబడుతోంది.
వెనిజులాపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఒక నిశ్శబ్ద యుద్ధం. చమురు ఎగుమతులపై ఆంక్షలు, విదేశీ బ్యాంకుల్లో ఉన్న వెనిజులా ఆస్తుల స్వాధీనం, ఆహారం, ఔషధాల దిగుమతులకు అడ్డంకులు.. ఇవన్నీ ప్రజల జీవనంపై దాడిచేశాయి. సమస్యల్లో ముంచెత్తాయి. ఇందుకు కారణం మదురో పాలన కాదని, అమెరికా విధించిన ఆర్థిక యుద్ధమేనని ప్రపంచం తెలుసుకోవాలి. మరో విడ్డూరం ఏమిటంటే… ఎన్నికల్లో గెలవని, ప్రజల్లో బలం లేని ఒక వ్యక్తిని ”తాత్కాలిక అధ్యక్షుడు”గా ప్రకటించడం, ప్రపంచ దేశాలపై అతన్ని గుర్తించమని ఒత్తిడి చేయడం, ఆ దేశ ప్రజల ఆస్తులను అతని చేతుల్లో పెట్టడం, ఆపైన అప్పనంగా కాజేయడం… ఇదే అమెరికా ప్రజాస్వామ్యానికి ఇచ్చే ‘బహుమానం’. నిజానికిది ఒక దేశ సార్వభౌమధికారానికి బహిరంగ అవమానం. జువాన్ గ్వాయిడో ప్రయోగం చెబుతున్నది ఇదే కదా!. అందుకే ఆ ప్రయోగం విఫలమైంది. ప్రజలు తిరస్కరించారు. వెనిజులా ప్రజలు మరోసారి మదురోనే మా నాయకుడని చాటిచెప్పారు. ఇలా అన్ని ఆప్షన్లు అయిపోయాక ఇప్పుడీ మదురో అపహరణకు బరితెగించింది అమెరికా.
”అన్ని ఆప్షన్లు టేబుల్ మీదే ఉన్నాయి” అని అమెరికా పదేపదే హెచ్చరించడం వెనిజులాకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ ఒక బెదిరింపు. మా మాట వినకపోతే, మా ఆదేశాలను పాటించకపోతే, మీకూ ఇదే గతి అని చెప్పడమే అందులోని సందేశం. ఇది నేరుగా ఒక దేశ సార్వభౌమాధి కారంపై దాడి. అంతర్జాతీయ చట్టాల పట్ల బహిరంగ నిర్లక్ష్యం. ఇలా లాటిన్ అమెరికా మొత్తాన్ని తన ప్రయోగశాలగా మార్చింది అమెరికా. గ్వాటెమాలా, చిలీ, నికారాగ్వా, హౌండూరాస్, క్యూబా.. ఇప్పుడు వెనిజులా.. ఇలా ఈ జాబితా అంతులేనిది.
వెనిజులా పోరాటం కేవలం ఒక దేశం పోరాటం కాదు. ఇది ప్రపంచ ప్రజల పోరాటం. ఇది చమురు కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. ఒక వ్యక్తి కోసం కాదు, ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు కోసం. ఈ సందర్భంలో భారతదేశం సహా అనేక దేశాల మౌనం కూడా ప్రశ్నార్థకమే. వెనిజులాపై జరుగుతున్న ఈ దుశ్చర్యలను స్పష్టంగా ఖండించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, సైనిక బెదిరింపుల విరమణ, వెనిజులా ప్రజల స్వయం నిర్ణయ హక్కుకు మద్దతు… ఇవి కేవలం ఆకాంక్షలు కాదు, ప్రపంచ ప్రజల ఆశయాలు.
ఆ ఆశయాలపై దాడులను ఎదురించాల్సిందే. సామ్రాజ్య వాదానికి సైనిక చర్య చివరిదశ మాత్రమే. దానికి ముందు జరిగేది రాజకీయ, మానసిక, ఆర్థిక యుద్ధం. వెనిజులా విషయంలో అమెరికా మొదట అంతర్జాతీయ మీడియాలో ఒక చిత్రాన్ని చూపింది. ”ఆహారం లేదు”, ”మందులు లేవు”, ”ప్రజలు దేశం విడిచిపోతున్నారు” అనే వార్తలు ప్రపంచం నలుమూలలకి పంపించింది. కానీ వాటి మూల కారణాన్ని దాచిపెట్టింది. ఆ పరిస్థితులకు కారణం మదురో ప్రభుత్వ విధానాలే అన్నట్టు చిత్రీకరించింది. అమెరికా విధించిన ఆంక్షలే ఆ సంక్షోభానికి కారణమనే వాస్తవాన్ని దాచివుంచింది. ఇది సామ్రాజ్యవాద ప్రచార యంత్రాంగం పని చేసే తీరుకు క్లాసిక్ ఉదాహరణ. అందుకే వెనిజులా వార్తల్లో ప్రజల పోరాటం కనిపించదు. అక్కడి ప్రజలు అమెరికా ఆంక్షలను ఎలా తట్టుకుంటు న్నారు, ఎలా సంఘటితమవుతున్నారు, ఎలా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు అనే కథలు పెద్దగా బయటకు రావు. బదులుగా గందరగోళం, అశాంతి, అస్థిరత మాత్రమే చూపిస్తారు. ఇది ప్రజల మనస్సుల్లో ”జోక్యం అవసరం” అన్న భావన నాటేందుకు చేసే మానసిక యుద్ధం.
ఈ యుద్ధంలో భాగంగానే అమెరికా సామ్రాజ్యవాదం వెనిజులాను ఒంటరి చేయాలనే ప్రయత్నంలో లాటిన్ అమెరికా దేశాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. కానీ ఆ దేశాల్లో ప్రజాచైతన్యం పెరుగుతోంది. లాటిన్ అమెరికా చరిత్ర ప్రపంచానికో అనుభవాన్ని ఇచ్చింది. అమెరికా మద్దతుతో ఏర్పడిన నియంతృత్వాలు చివరికి ప్రజల తిరుగుబాట్లలో కూలిపోతాయి అని నిరూపించింది. ఈ చారిత్రక అనుభవమే వెనిజులా ప్రజలకు కూడా బలం ఇస్తోంది. ఇదే సమయంలో ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఏకధ్రువ ప్రపంచం క్రమంగా కూలిపోతోంది. చైనా, రష్యా వంటి శక్తులు అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేస్తున్నాయి. ఇది సామ్రాజ్యవాదాన్ని మరింత దూకుడుగా, మరింత అసహనంగా మారుస్తోంది. తన ఆధిపత్యం చేజారిపోతుందన్న భయమే వెనిజులా వంటి దేశాలపై దాడులను మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో వెనిజులా ఓ రాజకీయ భూభాగం మాత్రమే కాదు, అది బహుళధ్రువ ప్రపంచ నిర్మాణంలో ఒక కీలక మలుపు. ప్రత్యామ్నాయానికి పిలుపు.
ప్రత్యామ్నాయమే మానవ సమాజాన్ని ముందుకు నడిపిస్తోందని చరిత్ర చెబుతోంది. ఆ చరిత్ర సాక్షిగా వెనిజులా ఇప్పుడు ప్రపంచానికి అవసరమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశ సంపదను ప్రజల కోసం వినియోగించడం తప్పా? విద్య, వైద్యం మార్కెట్ సరుకులు కాకూడదని చెప్పడం నేరమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేనితనమే అమెరికా ఆగ్రహానికి మూలం. వెనిజులా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తక్కువగా చూడలేం. ఆర్థిక ఒత్తిడి నిజం. జీవన వ్యయాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అక్కడ ప్రజలు సంఘటిత మవుతున్నారు. కమ్యూన్‌లు, సహకార వ్యవస్థలు, ప్రజా పంపిణీవ్యవస్థలు… ఇవన్నీ ఆంక్షల మధ్యలోనూ నిలబడ్డాయి. ఇది ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. సామ్రాజ్యవాదం ఒక దేశాన్ని ఆర్థికంగా నలిపివేయగలదు గానీ, ప్రజల సామూహిక సంకల్పాన్ని పూర్తిగా ధ్వంసం చేయలేదు.
ఈ సందర్భంలో ప్రపంచ ప్రజాస్వామ్య శక్తుల పాత్ర అత్యంత కీలకం. వెనిజులా పరిణామాలను ఒక ప్రాంతీయ సమస్యగా చూడటం పొరపాటు. ఇది రేపు ఏ దేశానికైనా ఎదురయ్యే ప్రమాదానికి సంకేతం. భారతదేశం వంటి దేశాలు నిజంగా స్వతంత్ర విదేశాంగ విధానం పాటించాలని అనుకుంటే, సామ్రాజ్యవాద దురాక్రమణలపై స్పష్టంగా మాట్లాడాలి. మౌనం తటస్తత కాదు, అది బలవంతుడి పక్షాన నిలబడటమే. వెనిజులా మీద అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దాడి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఇది ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చే హెచ్చరిక. కానీ చరిత్ర పదేపదే నిరూపించిన సత్యమొకటి ఈ హెచ్చరికను సవాలు చేస్తోంది. ‘సామ్రాజ్యవాదం తన శక్తి పరాకాష్టకు చేరిప్పుడు మరింత అహంకారంగా, మరింత క్రూరంగా ప్రవర్తిస్తుంది. కానీ అదే దశ దాని పతనానికి కూడా సూచిక’ అన్న సత్యాన్ని మనమిక్కడ గుర్తించాలి. అమెరికా సామ్రాజ్యవాదం ఈ రోజు వెనిజులాపై చూపుతున్న దురాక్రమణలు ఆ అహంకారానికి నిదర్శనం. ఇవి తాత్కాలికంగా ప్రజాస్వామ్యాన్ని అణచి వేయొచ్చుగాక.. కానీ దీర్ఘకాలంలో ప్రజల చైతన్యానికి మరింత పదును పెడతాయి. వియత్నాం గెలిచింది. క్యూబా నిలబడింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో యుద్ధవిమానాలు విధ్వంసం సృష్టించినా, ప్రజల సంకల్పం ఇంకా ఓడిపోలేదు. అదే చరిత్ర వెనిజులాలో కూడా పునరావృతమవుతుంది. ఎందుకంటే చమురు కంటే విలువైనది ప్రజల ఆత్మగౌరవం. సైనిక శక్తికంటే బలమైనది ప్రజల సంకల్పం. ప్రపంచం ఇప్పుడు ఒక మలుపు దగ్గర నిలబడి ఉంది. సామ్రాజ్యవాద ఆదేశాలకు లోబడి నడిచే పాత దారినే కొనసాగించాలా? లేక ప్రజల అవసరాలు, స్వయంనిర్ణయాధికార హక్కు, సమానత్వం ఆధారంగా ఒక కొత్త దిశలో ప్రయాణించాలా? ఈ ప్రశ్నకు వెనిజులా ఇప్పటికిప్పుడే సమాధానం ఇవ్వలేకపోవచ్చు… కానీ ఆ ప్రశ్నను అత్యంత స్పష్టంగా, అత్యంత ధైర్యంగా ప్రపంచం ముందుంచుతోంది. సామ్రాజ్యవాదానికి ఎదురు నిలిచే ప్రతి ప్రజా పోరాటం, అది ఎంత ఒంటరిగా కనిపించినా, ప్రపంచ మార్పుకు విత్తనమే.
రమేష్ రాంపల్లి
చమురుకంటే విలువైనది స్వేచ్ఛ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



