దేశవ్యాప్తంగా మత ఉద్రిక్తతలు
పదేండ్ల ఎల్డీఎఫ్ పాలనలో అల్లర్లు లేవు
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతఘర్షణలు : సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాశ్ కరత్
కొల్లం : దేశవ్యాప్తంగా మత ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, గత పదేండ్లలో ఎల్‌డీఎఫ్ పాలనలో కేరళంలో మత అల్లర్లు జరగలేదనే వాస్తవాన్ని సీపీఐ(ఎం)అగ్రనేత ప్రకాశ్‌కరత్ ప్రముఖంగా ప్రస్తావించారు. తిరువనంతపురం, కొల్లంలోని వివిధ నియోజకవర్గాల్లో ఎల్‌డీఎఫ్ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. గత రెండేండ్లలో కర్నాటకలో 70 మత ఘర్షణలు జరిగితే.. ఏడాది కాలంలో తెలంగాణలో ఏడు ఘటనలు చోటు చేసుకున్నా యని వివరించారు.
అక్కడి పరిస్థితులకు కేరళంలో ప్రశాంత జీవన పరిస్థితిని పోల్చారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా నిరసన తెలపడం రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించబడుతూ, అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని వివరించారు. కేరళంలో బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఎల్‌డీఎఫ్ పాలనలోనే కేరళం ప్రజలు భావప్రకటనా స్వేచ్ఛను అనుభవించడాన్ని కరత్ ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎల్డీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.



