పియ్రమైన వేణు గీతికకు
నాన్న.. దీపావళి పండక్కి సెలవులు ఉన్నాయని నాతో పాటు వస్తున్నావు. మనిద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేయడం చాలా అద్భుతంగా ఉంది. కిందటి ఉత్తరంలో సోషల్ మీడియా గురించి రాసాను. ఈ ఉత్తరం కూడా ఇంచుమించు అలాంటిదే. ఈ మధ్య కాలంలో రీల్స్, షాట్స్ అంటూ రకరాలుగా పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్, ట్విట్టర్, లింక్‌డిన్, ఇనిస్టాగ్రామ్ ఇవికూడా సోషల్ మీడియా వేదికలే. రీల్స్ చేయడం ఒక ఎత్తు అయితే వాటికి థైబ్ లైన్‌తో ఒక కాప్షన్ పెట్టి వాటిపై దృష్టి పడేలా పోస్ట్ చేస్తున్నారు. అసలు కాప్షన్‌కి వాళ్ళు పోస్ట్ చేసిన దానికి ఎక్కడా పొంతన ఉండదు.
వీటిలో కొన్ని రీల్స్ చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. మరికొన్ని హోమ్ టూర్స్ అంటూ, వాళ్ళ ఇల్లు మొత్తం చూపించడమే కాక, ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తుంటారు. దీనివలన లాభం కంటే నష్టం, మంచికంటే చెడు ఎక్కువ జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. చాలా మందికి ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి, ఆ అమ్మాయి స్నేహితురాలి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తన స్నేహితురాలు అనుకొని చాటింగ్ చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఎందుకో అనుమానం వచ్చి తన తల్లితో చెప్పింది. సరే ఆ తల్లి కూడా అసలు ఎవరో తెలుసుకుందామని చాటింగ్ చేసింది. అవతలి వైపు నుంచి కొన్ని మెసేజ్లు ఇంట్లో వాళ్లకు చెప్పకు లాంటివి వచ్చాయి. అప్పుడు ఆ అమ్మాయి తల్లికి అర్థమయింది. ఎంక్వైరీ చేస్తే ఒకతను అమ్మాయి పేరుతో చాటింగ్ చేసేవాడు. అతని కొడుకు అదే స్కూల్లో చదివేవాడట, స్కూల్ దగ్గర నిలబడి తనకు కావాల్సిన సమాచారం సేకరించుకుని ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసాడు.
ఆ అమ్మాయి తల్లికి పలుకుబడి ఉండటంతో పోలీసుల సహకారంతో అతన్ని పట్టించింది. అతను పోలీసుల విచారణలో చెప్పిన విషయాలు వింటే తల్లికి ప్రాణం పోయినంత పని అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకు ఏ విషయమైనా చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వండి. ఆ అమ్మాయి తన తల్లికి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమయ్యేది? అందుకే ప్రతి చిన్న విషయాన్ని, అందులోనూ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, షూట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని, ప్రాణాలను చేజేతులా పోగొట్టుకున్న వాళ్ళమవుతాము. యూట్యూబ్, ట్విట్టర్, ఇనిస్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైన సోషల్ మీడియాపై ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చి, కఠినచర్యలు తీసుకొస్తే బాగుంటుంది నాన్న. నియంత్రణ అనేది ఉండాలి. ఇప్పటికే చాలా చెప్పనా? సరే ఇక ఆపేస్తాను ఈ ఉత్తరం. పండగకి కావలసినవి తెచ్చుకుందాం పదా. అందరికి దీపావళి శుభాకాంక్షలు…
ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి