Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయుట్యూబర్‌ శ్రీనివాస్‌ హత్య కేసులో స్నేహితులే నిందితులు..!

యుట్యూబర్‌ శ్రీనివాస్‌ హత్య కేసులో స్నేహితులే నిందితులు..!

- Advertisement -

ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం..!
విలేకరుల సమావేశంలో ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి

నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
ఈనెల 14 వతేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యూట్యూబర్‌ బొగ్గుల శ్రీనివాస్‌ హత్యకు స్నేహితులే కారణమని ఖమ్మంరూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. ఖమ్మంరూరల్‌ మండలంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద గల ఖమ్మం రూరల్‌ ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతిరెడ్డి మాట్లాడారు. బొగ్గుల శ్రీనివాస్‌ యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బొగ్గుల శ్రీనివాస్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మేకల వేణు మాధవరెడ్డితో ఇద్దరు కలిసి సిల్వర్‌ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు.

కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లిన క్రమంలో ఒకరినొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్‌కు బొగ్గుల బీబీక్యూ పేరుతో జీఎస్టీ లైసెన్స్‌ ఉంది. మేకల వేణు మాధవరెడ్డి సొంతంగా ”మేకా ప్రాజెక్ట్స్‌” అనే కంపెనీ పెట్టి సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు బొగ్గుల బీబీక్యూ పేరు మీద ఫేక్‌ ఇన్‌ వాయిస్‌ అండ్‌ సేల్స్‌ ఫైల్‌ చేసి లాభాలు సంపాదించవచ్చని మాధవరెడ్డి చెప్పగా శ్రీనివాస్‌ సరేనని తన జీఎస్టీ లైసెన్స్‌ ఉపయోగించుకునేందుకు 50శాతం వాటా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విధంగా వారు 2022 నుంచి 2025 వరకు జీఎస్టీ ఫైలింగ్‌తో దాదాపు రూ.90 లక్షలు సంపాదించారు. అందులో శ్రీనివాస్‌ వాటా రూ.45 లక్షల కాగా మాధవరెడ్డి రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చాడు.

మిగతా రూ.30 లక్షలు తనకు ఆర్థిక ఇబ్బందులు కావడం వల్ల తర్వాత ఇస్తానని శ్రీనివాస్‌కు చెబుతూ ఆలస్యం చేస్తున్నాడు. ఇదే క్రమంలో జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఫ్రాడ్‌కు సంబంధించిన నోటీసులు వచ్చాయి. శ్రీనివాస్‌.. బొగ్గుల బేబీక్యూ లైసెన్స్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ వారు రద్దు చేశారు. దాంతో శ్రీనివాస్‌ తనకు చెల్లించాల్సిన ప్రాఫిట్‌ రూ.30 లక్షలు, క్లోజ్‌ అయిన జీఎస్టీ లైసెన్స్‌ను యాక్టివేట్‌ చేయాలని చెప్పి కోటి రూపాయలపైనే జరిమానా కట్టవలసి వస్తుందని తరచూ వేణుమాధవ్‌ రెడ్డితో వాదనకు దిగేవాడు. చాలాసార్లు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆర్థిక ఒత్తిళ్లు, జీఎస్టీ యాక్టివేషన్‌ కారణాలతో మేకల వేణుమాధవ్‌రెడ్డి ఎట్లాగైన శ్రీనివాస్‌ను హత్య చేయాలని భావించి తన స్నేహితులైన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట గ్రామానికి చెందిన పోకల కోటేశ్వరరావు, షేక్‌ అబ్దుల్‌ ఆఫీజ్‌, కొత్తగూడెంకు చెందిన కారు డ్రైవర్‌ ఎండీ అజ్మత్‌ అలీ ఖాన్‌తో కలిసి శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు.

ఈనెల 13వ తేదీన శ్రీనివాస్‌కు పెండింగ్‌లో ఉన్న డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికి విజయవాడకు వెళదామని చెప్పి వాహనంలో తీసుకెళ్లారు. 14వ తేదీ తెల్లవారుజామున నకిరేకల్‌ నుంచి జనగాం వైపు వెళ్లే దారిలో జనసంచారం లేని ప్రదేశంలో కారులో నిందితులు కత్తులు, ఐరన్‌ రాడ్లతో శ్రీనివాస్‌ తలపై దాడి చేసి హత్య చేశారు. శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు షేక్‌ అబ్దుల్‌ హఫీజ్‌, ఎండి. అజ్మత్‌ అలీ ఖాన్‌లకు 5 లక్షల రూపాయల సుపారి ఇచ్చినట్టు తెలిపారు. హత్య అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంతో పాటు వాహనాన్ని పాలేరు రిజర్వాయర్‌లో పడేసినట్టు నిందితులు తెలిపినట్టు డీఎస్పీ తెలిపారు. హంతకులను రిమాండ్‌ చేసినట్టు తెలిపారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన కూసుమంచి సీఐ సంజీవ్‌, ఎస్‌ఐ నాగరాజు, నేలకొండపల్లి ఎస్‌ఐ సంతోష్‌, తిరుమలాయపాలెం ఎస్‌ఐ జగదీష్‌, దివ్య, సిబ్బంది శ్రీకాంత్‌, సతీష్‌, వినయ్, ఉదయ్, పూర్ణచంద్రరావు, శ్రీశైలం, శ్రీలత, సయ్యద్‌, శోభన్‌, సీతారాములు, హోంగార్డు రాంబాబును ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -