కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19 మధ్యాహ్నం వరకు ఉన్న విదేశీ పత్తి దిగుమతి పైన ఉన్న పదకొండు శాతం సుంకం సెప్టెంబర్ 30 వరకు అంటే నలబై రోజులపాటు తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.మన దేశంలో అక్టోబర్ నుంచి రైతులు తమ పంటపొలాల్లో నుంచి వ్యవసాయ మార్కెట్లకు పత్తి తీసుకువచ్చి విక్రయయిస్తారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో వ్యవసాయం రెండు వారాలు ముందుకు జరగడం ,ఈ సీజన్‌లో వచ్చే పత్తి కూడా గతం కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. దీంతో పత్తి ధరలు పడిపోయి రైతులు మరింత నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి, మన దేశ వస్త్ర పరిశ్రమ లాబియింగ్‌కు మోడీ ప్రభుత్వం లొంగి సుంకాలు ఎత్తివేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి వ్యవసాయ సీజన్‌లో మన పత్తి ఉత్పత్తి 390లక్షల బెల్స్,(బెల్ అంటే 175 కిలోలు) ప్రస్తుతం 290 లక్షల బెల్స్, అంటే 100 లక్షల బెల్స్ దిగుబడి తగ్గింది. దేశీయ ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటం పత్తిసాగును పాలకులు నిర్లక్ష్యం చేయడమే. పత్తి ఉత్పత్తి తగ్గుతున్న ధోరణిని తిప్పికొట్టడానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో కాటన్‌మిషన్‌ను ప్రకటించినప్పటికీ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పత్తి సాగువిస్తరణ 2.9శాతం తక్కుగా ఉంది. భారత్ 2020-21లో ప్రపంచ ఎగుమతులో మూడు స్థానంలో నిలిచి మొత్తం ప్రపంచ ఎగుమతులో 10.2 వాట కలిగి 159 దేశాలకు ఎగుమతులు చేసింది.
నేడు అమెరికా, ఆస్ట్రేలియా బ్రెజిల్ పత్తిపై ఆధారపడి వస్త్ర పరిశ్రమ కొనసాగే పరిస్థితికి వచ్చింది.ఇది ప్రభుత్వ ప్రణాళికలో స్పష్టమైన లోపాలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఇండియాకు దిగుమతి అవుతున్న విదేశీ పత్తి ధర ఒక క్యాండీకి (355.6కిలోలకు) రూ.50 వేల నుంచి రూ.51 వేలుగా ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఒక క్యాండీ పత్తిని రూ.56 వేల నుంచి రూ.57 వేల ధరకు విక్రయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో పత్తి మద్దతు ధర క్వింటాలకు రూ.8110 ప్రకటించడంతో క్యాండీ పత్తి రూ.60 వేల నుంచి రూ.61వేల ప్రకటించే అవకాశం ఉంది. అమెరికా నుంచి వస్తున్న 40 లక్షల బెల్స్ నేరుగా పత్తి దిగుమతి వ్యాపార సంస్థలకు 250 కోట్ల రూపాయలు లాభాలు చేకూరుస్తుంది. మన దేశంలో పత్తి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా లభించక మరింత నష్టపోయే పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. సిసిఐ పత్తి కొనుగోలులో నూతన నిబంధన కపాస్ కిసాన్ యాప్‌లో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని, రైతులు స్వయంగా ఆ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ విధానం లక్షల మంది రైతులు నుంచి పత్తి కొనుగోలు నిరాకరించడమవుతుంది. దేశంలో ఎంతమంది రైతులు స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు? ఈ సమాచారం రైతుకు ఎలా చేరుతుంది? సిసిఐ పత్తి గతం కంటే తక్కువ కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఇందులో కనిపిస్తున్నది రైతు సంఘాలు క్వింటా పత్తికి రూ.10220 ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8110 కూడా రైతులకు లభించకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉంది. ఇలాగైతే వచ్చే వ్యవసాయ సీజన్‌లో సాగు తక్కువ మరింత అవుతుంది.
2019-20 వ్యవసాయ సీజన్లఓ భారత దేశ బహిరంగ మార్కెట్లో పత్తి ధర క్వింటాలకు రూ.8వేల నుంచి 12 వేలకు రైతులు విక్రయించారు. గత ఐదు వరుస వ్యవసాయ సీజన్లలో పత్తి ధర రైతుకు క్వింటాలకు రూ.7 వేలైనా లభించక మరోవైపు పెట్టుబడి ఖర్చు పెరిగి సాగువిస్తీర్ణం బాగా తగ్గిపోయింది. భారత ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక మండలితో కలిసి 2025-26 వస్త్ర పరిశ్రమ ఎగుమతులు 100 బిలియన్ డాలర్లకు పెంచాలని, ఉత్పాదకత హెక్టర్ కు 400 కిలోల లింట్ నుండి 900 కిలోల లింట్‌కు పెంచాలనే దీర్ఘ కాలిక లక్ష్యం నీరు కారుతోంది. భారత వస్త్ర పరిశ్రమలో ఆరు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు, అమెరికా ఒత్తిడితోపాటు తక్కువ ధర అనే పేరుతో విదేశీ పత్తి దిగుమతులు పెంచితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు ప్రధాన మంత్రి స్వరాష్ట్రం గుజరాత్ రైతులపై కూడా ఇది పెనుప్రభావం చూపుతుంది. విదేశీ దిగుమతులు కాకుండా స్వదేశీ ఉత్పత్తి వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. దీనికి ముందుగా దేశ ఆర్థిక స్వావలంబన నిలబెట్టే ప్రయత్నం చేయాలి. కానీ రైతులను ప్రోత్సహించకుండా వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోడీ సర్కార్ విదేశీ దిగుమతులపై మక్కువ చూపడం ఇక్కడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడమే అవుతుంది.
– బొంతు రాంబాబు,
9490098205.