ఉన్నత విద్య నియంత్రణ వ్యవస్థలో భారీ మార్పులు
వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు-2025తో కేంద్రం సిద్ధం
ఒకే ‘గొడుగు సంస్థ’ కిందకు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలు
బిల్లుపై సర్వత్రా పలు సందేహాలు
కేంద్రానికి ఎక్కువ అధికారాలు.. రాష్ట్రాల పాత్ర పరిమితం
బిల్లుపై విస్తృత చర్చ అవసరం : విద్యావేత్తలు, నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలోని ఉన్నత విద్య నియంత్రణ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు-2025 ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సహా పలు నియంత్రణ సంస్థలను రద్దు చేసి, ఒకే ‘గొడుగు సంస్థ’ కిందకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 12 మంది సభ్యులతో కూడిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ (వీబీఎస్‌ఏ) అనే అత్యున్నత కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని కింద నియంత్రణ (వినిమయన్), అక్రిడిటేషన్ (గుణవత్త), ప్రమాణాలు (మానక్) అనే మూడు వేర్వేరు కౌన్సిళ్లు పని చేస్తాయి. ఈ మూడు కౌన్సిళ్లు ఒక్కోటి గరిష్టంగా 14 మంది సభ్యులతో పని చేయనున్నది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఇప్పటి వరకు ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఐసీటీఈ), టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(ఎన్‌సీటీఈ) వంటి సంస్థల బాధ్యతలు వీబీఎస్‌ఏ అనే ఈ కొత్త వ్యవస్థలో విలీనం అవుతాయి.
ఇక యూజీసీకి ఉన్న నిధుల (గ్రాంట్లు) పంపిణీ అధికారం ప్రభుత్వం చేతికి వెళ్లనున్నది. ఆ బాధ్యతను నేరుగా విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అయితే ఆ యంత్రాంగం ఎలా పని చేస్తుందో బిల్లులో స్పష్టత లేదు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, సాంకేతిక, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు, ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ వంటి సంస్థలు ఈ చట్టం కిందకు వస్తాయి. మెడిసిన్, లా, డెంటిస్ట్రీ వంటి వృత్తి విద్యా కోర్సులు మినహాయింపులో ఉన్నాయి. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు పెట్టేందుకు ప్రమాణాలు నిర్ణయించే అధికారం, భారత విశ్వవిద్యాలయాలు విదేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి అనుమతులు ఈ కొత్త నియంత్రణ మండలికి ఉంటాయి.
విద్యా స్వతంత్రత, ఫెడరలిజంపై సందేహాలు
2018లో తీసుకొచ్చిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసీఐ) బిల్లు లాగే తాజా బిల్లు పైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లు.. చట్టంగా మారితే కేంద్రానికి ఎక్కువ అధికారాలుంటాయనీ, రాష్ట్రాల పాత్ర పరిమితమవుతుందనీ, అకడమిక్ స్వతంత్రతకు ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యా స్వతంత్రత, ఫెడరలిజం, రాష్ట్రాల పాత్రపై సందేహాలూ పెంచుతోంది. కాబట్టి ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.
ఇకపై వీబీఎస్‌ఏ?
- Advertisement -
- Advertisement -



