భయాందోళనలో ప్రజలు..
అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో సంచరించిన పెద్ద పులి.. ఆదివారం మానేరు నది దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 27న శనివారం సాయంత్రం మంథని మండలం భట్టుపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు..ఆదివారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. భట్టుపల్లి అటవీ ప్రాంతం నుంచి అడ విసోమన్పల్లి మానేరు నదిలో పులి అడుగుల కోసం అన్వేషణ చేపట్టారు. అయితే మానేరు తీర ప్రాంతంలో అడుగులు కన్పించకపోవడంతో అధికారులు అడవిలోనే మకాం వేసినట్లు భావించారు.
కానీ ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. మంథని, ముత్తారం మండలాల్లోని మానేరు తీర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. అయితే ముత్తారం మండలం ఓడేడ్,అడవిశ్రీరాంపూర్ మానేరు నది మీదుగా చిట్యాల వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు భావించారు.
వారు భావించినట్లుగా భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో ప్రవేశించి ఎద్దుపై దాడిచేయడంతో చుట్టుపక్కల టేకుమట్ల, ఎంచరామి, మల్హర్ మండలంలోని నాచారం, కాపురం గుట్టలు, కిషన్ రావుపల్లి, వన్ ఇన్క్లయిన్ అటవీప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు, పశువుల కాపర్లు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని, ఓంటరిగా వెళ్ళొద్దని పారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఎఫ్ఎస్వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోని కిరణ్, అఫ్టల్ అలీ, ఎఫ్బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.



