Sunday, November 23, 2025
E-PAPER
Homeసోపతిపశుల కాపరి నుండి ప్రజా కవిగా…

పశుల కాపరి నుండి ప్రజా కవిగా…

- Advertisement -

ఆధునిక తెలుగు కవిత్వంలో అందెశ్రీ సహజ కవి. అపారప్రతిభాసంపన్నుడు . జాతిని జాగతం చేసే పాటల జాతరలా నిత్యం ప్రతిధ్వనించాడు . మబ్బుగుండెనుండి వానచినుకు రాలిపడినట్లు మట్టిని చీ ల్చుకొని మొక్క దూసుకొచ్చినట్లు అందెశ్రీ గుండెల్లోనుండి పాట అలవోకగా ఉబికి వచ్చింది.వెదురు ముక్కవేణువై వేన వేల రాగాలు పలికి నట్లు, తాపీ మేస్త్రి ఒకతత్త్వ కవిగా పరిణామం చెంది ప్రజా విముక్తి గీతాలను ఆలపించాడు. సంకల్ప శక్తితో ఏకలవ్యుడిలా సాధన చేసి, వినికిడి జ్ఞానంతో, సామాజిక పరిశీలనతో, అసాధారణ ధారణాపటిమతో లోక కవి గా ప్రసిద్ధిచెందాడు. పొట్టపొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షరం ముక్కరాని అందెశ్రీ కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకొని అందరికీ మార్గదర్శిగా నిలిచాడు.
పశులకాపరిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కషితో ప్రజా కవిగా రాణించి నీరాజనాలు అందుకున్నాడు. మట్టి చేతులతో మహాగీతాలు రాశాడు. బడిలో చదవక పోయినా అకుంఠిత దీక్షతో పాటల బడిగా ఎదిగిన అందెశ్రీజీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం.

1961 జూలై 18 ఉమ్మడి వరంగల్‌ జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ (అందె ఎల్లయ్య) తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరమై అనాథలా పెరిగాడు. బాల్యంనుండే అంటరానితనం ముళ్ళకంచెల మీద నడుస్తూ, ఆకలిఎడారిలో సంచరిస్తూ పశువుల గాచే జీతగాడిగా మారాడు. ముక్కుపచ్చలారకుండానే కాయకష్టం ఒడిలో, కన్నీళ్ళతీరంలో పెనుగులాడాడు. తన దగ్గర జీతగాడిగా పనిచేస్తున్న అందెశ్రీకి జక్కిరెడ్డి మల్లారెడ్డిహొ రామాయణ, మహాభారత కథలను పరిచయం చేశాడు. ”ఊరేనాకు స్ఫూర్తినిచ్చిన కీర్తి కిరీటం” అని తాను చెప్పుకున్నట్లుగా అక్షర జ్ఞానం లేని అందెశ్రీ కి రేబర్తి పెద్దబాల శిక్షయై మౌలిక జ్ఞాన వనరులను బోధించిచింది. ఊరే ఆయనకు సాంఘీక శాస్త్రమయింది. ఈ పాలబుగ్గల జీతగాడికి ప్రకతి మాత పాఠాలు నేర్పింది. పల్లె తల్లి నిఘంటువై జీవ భాషను నూరిపోసింది. పల్లె అందెశ్రీకి పాట నేర్పి, మాట నేర్పి బతుకు బాట చూపించింది. ప్రతినిత్యం పల్లెలో ప్రతిధ్వనించే యక్షగానాలు, శారదగాండ్ర కథలు, ఒగ్గు కథలు జానపద కళారూపాలు అందెశ్రీకి సజనోత్తేజాన్ని కలిగించాయి. తాపీ మేస్త్రీగా జీవిస్తూ పల్లె పాటలు పాడుకుంటున్న అందెశ్రీకి శంకర్‌ మహరాజ్‌ సరికొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించాడు. ”ఎవరో రాసిన పాటల్ని ఎన్నాళ్ళు పాడతావు? నీవే కైగట్టాలి” అన్న శంకర్‌ మహారాజ్‌ మాటలతో, అందెశ్రీ స్వయంగా పాటలు అల్లడం సాధన చేశాడు. బిరుదురాజు రామరాజు సాంగత్యంలో జానపద సాహిత్యవిశిష్టతను అవగతం చేసుకున్నాడు . పరిశీలనాజ్ఞానంతో భాషమీద అపారమైనపట్టు సాధించాడు. పామరులతో, పండితులతో, సాధువులతో, ఉద్యమ నాయకులతో, కార్యకర్తలతో, ఆచార్యులతో, విద్యార్థులతో ఎప్పటికప్పుడు అనుబంధం పెంచుకొని వారితో సంభాషిస్తూ, వాదిస్తూ తద్వారా సముపార్జించుకున్న అనుభవాలతో తన సజన నైపుణ్యానికి పుటం పెట్టుకున్నాడు.
‘సాగేజీవన సమరంలో నిన్నుచూడకుండా నిలువ/ నవతరంగములతో/ పరుంగులిడుహొరసతురంగములును/ విరించి తలపుల/ విపంచి. రవముల తపించే గీతిక” అంటూ పాటకోసం, వినూత్న కవనం కోసం పరితపించాడు. పద్య కవిత్వం వైపు దష్టి సారించి అందెశ్రీ రాశాడు

”మేఘాల లోగిళ్ళ మెరుపు తీగల దాగి/ ఉరుముల శబ్దమై ఉన్నదెవరు?
అజ్ఞానమును చీల్చ విజ్ఞాన జ్యోతిగా/ జిజ్ఞాస కలిగించు జీవ మెవరు..?.

అణువుఅణువులో వినిపించు ధ్వనివి నీవె/…హొవసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ” పంచమాత్రా గణాలగతిలో పరిణితి చెందిన పద్యకవిలా వాక్కులమ్మను ప్రస్తుతించాడు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల ప్రభావంతో మునిగితేలుతున్న అందెశ్రీ, ‘పల్లెటూరి పిల్లగాడా పశుల గాచే మొనగాడా” అనే పాటలో తనను తాను చూసుకొని ప్రజాకవుల ఒరవడిని అందిపుచ్చుకున్నాడు. సుద్దాల హనుమంతు, గూడా అంజయ్య, గద్దర్‌, గోరటి వెంకన్న, అశోక్‌ తేజ, జయరాజు తదితర కవుల స్ఫూర్తితో భక్తి పాటల వైపు నుండి ప్రజా విముక్తిగీతాల వైపు చూపు సాగిపోయాడు.
”అల్లిబిల్లి అంగురతోట/ నేను పాడుకుంటూ పోయేది పల్లెపాట/ పల్లె పాటెంట బోతుంటే పల్లెబాట నేను మెల్లంగా చేరాలి సిద్దిపేట” అంటూ సునాయాసంగా పాటను ఆలపించాడు. సిద్దిపేటకు వెళ్ళే ప్రయాణ మార్గాన్ని, అందులోని మలుపులను, పంటపొలాల సోయగాలను ఆసక్తి దాయకంగా పాటగా మలిచి, ప్రారంభ దశలోనే అందెశ్రీ కవి గాయకుల మనసులను గెలుచుకున్నాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అందెశ్రీ లలితగీతాలు విని, బోయి భీమన్న ఇంటికి పిలిచి అందెశ్రీని అభినందించి ప్రోత్సహించాడు.

పద్య , పాటతో పాటు అందెశ్రీ వచన కవిత్వంలోనూ సముచితమైన ప్రతిభ ప్రదర్శించాడు. ‘అందెల సందడి1994’ సంకలనంలోని కవితల్లో దళితసాహిత్యం, స్త్ర్రీవాద సాహిత్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ‘వాస్తవాలను వక్రీకరించే కవిత్వం ఒక కవిత్వమేనా?’ అంటూ ఆయన సాహిత్య నైజాన్ని ఎత్తి చూపాడు. ‘ఆర్యుల ఆధిపత్యం, ద్రావిడుల దాసోహం గురించి ‘ఇదేనా సంస్కతి’ విమర్శనాత్మకంగా ప్రశ్నించాడు. మనిషిని విస్మరించి, దైవాల పేర ఇలలో ధనాన్నంతా తగలబెడుతున్నారని, ధర్మం శరణం గచ్చామి అన్న బుద్ధుని బోధనల్ని బురదలో తొక్కేశారని ‘సాదశ్యం’ అందెశ్రీ ఆరోపించాడు. ‘కారంచేడు కాలనాగులను’ ”చుండూరు దళితుల గుండెల్లో చురకత్తులు దించిన” మహా హంతకులను, ‘కులపిచ్చి గాళ్లను, మత ఉచ్చుగాళ్లను’ కవిత్వంలో ధిక్కరించాడు. ‘నేను నీకు బానిసనా?’ అనే కవితలో యుగాల నుండి స్త్రీలను దగాచేస్తున్న పురుషాధిపత్యాన్ని తదనుగుణమైన రాజకీయాలను నిరసించాడు.

బహుముఖీనమైన తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని తన పాటల్లో అందెశ్రీ అద్భుతంగా గానం చేశాడు, ”చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన” అంటూ తెలంగాణ కరువు పరిస్థితులను, వలసపాలనలో జరిగిన విధ్వంసాన్ని కళాతత్త్వ భరితంగా పాటలో చర్చించాడు. తెలంగాణ గుండె డప్పు వినిపించాడు. ‘జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతులు ఒక్కటైన చేతనం’ అనేపాట మలిదశ ఉద్యమానికి మహత్తరమైన స్ఫూర్తిని అందించింది. ఈ పాట తెలంగాణ జనగీతమై, వైతాళిక గానమై నింగీనేలా మారుమ్రోగింది. తెలంగాణ చారిత్రిక, సాంస్కతిక, సాహిత్య వైభవ, ప్రాభవాలను, ఆత్మగౌరవ చైతన్యాన్ని ఈ పాటలోఅందెశ్రీ ఉత్తేజభరితంగా ఆవిష్కరించాడు. ఉద్యమ సందర్భంలో అశేష ప్రజాసమూహాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట తెలంగాణ జాతీయ గీతమై దశ దిశలా మారు మోగుతుంది. ”జన జాతరలో మన గీతం/ జయ కేతనమై ఎగరాలి/ జంఝామారుత జన నినాదమై జేగంటలు మ్రోగించాలి” పాట అణువణువులో ఉద్యమోత్తేజాన్ని రగిలించింది. గుండె గుండెలో అనంతమైన భావోద్వేగాన్ని ప్రజ్వలింప జేసింది. ప్రత్యేక రాష్ట్ర పోరాట కార్యాచరణను ఈ పాట వేగవంతం చేసింది. ”నిప్పులు చెరిగే తుపాకి రవ్వల గుప్పెటబట్టి నలిపేస్తాం’/ నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం/ లాఠీలిరిగినా లడాయి మానం/ పిడుగులుపడ్డా మడిమలుదిప్పం” ఇలాంటి అసాధారణ భావాల్లో తెలంగాణ ఉద్యమావేశాన్ని అందెశ్రీ ప్రభావశీలంగా పలికించాడు. ”రోషం గుండెలో రోకలి బండలు/ బిగిసిన పిడికెళ్లు వాడిసెలరాళ్ళు” అంటూ ప్రజల్లో పోటెత్తుతున్న ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని సమున్నతంగా పాటలో ప్రతిఫలింపజేశాడు. ”జైబోలో తెలంగాణ గళగర్జనల జడివాన” లాంటి పాట చరణాలు ఊరూ వాడా పోరు విత్తనాలను నాటాయని చెప్పవచ్చు. ”నీలంపు చీరె లెల్ల దచ్చన్న దారిలో” అంటూ తెలంగాణ ఆడబిడ్డల పోరాట పటిమను, వారి ఉద్యమైక దష్టిని గొప్పగా పాటబద్ధం చేశాడు
తెలంగాణ ఉద్యమ సందర్భంలో ”చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి” పాట ధూమ్‌ ధామ్‌ సభలకు చుక్కానిగా నిలిచింది. ఈ పాటతో అందెశ్రీ ప్రతి హదయంలో పల్లె ఆనవాళ్లను ప్రతిష్టించాడు. ”చేతి కుల వత్తులకు చెయ్యెత్తి దండం బెడతా” అంటూ వత్తి కార్మికుల అసమాన శ్రమైక జీవన ఔన్నత్యానికి అందెశ్రీ జేజేలు పలికాడు. నిసర్గ సౌందర్య శోభితమైన పల్లె జీవనానికి ప్రాణమెవరో ఈ పాటలో అందెశ్రీ సోదాహరణగా అక్షరబద్ధం చేశాడు. ఊరిబయటకు నెట్టివేయబడిన దళిత, బహుజనులే ఊరికి దివిటీలుగా, రక్షణగా, నిలుస్తున్నారని వీరకెవరూ సాటిరారని పాటలో కీర్తించాడు. ప్రాచీన సాహిత్యంలో కులవత్తిగతమైన శ్రమను ఆదర్శీకరించి ఆ వత్తికారులకు గౌరవ మర్యాదలను నిషేధించారు. ఈ రకమైన దుర్నీతిని కవి నిరసించాడు. ఈ పాట వింటే కులవత్తి కార్మికులపట్ల గొప్పగౌరవం పెరుగుతుంది.

మర్రి విత్తనంలో మహా వక్షం దాగిఉన్నట్లు అందెశ్రీ పాటల్లో బతుకు తత్త్వం ఉట్టిపడుతుంది. ”కనరా కనరా కాలాన్ని/ వినరా వినరా విశ్వాన్ని”, కాలం కరవాలం/ కాకున్నదేదీ ఆహారం లాంటి పాటల్లో అందెశ్రీ ఒక తత్త్వవేత్తలా దర్శనమిస్తాడు
‘దారిన నడువు దైవము నీవే/ దారి తప్పితే దెయ్యం నీవే’, ”కొమ్మ చిక్కితేబొమ్మరా/ కొలిసిమొక్కితే అమ్మరా”, ‘అందరూ వచ్చిందొకటే ద్వారం, అందరూ ఒక్కటే, ఎందుకు దూరం?” వంటి అందెశ్రీ సూత్రీకరణలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ప్రపంచీకరణ సంస్కతి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మానవ సంబంధాలు మగ్యమవుతున్నాయి. ఆర్థిక తీవ్రవాదంతో మనిషి పచ్చిస్వార్ధపరుడై ప్రవర్తిస్తున్నాడు. కులోన్మాదిగా, మతోన్మాదిగా, కామోన్మాదిగా మారిపోతున్నాడు. ప్రమాదకరమైన సామాజిక వైపరీత్యాన్ని సరళ సుందరంగా విశ్లేషిస్తూ అందెశ్రీ ఆలపించిన ”మాయమై పోతున్నాడమ్మా/ మనిషన్నవాడు” అనే పాట మానవతా పతాకమై సాహిత్యంలో చిరస్థాయిగా నిలుస్తుంది. వస్తు వినిమయ సంబంధ బాంధవ్యాల తీరుతెన్నులను ఈ పాటలో శక్తివంతంగా కవి ఆవిష్కరించాడు. దశాబ్ద కాలం పాటు డిగ్రీలో పాఠ్యాంశంగా వున్న ఈ పాట వేలాదిమంది విద్యార్థుల్లో మూర్తిమత్వ స్ఫూర్తిని కలిగించింది. ”మనిషి తనమే నాకు పరాకాష్ఠ. మనిషి తనపు ఆనవాళ్ళ చిరునామా ఎక్కడ వుంటుందో నేను అక్కడ ఉంటాను” అని చెప్పిన అందెశ్రీ ఈ సమున్నత సందేశాన్ని తన పాటల్లో పొందు పరిచాడు.

ఒకప్పుడు బస్సు చార్జీకి కూడా డబ్బులు లేక హైదరాబాద్‌ నగరమంతా కాలినడకన తిరిగిన అందెశ్రీ ఆరుపదుల వయస్సులో పరమ ఉత్సాహంగా విశ్వ సంచారం చేశాడు. మహా కావ్యం రాయాలనే సంల్పంతో ప్రపంచ నదులను సందర్శించాడు. అరుదైన పర్యటనానుభవాలతో నది అనే దీర్ఘకావ్యానికి శ్రీకారం చూట్టాడు. ”నదినడిచిపోతున్నది/హొననుహొ నావనై రమ్మన్నది/ నాలో ప్రాణం దాగున్నది/ పాదాలు లేకున్న పయనమెపుడాగదు/ ఎదురేది నిలుచున్న బెదిరి వెనుతిరిగదు/ గాయలు ఎన్నయినా గానమై గమనాన/ నది నడిచిపోతున్నది”. నది ప్రతీకగా చేసుకొని, అనంత జీవనతత్వానికి అందెశ్రీ అపురూప భాష్యం చెప్పాడు.
”తొలి చినుకు పడగానే/ నేల నెల దప్పింది/ తొలకరి జల్లులతో పుడమి పురివిప్పింది/ ప్రకతికి హారమై/ జీవనాధారమై/ కొండలను కోనలనుహొకొన గోటహొగెలిచింది/ నేలపై నెలవంక తీరమైహొనిలిచింది/ అడవులను ముద్దాడి ఆకుపసరయ్యింది/ లోయల్లో పాయలుగ/ ఊయలలూగింది” ఇలా అవిచ్చిన్నంగా సాగే అందెశ్రీ సజన వాహిని పాఠకుల్ని ప్రరవశింప జేస్తుంది. అందెశ్రీ మరణంతో ఈ కావ్యం అసంపూర్ణంగా మిగిలిపోయింది.

ప్రజా కవిగా, గాయకునిగా
వాగ్గేయకరునిగా ప్రఖ్యాతి గాంచిన అందెశ్రీ సంపాదకుడిగా, ప్రచురణ కర్తగా కూడా ఆదర్శనీయమై పాత్ర పోషించాడు. సాయుధ పోరాటం దగ్గరనుండి తొలిదశ, మలిదశ తెలంగాణా ఉద్యమం వరకూ వచ్చిన వందలాది పాటలను, వచన కవితలను సేకరించి ‘నిప్పుల వాగు’ పేరుతో ఆయన బహత్‌ సంకలనాన్ని ప్రచురించాడు. పాటలకూర్పులో, ప్రాధాన్యత క్రమంలో చిన్న చిన్నలోపాలు ఉన్నప్పటికీ నిప్పులవాగు సంకలన గ్రంథం ఒక గొప్ప ప్రయత్నగా చెప్పవచ్చు. అందెశ్రీ వాక్కులమ్మ ప్రచురణసంస్థను స్థాపించి అరుదైన పుస్తకాలు ప్రచురించడం విశేషంగా భావించవచ్చు. సౌందర్య లహరి, పప్పు వేణుగోపాలరావు సరళ వ్యాఖ్యానం ‘శ్రీ శూద్రగంగ’, సుద్దాల అశోక్‌ తేజ ‘సష్టి గర్భ’, దీర్ఘాసివిజయ భాస్కర్‌ ‘హసిత భాష్పాలు’, శ్రీరామ్‌ లాంటి విశిష్ట కావ్యాలను అందెశ్రీ ఎంతో బాధ్యతాయుతంగా ప్రచురించాడు. వట్టికోట ఆళ్వారు స్వామిలా ఈ లోకకవి సమకాలీన కవుల రచనలను గుండెలకు హత్తుకున్నాడు. గంగ, బతుకమ్మ వంటి సినిమాలకు సంభాషణలు అందించడంతో పాటు ఇరవైకి పైగా పాటలు రాసి సినిమా కవిగా కూడా అందెశ్రీ టాలీవుడ్‌ మన్ననలు అందుకున్నాడు.

ఒక్కొక్కసారి జానపదాల రీతిలో, మరొకసారి లలిత గీతశైలిలో ఒక పర్యాయం సంస్కత సమాస భూయిష్ట రచనా సంవిధానంతో ఇంకొక్కసారి అచ్చమైన తెలంగాణ నుడికారంతో లయాత్మకమైనపద విన్యాసంతో సాగే అందెశ్రీ పాటలు, ఆయనబాణీలు విలక్షణంగా ఉంటాయి. భావ గర్భితంగా, రాగరంజితంగా దీర్ఘ శ్రుతిలో, తీవ్ర ధ్వనిలో పాటలు ఆలపిస్తుంటే అందెశ్రీ గాన కళా ఝరిలో మునిగి ప్రేక్షకులు మైమరచి పోతారు. సామాజిక స్ఫూర్తి, ఆధ్యాత్మిక ఆర్తి కలగలిసిన స్వతంత్రమైన తాత్త్విక దష్టి ఆయన పాటల్లో, మాటల్లో తొంగిచూస్తుంది. అందుకే ప్రజాస్వామ్య వాదులతో పాటు గణపతి సచ్చిదానందస్వామి లాంటి సాధు పుంగవులుకూడా, అందెశ్రీ పాటను అభిమానించారు. తనకుల అస్తిత్వాన్ని ఆయన అంగీకరించలేదు. విశ్వనరుడిగా వెలుగొందాలనే సదా ఆరాటపడ్డాడు.
”పాటను కనటానికి కూడా కవి ప్రతిరోజూ అమ్మలా ప్రసవ వేదన పడకపోతే ప్రజల్లో నిలబడలేడు. నిత్యం అమ్మ తనాన్ని ఆపాదింప జేసుకొని పరకాయ ప్రవేశం చేసి ప్రజల ఆలోచనలకు రూపమై జనహదయాంతరాళాల్లోకి తెలియకుండా ప్రవేశం చేసేవాడే కవి” అని నిర్వచించిన అందెశ్రీ ఈ రకమైన రచనా రీతితోనే చివరిదాకా సజన సాగించాడు. వైవిధ్యభరితమైన, స్వల్ప వైరుధ్య భరితమైన అందెశ్రీ పాటల గురించి లోతైన చర్చ జరగాల్సిన అవసరముంది.

అలభ్యంగానున్న అందెశ్రీ పాటల సంపుటి, కవితా సంకలనాన్ని, ఆయన పాటలను పునర్ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అసంపూర్ణంగా మిగిలిపోయిన అందెశ్రీ నది కావ్యాన్ని పరిష్కరించి ప్రచురించాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు అందెశ్రీ సమగ్ర రచనల సంకలనాన్ని ప్రచురిస్తే ఆయన సాహిత్య పరిణామ క్రమం అందరికీ అర్ధమవుతుంది. ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసినట్లు’ సంపద్వంతమైన సాహిత్యాన్ని జాతికి అందించి కవన నక్షత్రమై నింగినధిరోహించిన అందెశ్రీ ప్రజల గుండె గొంతుల్లో కాలంతో పాటు ప్రతిధ్వనిస్తుంటాడు.

డా|| కోయి కొటేశ్వరరావు, 9440480274

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -