Sunday, March 1, 2026
E-PAPER
Homeకవితవ్యక్తిగతం నుంచి సార్వత్రికం వైపు 'కూతురు పద్యం'

వ్యక్తిగతం నుంచి సార్వత్రికం వైపు ‘కూతురు పద్యం’

- Advertisement -

గజ్జెల రామకృష్ణ ‘దీపముండగానె (2022), చంద్రుడు లేని ఆకాశం(2023) పేర్లతో రెండు కవిత్వ సంపుటులు వెలువరించిన కవి. చదివింది పదవ తరగతి. వృత్తి చేనేత. పుట్టింది భూదాన్‌ పోచంపల్లి. గిజిగాడు గూడును అల్లుకున్నంత నేర్పుతో, చేనేత మగ్గం మీద నేసిన చీరంత ఒద్దికతో జీవితాన్ని ఏ పోగుకాపోగు పురిపెట్టుకుంటూ పడుగు పేకల జమిలీతో కవిత్వాన్ని నేస్తున్న శ్రమజీవి. ఆసుపోసే అమ్మలు, నేతన్నలు, అడ్డామీది బతుకులు తన కవిత్వ వస్తువులు. తనలాంటి చెమట పువ్వులు ఎక్కడ తారసపడినా కవిత్వపరంగా కలంతో అద్దుకునే కవి. కుతి దీరని కవిత్వ పిపాసి. ‘వస్తువు’ వ్యక్తిగత జీవితాల్లోంచి పుట్టకొచ్చినా దాన్ని ‘సార్వత్రికం’ వైపు నడిపించే నిర్మాణ వ్యూహం తన కవిత్వంలో కనిపిస్తది. వైయక్తిక అంశాల్ని నెమరువేసుకోవడం ‘నాస్టాల్జియా’ అయితే దాన్ని సామూహిక పలవరింతగా మార్చడం తెలిసినవాడు. అతిసున్నితమైన అంశాల పట్ల తీక్షణమైన చూపును కలిగివున్నప్పుడు గుండె పటువలోంచి ఏ ఉద్వేగపుచిత్రపు బొట్లు ఒలికిపోవు.

కూతురంటే నాన్నలకు అమ్మంత బలిమి. మానసిక బంధం. పసిప్రాణాల విలువ తెలియని హదయంలేని మనుషులున్న సమాజంలో బతుకీడుస్తున్న వాళ్లం. కాసింత నెనరు లేని, పాయిరంలేని, ప్రేమలేని; జాలి, కరణ, దయ అసలే లేని ఒట్టిపోయిన శూన్యాన్ని అనుభవిస్తున్నవాళ్ళం. విచక్షణ లేని ప్రాంగణంలో బెరుకు బెరుగ్గా తిరుగాడుతున్న వాళ్లం. కూతురెప్పుడూ నాన్నల గుండెల మీది కుంపటి కాదు.. ఎప్పుడేమవుతుందోనన్న భయం తాలూకు అభద్రతా భావం. ఎదుగుతున్న క్రమంలో సహజంగానే ఏర్పడే లక్షణం. చిట్టితల్లులు ఎప్పటికీ చిన్నపిల్లలే.. అందుకే నాన్నలకంత దిగులు. ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి మనస్తత్వం, కూతురిపై వున్న ఎనలేని ప్రేమ ‘కూతురు పద్యం’ కవితలో ఆవిష్కతమైంది. కూతురున్న నాన్నల అంతరంగం అక్షరమక్షరంలో తడితడిగా తగులుతుంది. సమాజంతో ‘కూతురు’ సర్దుబాటు ధోరణిని శారీరకంగా, మానసికంగా నాన్నలు అర్ధం చేసుకోవాలి. శారీరకంగా వున్న దగ్గరితనం వారి భౌతిక అవసరాలను తీర్చడం నుండి క్రమక్రమంగా మానసిక బంధంగా స్థిరపడుతుంది. సహజంగానే కూతురికి తండ్రి పట్ల వుండే ‘ఎలక్ట్రా కాంప్లెక్స్‌’ తండ్రి కోణం నుంచి కవిత్వమైన తీరును గమనించవచ్చు. కార్ల్‌ జంగ్‌ ప్రతిపాదించిన ఈ భావన ఫ్రాయిడియన్‌ మనస్తత్వ శాస్త్రంలో కీలకంగా పరిగణిస్తారు. అయితే ఎలక్ట్రా కాంప్లెక్స్‌ లో తండ్రి పట్ల వుండే ఆకర్షణతో పాటు, తల్లి పట్ల నెగేటివిటీని ఏర్పరచుకుంటరు. బాల్యదశను దాటుకుని యవ్వనంలోకి అడుగుపెడుతున్నప్పుడు తల్లిని అనుకరించడం మొదలైతది. అప్పుడు ‘ఎలక్ట్రాకాంప్లెక్స్‌’ ప్రభావం తగ్గుముఖం పడుతది. కూతురు చిన్నప్పుడు తండ్రికి ఎంత దగ్గరగా వున్నప్పటికీ, తల్లి అవసరమున్నప్పుడు సర్ధుబాటు చేసుకోవడం వల్ల ప్రాధాన్యతలు మారుతుండడం సహజమనే విషయాల్ని నాన్నలు అర్థం చేసుకుంటరు. ఎదుగుతున్నప్పుడు పిల్లల్లో కలిగే బిడియం, తల్లిదండ్రుల్లో ఏర్పడే భయం తెలియని సంఘర్షణకు కారణమైతది. ”సంఘర్షణ తీవ్రత’ ను అర్థం చేసుకోవడం ద్వారా పిల్లలు మరింత దగ్గరైతరు.
కవి ప్రతి సందర్భాన్ని కవిత్యమయం చేసే పనిలో నిమగమవడం చూస్తాం. సూర్యుని చుట్టు తిరిగే భూమిలా, పొట్టమీద కాళ్ళేసి గుండె గిలక పట్టుకోవడం, వొంటి బోయ పల్లకినెక్కడం, నడక పాఠమవడం, లాలిపాటవడం నుండి ప్రతీకలు ఉమ్మడి నిద్ర వేరు కుంపటి అవడం, నాన్నదిండు చెమట కంపు అవడం, కలలన్నీ పర్సనల్‌ అవడం, రాత్రులన్నీ ముందు సీటు లేడీస్‌ దన్న బస్సు ప్రయాణంలా తోచడం, నాన్న గుండె బెంగపడడం, దూరం జరగడంలో పాలు మరిపించే తల్లిని చూడడం ; దినమింత ఎడబాటు గడ్డకట్టడం; గడప గడపకూ విరబూసిన కూతురు పద్యం అవడం వరకు ప్రతీది కవి సజన నైపుణ్యాన్ని తెలియజేస్తయి. ప్రతికల్ని వాడడం ద్వారా భావోద్వేగాల్ని పలికించడం ప్రధానంగా కనిపిస్తది.
వస్తుపరంగా కవి ఏర్పర్చుకునే భావాలు ఒక్కోసారి స్థిరమైనవి కాకపోవచ్చు. అసంగతంగానూ వుండొచ్చు. వైయక్తిక అభిప్రాయాల్ని, అనుభూతుల్ని గౌరవించాలి. వస్తువును చూసే దష్టి కోణం నుండే కవిత్వ నిర్మాణం జరుగుతుందని కవికి వేరే చెప్పనక్కర్లేదు. సహజ కవి ‘గజ్జెల రామకృష్ణ’ కు అభినందనలు.

బండారి రాజ్‌కుమార్‌ 8919556560

కూతురు పద్యం
నిద్ర మానుకుని ఊయలప్పుడు లాలిపాటయినందుకు
రాత్రులు పగబడుతాయని అనుకోలేదు
అది పుట్టినప్పుడే
అవి తాడు పేనుకున్నయి
అది ఇంతున్నపుడు
ఆ పాదాలకు నడక పాఠమయినందుకు
ఈ పాదాల వెంటపడ్డ
ముద్దు ముద్దు మారాము సంగీతం
ఫ్యాను గాలి దొంగలా
కరెంట్‌ పోయినపుడల్లా
అమ్మపాలు తాగిన కమ్మటి మత్తునిద్రయినా
ఉక్కపోత రాగానికి
భళ్ళున తెల్లారినట్టు
ఈ భుజమను వొంటిబోయ పల్లకి నెక్కి
వెన్నెల వీధులలో ఊరేగిన
కిరీటం తొడుగని మహరాణి
ఈ పొట్టమీద కాళ్ళేసి
ఈ గుండె గిలక పట్టుకుని
ఉలిక్కిపడని చిట్టి కన్నుల మధుర స్వప్నం
సూర్యుని చుట్టూ తిరిగే భూమిలా
ఈ చేయి వొదలని చిట్టి దీపం
ఇకపై రాత్రులన్నీ
ముందుసీటు లేడీసుదన్న
బస్సు ప్రయాణం
ఇన్నాళ్ళు ఉమ్మడి నిద్ర ఇవ్వాళ వేరుకుంపటి
నిన్నటి జోలపాట
కలవరపడుతున్న అనాధ
రెక్కలు రాగానే
అదేం చిన్నపిల్ల కాదటా
చెట్టు నొదిలి ఎగిరే పిట్టలా
ఈ నాన్న దిండు చెమట కంపయినట్టు
ఇప్పుడు కలలన్నీ పర్సనల్‌ అట
ఉన్నట్టుండి
పై చదువు మెట్లెక్కి
రాత్రి పగలూ పట్నం గదినిండు పుస్తకాల నడుమ బందీ అయినా అప్పటికప్పుడు అప్పగింతల పాలయినా
ఈ నాన్న గుండె బెంగపడుతుందని ఊహించినట్టు
చిట్టిది
దూరం జరుగుతున్న కొద్దీ
పాలు మరిపించే తల్లిలా
కొండంత ఎదుగుతున్న అనురాగం
కూతురున్న నాన్నంటే
దినమింత ఎడబాటు గడ్డ కడుతున్న మౌనం
ఎవరికీ చెప్పుకోలేని
గడప గడపకూ విరబూసిన కూతురు పద్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -