Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీసిటీతో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ ఒప్పందం

శ్రీసిటీతో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ ఒప్పందం

- Advertisement -

పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం
త్వరలో తెలంగాణలోనూ క్లస్టర్ల ఏర్పాటు
ఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగావకాశాలు : ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలుగురాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి, చిన్న మధ్య తరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామనీ, దీనివల్ల ఏ ప్రాంతంలో యువతకు ఆ ప్రాంతంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. స్థానిక పరిశ్రమల స్థాపన, యువతకు నైపుణ్య శిక్షణ, వెండర్‌ డెవలప్‌మెంట్‌, విద్యాసంస్థల భాగస్వామ్యం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ప్రదర్శనలు, ట్రేడ్‌ ఫెయిర్‌లను ప్రోత్సహిస్తూ, ఉద్యోగ మేళాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ పారిశ్రామిక క్లస్టర్‌తో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ అవగాహనా ఒప్పందం చేసుకుంది. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సంతకాలు చేశారు. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగులు, కార్మికులను సమీప భవిష్యత్‌లో శ్రీకాళహస్తి సమీపంలో నిర్మితమవుతున్న ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ-ఎస్‌ఎమ్‌ఈ ఇండిస్టియల్‌ పార్క్‌తో అనుసంధానం చేస్తామని తెలిపారు. త్వరలో తెలంగాణలో కూడా ఈ తరహా క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీసిటీ ఎమ్‌డీ డాక్టర్‌ రవీంద్ర మాట్లాడు తూ పరిశ్రమల్లో నాణ్యత, భద్రతా ప్రమాణాలు అత్యవసరమనీ, దానికోసం సుశిక్షితులైన కార్మికులు, ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. సమీప భవిష్యత్‌ అవసరాల కోసం తమతో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బీఐఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ డివిజన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఏ సాయి కౌశిక్‌ మాట్లాడుతూ ఈ తరహా ఒప్పందాలు భారతదేశ నాణ్యతా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. వాణిజ్యం, వినియో గదారుల రక్షణ, అంతర్జాతీయ పోటీ, ప్రమాణాల ప్రాముఖ్యత, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, వృత్తి నిపుణులు, పరిశోధనలు, సాంకేతిక ప్రమాణాలు, క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్లు, ఐఎస్‌ఐ, హాల్‌మార్కింగ్‌ నిబంధనలు, బీఐఎస్‌ కేర్‌ యాప్‌ వినియోగం వంటి అంశాలపై అవగాహన ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -