గల్ఫ్‌లో ముమ్మరంగా ఇరాన్ ప్రతీకార దాడులు
క్షిపణి దాడిలో దెబ్బతిన్న ఖతార్ గ్యాస్ క్షేత్రం
దాడులు ఆపండి : ఇరాన్‌కు 12 దేశాల విన్నపం
నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్
యుద్ధోన్మాదంతో తమ నేతలు, సైనికాధికారులతో పాటు సామాన్య ప్రజానీకాన్ని… చివరికి ఏ పాపం ఎరుగని చిన్నారులను పొట్టన పెట్టుకుంటున్న అమెరికా, ఇజ్రాయిల్ దేశాలపై ప్రతీకారేచ్ఛతో ఇరాన్ రగిలిపోతోంది. ఇరాన్- ఖతార్ మధ్య విస్తరించి, ప్రపంచంలోనే అతి పెద్ద సహజ వాయువు నిక్షేపంగా కొనసాగుతున్న సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ జరిపిన దాడితో మండిపడిన ఇరాన్ గురువారం అనేక గల్ఫ్ దేశాలలోని ఇంధన కేంద్రాలపై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఖతార్, అజర్‌బైజాన్, బహ్‌రైన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, లెబనాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సిరియా, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగ మంత్రులు రియాద్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్‌ను కోరారు. హర్మూజ్ జలసంధిలో చమురు నౌకల ప్రయాణానికి వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను కూడా వారు ఖండించారు. లెబనాన్ భద్రత, సుస్థిరత, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు తెలిపారు.
దాడులతో గల్ఫ్ విలవిల
గల్ఫ్ దేశాలలోని చమురు స్థావరాలు, అమెరికా ఆస్తులపై ఇరాన్ గురువారం దాడులు జరిపింది. ఖతార్‌లోని రాస్ లాఫన్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయి. ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రపంచంలోని అతి పెద్ద చమురు క్షేత్రాలలో ఇది ఒకటి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు సహజ వాయువును సరఫరా చేయడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. రాస్ లాఫన్‌పై జరిగిన దాడిని ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు. దాడి నేపథ్యంలో తమ దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయ సిబ్బందిలో కొందరిని ఖతార్ బహిష్కరించింది.
కాగా యూఏఈలోని హబ్‌షాన్ గ్యాస్ కేంద్రం పైన, బాబ్ క్షేత్రం పైన కూడా ఇరాన్ దాడి చేసింది. రియాద్, తూర్పు రాష్ట్రాలపై ఇరాన్ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశామని సౌదీ అరేబియా తెలిపింది. దక్షిణ ఇరాక్‌లో కువైట్ సరిహద్దున ఉన్న ఉమ్ ఖసర్ నౌకా స్థావరంలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటుపై డ్రోన్ పడడడంతో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలోని అమెరికా శిబిరంపై రెండు డ్రోన్లు పడ్డాయి. పారామిలిటరీ పాప్యులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు చెందిన ప్రదేశాలపై అనేక దాడులు జరిగాయని తెలుస్తోంది. అటు ఇజ్రాయిల్‌పై కూడా క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగించారు.
ఆ దాడి గురించి మాకేమీ తెలియదు : అమెరికా సౌత్ పార్స్‌పై ఇక ఇజ్రాయిల్ దాడి చేయదు : ట్రంప్
ఇరాన్‌కు చెందిన అత్యంత విలువైన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడులు చేయబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు. ‘అమాయకురాలైన ఖతార్‌పై దాడి చేయాలని ఇరాన్ తెలివితక్కువతనంతో నిర్ణయించుకుంటే తప్ప సౌల్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడి చేయబోదు’ అని ఆయన అన్నారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ ఆఫ్‌షోర్ ఎల్‌ఎన్‌జీ క్షేత్రంపై ఇజ్రాయిల్ జరిపిన దాడి, దానికి ప్రతిగా ఖతార్‌లోని అతి పెద్ద గ్యాస్ క్షేత్రం పైన, పర్షియన్ గల్ఫ్‌లోని ఇంధన స్థావరాల పైన ఇరాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు.
ఒకవేళ ఖతార్‌పై ఇరాన్ దాడి చేస్తే ఇజ్రాయిల్ సాయం కానీ, అనుమతి కానీ తీసుకోకుండా సౌత్ పార్స్ క్షేత్రాన్ని పేల్చివేస్తామని, ఇరాన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా తమ బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తామని హెచ్చరించారు. కాగా ఆగ్రహంతోనే ఇజ్రాయిల్ ఈ దాడి చేసి హింసాత్మకంగా ప్రవర్తించిందని, దాడి గురించి తమకేమీ తెలియదని అమెరికా కమాండర్-ఇన్-చీఫ్ చెప్పారు. అలా జరుగుతుందని ఖతార్‌కు కూడా తెలియదని అన్నారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా ఖతార్ ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంలోని ఓ భాగంపై ఇరాన్ దాడి చేసిందని విమర్శించారు.
సౌత్ పార్స్‌పై ఇజ్రాయిల్ దాడితో… భారత్‌కు గడ్డు కాలమే
యుద్ధంలో ఇంధన ఆస్తులపై జరుగుతున్న దాడులు భారత్‌కు ఇబ్బంది కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్…ఈ రెండు దేశాలూ తొలిసారిగా శిలాజ ఇంధన ఉత్పత్తికి సంబంధించిన కేంద్రాలు, క్షేత్రాలపై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు ఇంధనం ఓ ఆయుధంగా మారిపోయింది. ఈ నెల 17వ తేదీ వరకూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ ఇంధన ఉత్పత్తి కేంద్రాల వైపు చూడలేదు. ఖర్గ్ దీవిపై ట్రంప్ దాడి చేసినప్పటికీ కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ బుధవారం సీను మారిపోయింది. ఖతార్‌తో ఇరాన్ పంచుకుంటున్న సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ దాడి చేయడం, దానికి ప్రతిగా సౌదీ అరేబియాలోని సమ్రెఫ్ రిఫైనరీ పైన, అలాగే ఖతార్, యూఏఈలలోని గ్యాస్ క్షేత్రాల పైన ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధం ప్రమాదకరమైన మలుపు తిరిగింది.
భారత్ సహా అనేక దేశాలకు ఎల్‌ఎన్‌జీని సరఫరా చేయడంలో సౌత్ పార్స్ క్షేత్రం వెన్నెముకగా ఉంది. ఇజ్రాయిల్ దాడి కారణంగా చమురు, గ్యాస్ ధరలు తక్షణమే పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ముడి చమురు సరఫరాలను ఇరాన్ ఇప్పటికే అడ్డుకుంటోంది. ఇప్పుడు ఉత్పత్తి కేంద్రాలపై జరుగుతున్న దాడుల కారణంగా చమురు సరఫరాలకు మరింత ఆటంకం ఏర్పడి చాలా కాలం వరకూ ప్రభావం పడవచ్చు. ఎందుకంటే సౌత్ పార్స్ క్షేత్రంలో నిల్వ ఉండే గ్యాస్ ప్రపంచ అవసరాలను 12-13 సంవత్సరాల పాటు తీరుస్తుంది. ఈ గ్యాస్ క్షేత్రం కేవలం ఇరాన్‌కు చెందినది మాత్రమే కాదు. దానిని ఖతార్‌తో ఇరాన్ పంచుకుంటోంది. అమెరికా మిత్ర దేశంగా ఉన్న ఖతార్ ప్రపంచంలోనే ఎల్‌ఎన్‌జీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది.
మధ్యప్రాచ్యానికి వేలాది అమెరికా దళాలు
మధ్యప్రాచ్యంలో సైనిక బలగాలను మరింతగా పెంచే ఉద్దేశంతో అక్కడికి వేలాది దళాలను పంపాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. యుద్ధంలో తదుపరి చర్యలకు అమెరికా సైన్యం సమాయత్తమవుతోందని అధికారులు తెలిపారు. హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకోసం వైమానిక, నౌకా దళాల అవసరం ఎంతగానో ఉండడంతో వాటి మోహరింపునకు ఆయన సిద్ధపడుతున్నారు. ఇరాన్‌లోని ఖర్గ్ దీవిపై భూతల దాడులు చేసే అవకాశంపై ట్రంప్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఇరాన్ చమురు ఎగుమతులలో 90 శాతం వరకూ ఈ దీవి ద్వారానే జరుగుతున్నాయి.
అయితే భూతల దాడులు చేయడం ప్రమాదంతో కూడుకున్న వ్యవహారమని, ఆ దీవిపైక్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ తేలికగా దాడులు చేస్తుందని కొందరు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. పరిమిత స్థాయిలోనైనా భూతలు దాడులు జరపడం నష్టాన్నే కలిగిస్తుందని వారు స్పష్టం చేశారు. అదీకాక యుద్ధానికి అమెరికన్ల మద్దతు చాలా తక్కువగా ఉంది. కాగా ఇరాన్‌లో ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునే విషయంపై కూడా ట్రంప్ సమాలోచనలు జరుపుతున్నారు. ఇరాన్‌లో ఇప్పటికిప్పుడు సాయుధ దళాలను దింపకపోవచ్చునని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ యురేనియ నిల్వలను స్వాధీనం చేసుకోవడం సంక్లిష్టతతో కూడిన వ్యవహారమని, అంతేకాక అది ప్రమాదంతో కూడుకున్నదని నిపుణులు హెచ్చరించారు.
డిఫెన్స్‌లో ట్రంప్
ప్రపంచంలో అతి పెద్ద సహజ వాయువు క్షేత్రంగా ఉన్న ఇరాన్‌లోని సౌత్ పార్స్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడి అమెరికా అధినేతను డిఫెన్స్‌లో పడేసింది. దాడి గురించి తనకేమీ తెలియదంటూ ఆయన సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసిన ఈ దాడి కారణంగా సరఫరాలకు తీవ్ర ఆటంకం కలిగి చమురు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. సౌత్ పార్స్ క్షేత్రానికి ఓ వైపు ఇరాన్, మరో వైపు ఖతార్ ఉన్నాయి. ఇరాన్‌లోని బుషెహర్ రాష్ట్రంలో ఉన్న ఈ క్షేత్రంలో అపార గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇరాన్ సహజ వాయువు అవసరాలను 70 శాతం వరకూ ఈ క్షేత్రమే తీరుస్తోంది. అంతేకాదు… ప్రపంచ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) డిమాండ్‌లో 20 శాతాన్ని సమకూరుస్తోంది. ఈ క్షేత్రంలో 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వ ఉంది. ప్రపంచ గ్యాస్ నిల్వలో ఇది ఎనిమిది శాతం. ఖతార్ నుంచి యూరప్, ఆసియా దేశాలకు జరిగే ఎల్‌ఎన్‌జీ ఎగుమతులపై కూడా ఈ దాడి ప్రభావం చూపుతుంది.
యుద్ధానికి 200 బిలియన్ డాలర్లు ఇవ్వండి : అమెరికా కాంగ్రెస్‌ను కోరిన పెంటగాన్
ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం కోసం 200 బిలియన్ డాలర్లు అందజేయాలని అమెరికా ప్రతినిధి సభను పెంటగాన్ కోరింది. దీనికి కాంగ్రెస్ అనుమతి లభిస్తే ఆయుధ ఉత్పత్తి పెరిగి యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు గడిచాయి. ఇప్పటి వరకూ అమెరికా దళాలు 7,800కు పైగా లక్ష్యాలపై దాడులు చేశాయి. ఎనిమిది వేలకు పైగా యుద్ధ విమానాలను రంగంలోకి దించాయి. 120 ఇరాన్ నౌకలను ధ్వంసం చేయడమో లేదా నష్టపరచడమో జరిగింది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటి వారంలోనే అమెరికా 11 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇప్పుడు రక్షణ శాఖ కోరుతున్న 200 బిలియన్ డాలర్లను కూడా దానికి కలుపుకుంటే యుద్ధంపై అమెరికా చేసే వ్యయం ఇరాన్ వార్షిక జీడీపీలో సగానికి కంటే ఎక్కువే అవుతుంది. 2026 ఆర్థిక సంవత్సరానికి అమెరికా ప్రతినిధి సభ ఇప్పటికే 838.5 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది. ఇరాన్‌పై ట్రంప్ సాగిస్తున్న పోరును మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రతినిధి సభలో రక్షణ శాఖ ప్రతిపాదనపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉన్నదని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది.
ప్రపంచ నేతలకు మోడీ ఫోన్
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఒమర్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌లతో టెలిఫోన్‌లో సంభాషించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఉద్రిక్తతలను నివా రించి, చర్చలు-దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత సాధ్యపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకోసం సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. ఒమన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల ఉల్లంఘనలను మోడీ ఖండించారు. భారతీయులు సహా వేలాది మంది ప్రజలు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకోవడానికి ఒమన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలని భారత్, ఒమన్‌లు అభిప్రాయపడ్డాయని మోడీ తెలిపారు.
ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు
ఇరాన్‌లోని దొరుద్ ప్రాంతంలో అమెరికా- ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులలో 12 మంది చనిపోయారు. మరో 116 మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్‌లోని అనేక పట్టణాలపై కూడా ఇజ్రాయిల్ దాడులు జరిపింది.
అమెరికా సైనిక స్థావరంపై చక్కర్లు కొట్టిన డ్రోన్లు
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ నివసిస్తున్న అమెరికా సైనిక స్థావరం ఫోర్ట్ మెక్‌నైర్‌పై అనేక డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం, కాపిటల్ హిల్స్‌కు కేవలం 3.2 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉంది. కీలక ప్రదేశంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై అధ్యక్ష భవనంలో సమీక్ష నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంత్రులను వేరే ప్రాంతానికి తరలించడంపై అధికారులు చర్చించినప్పటికీ వారు తమ నివాసాల నుంచి ఇంకా బయటికి రాలేదు. డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై వ్యాఖ్యానించేందుకు పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సియాన్ పార్నెల్ నిరాకరించారు.
ప్రతీకార దాడులు ఆగలేదు : ఇరాన్
ఇంధన మౌలిక సదుపాయాలపై తాము జరుపుతున్న ప్రతీకార దాడులు ఆగిపోలేదని ఇరాన్ సాయుధ దళాల యూనిఫైడ్ కమాండ్ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయిల్, అమెరికా సేనలు దాడులు కొనసాగిస్తే శత్రు దేశాలు, వాటి మిత్ర దేశాల ఇంధన స్థావరాలపై మరింత బలంగా ప్రతీకార దాడులు జరుపుతామని ఆయన హెచ్చరించారు.



