భూసేకరణకు బడ్జెట్ కొరత
పనుల్లో తీవ్ర జాప్యం
పెరిగిన రూ.217 కోట్లు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధుల గండం పొంచి ఉండటంతో భూసేకరణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న చందంగా ఉంది. భూసేకరణకు నిధుల కొరతతో తొలిదశలో భూనిర్వాసితులకు నేటికీ నష్టపరిహారం అందలేదు. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. 2019లో వరంగల్ నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి రూ.50 కోట్ల అంచనాలతో ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలను రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. నాడు భూసేకరణకే రూ.20 కోట్లు అవసరమవుతుండటంతో నిధుల లేమితో ‘ఇన్నర్’ భూసేకరణ పడకేసింది. జూన్ 17, 2023లో అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి నాయుడు పెట్రోల్ పంప్ వద్ద రూ.313 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
గత మూడేండ్లుగా చెప్పుకోతగ్గ పనులేమీ చేయలేదు. వరంగల్ నగరంలో ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోడ్డు నిర్మాణ అంచనా వ్యయం అదనంగా రూ. రూ.217 కోట్ల మేరకు పెరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం మొత్తంగా 21 కిలోమీటర్ల మేరకు నిర్మించాల్సి ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశలో ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు 13 కిలోమీటర్లు 200 అడుగుల వెడల్పుతో ‘ఇన్నర్’ నిర్మించాల్సి ఉంది. భూసేకరణకు నిధుల కొరతతో ఏండ్లకేండ్లు ఈ పనులు పెండింగ్‌లో పడ్డాయి. 2019లో రూ.50 కోట్లతో అంచనాలు రూపొందించగా, 2023లో ఈ అంచనాలు రూ.313 కోట్లకు పెరిగాయి. సుమారు 360 మంది రైతులు వ్యవసాయ భూములు, నివేశనస్థలాలు, ఇండ్లను కోల్పోతున్నారు. అనేక చర్చల అనంతరం భూ నిర్వాసితులకు నష్టపరిహారం నిర్ణయించినా, నిధుల కొరతతో పనులు పడకెక్కాయి.
2022లో ఈ రహదారి పనులను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)కి అప్పగించారు. ‘కుడా’ పరిధిలోకి వచ్చాక మరో దఫా నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ చేశారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.107 కోట్ల నిధులను కేటాయించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు సుమారు రూ.121 కోట్లను పంపిణీ చేశారు. సుమారు 360 మంది భూ నిర్వాసితులుండగా ఇందులో సుమారు 250 మంది నిర్వాసితుల వరకు నష్టపరిహారాన్ని అందించారు. మరో 100 మంది నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది.
తొలిదశ ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా మరో 42 మంది నిర్వాసితులకు రూ.17 కోట్ల మేరకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు తొలి దశకే దిక్కు లేదు. నేటికీ భూసేకరణ పూర్తి కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రెండో దశలో ఎనుమాముల మార్కెట్ నుంచి జాతీయ రహదారి 163 ములుగు రోడ్డు ఆరేపల్లి క్రాస్ రోడ్డు వరకు కలపనున్నారు. వరంగల్-ఖమ్మం రహదారిలోని నాయుడు పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి దూపకుంట క్రాస్ రోడ్డు, ఖిలావరంగల్ తూర్పు కోట, స్తంభంపల్లి, జాన్‌పీరీలు, ఎనుమాముల వరకు తొలి విడతలో 4 లేన్ల ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు.
అదనంగా పెరిగిన రూ.217 కోట్ల అంచనా వ్యయం
2023లో రూ.313 కోట్లతో ఈ పనులు పూర్తవుతాయని అంచనా వేయగా, ఇప్పుడు ఆ రోడ్డు పనులు పూర్తి కావాలంటే రూ.530 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. అంటే అదనంగా రూ. 217 కోట్లు పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దలకు లాభం కలిగించేలా ప్లానింగ్ మార్చడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. 13 కిలోమీటర్ల మేరకు నిర్మించాల్సిన ఈ రహదారిలో చివరి 4 కిలోమీటర్ల ప్లానింగ్‌ను మార్చడం వివాదాస్పదంగా మారింది. ఎనుమాముల మార్కెట్ వెనుక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఒక కీలక ప్రజాప్రతినిధికి చెందిన భూమి ఉండటంతో ఇక్కడ కూడా ప్లానింగ్ మార్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ ప్లానింగ్‌ను మార్చి రైతుల భూముల నుంచి రహదారిని ‘కుడా’ అధికారులు ప్లాన్ చేశారు. దాంతో సారవంతమైన భూములుండి రెండు పంటలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కొత్తపేట, ఆరేపల్లి రైతులు ‘కుడా’ అధికారులు మార్చిన రోడ్డు ప్లానింగ్‌పై భగ్గుమన్నారు. రెండో విడత ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎనుమాముల మార్కెట్ నుంచి పైడిపెల్లి శివారు, కొత్తపల్లి, ఆరేపల్లి వరకు భూసేకరణకు సంబంధించి పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దాంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధులు, బడా రాజకీయ నాయకుల భూములను కాపాడే విధంగా ‘ఇన్నర్’ రోడ్డు ప్లానింగ్ మార్చుతున్నట్టు సర్వత్రా విమర్శలున్నాయి. దాంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనైనా అవసరమైన నిధులను కేటాయించి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తారని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు.



