పద్దులపై చర్చలో ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అత్యంత ప్రాధాన్యతా రంగాలైన విద్య, వైద్య శాఖలకు నిధులు పెంచాలని కాంగ్రెస్ సభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం ఈ రెండు రంగాలను నిర్వీర్యం చేసిందని అన్నారు. ఆదివారం శాసన సభలో పలు శాఖల పద్దులకు అనుమతి కోరుతూ ఆయా మంత్రులు ప్రతిపాదించారు. పాఠశాల విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, భవనాలు, కార్మిక, ఉపాధి కల్పన, అడవులు, పర్యావరణం, దేవాదాయ, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ పద్దులపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగానికి నిధులు పెంచినప్ప టికీ అవి సరిపోవని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ విద్య నిర్వీర్యమైందని వివరించారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులలేమితో కొట్టుమిట్టా డుతున్నాయని తెలిపారు. మునుగోడు నియోజక వర్గంలో మర్రిగూడ పాఠశాలలో 360మందికి 8 బాత్రూంలే ఉన్నాయని చెప్పారు. అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. అందుకే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల న్నారు.వైద్య రంగాన్ని కూడా ప్రక్షాళన చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం పోతున్నదన్నారు. అప్పులు చేసి ప్రయివేటు వైద్యం కోసం పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దోపిడికి పాల్పడిందని చెప్పారు. డిండి ప్రాజెక్టు అసంపూర్ణంగా మిగిలిందన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును ఏ కేటగిరిలో చేర్చాలని కోరారు. హ్యం రోడ్ల నిర్మాణంలో ఎక్సిడెంట్ల స్పాట్లను గుర్తించాలని సూచించారు.ఎంఐఎం సభ్యులు బలాల మాట్లాడుతూ రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ అందించాలన్నారు. ఆహారభద్రతను కల్పించటంలో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలని సూచించారు. సిలిండర్ల కొరత, ఆటోలకు గ్యాస్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తగిన శ్రద్ద పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యుడు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. నీటి పారుదలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలేరులో 20పడకల ఆస్పత్రిని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ సభ్యుడు రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా వైద్యం ముఖ్యమైందన్నారు.బీఆర్‌ఎస్ హయాంలో పదేండ్లలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టలేదని చెప్పారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పోతే..అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములపై సీలింగ్ పెట్టాలన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో పని చేస్తున్నాం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యతా క్రమంలో జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆహారభద్రతను కల్పిస్తున్నామని తెలిపారు. సన్నభియ్యం అందరికీ అందిస్తున్నామని గుర్తు చేశారు. కోటీ 60లక్షల జనాభాకు రేషన్ కార్డులు ఇస్తున్నదని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు. రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదనీ, కమర్షియల్ సిలిండిర్ల కొరత ఉందని పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో ఆ కొరత కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రభుత్వం కృష్ణాబెసిన్‌పై ఫోకస్ పెట్టిందన్నారు. డిండి ప్రాజెక్టు రెండేండ్లలో పూర్తి చేయబోతున్నామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన లోన్ల వల్ల ఇప్పుడు సమస్య ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు రాలేదని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ కోసం రూ.5వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని చెప్పారు.



