ప్రతి మత్స్య సొసైటీకీ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలి
ముగిసిన టీఎమ్‌కేఎమ్‌కేఎస్ రాష్ట్ర 4వ మహాసభ
రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా నర్సింహ, బాలకృష్ణ ఎన్నిక
22 తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 2025-26 బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించి, పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం (టీఎమ్‌కేఎమ్‌కేఎస్) రాష్ట్ర నాలుగో మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా మూడ్రోజులపాటు జరిగిన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ గురువారం ముగిసింది. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించింది. రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకుంది. జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రాభవన్‌లో నూతన కమిటీ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మహాసభ తీర్మానించిన అంశాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ వివరించారు.
22 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోగించిందని తెలిపారు. ప్రతి మత్స్య సొసైటీకీ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేటికీ మత్స్య వృత్తిపై ఆధారపడి సుమారు పది లక్షల మత్స్యకార కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, సుమారు 5500 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 5లక్షల 60 వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు సహా అన్నిరకాల జల వనరులు, నదీ పరివాహక ప్రాంతాల భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జలవనరుల భూములను శాటిలైట్ ద్వారా సర్వే చేయించి పూడికలు తీయించి ఫెన్సింగ్ వేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో భారీ అవినీతి..
గత ప్రభుత్వంలో చేప / రొయ్య పిల్లల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని, మత్స్యకార సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని మత్స్య కార సంఘాలు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదని బాల కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీపై న్యాయ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఉచిత చేప, రొయ్య పిల్లలను నాణ్యమైన సైజులో పంపిణీ చేయాలని కోరారు. గత ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందు ఎన్‌సీడీసీ నుంచి తెచ్చిన రూ.వెయ్యి కోట్ల రుణాలను ఐదేండ్లు కాలం గడిపి.. ఆ తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేసినా భారీఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎన్‌సిడిసి రుణాలతో మత్స్య సహకార సంఘాలకు నేరుగా ఆర్థిక సాయం అందించాలని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. 33 జిల్లాలకు జిల్లా మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలన్నారు.
టీఎమ్‌కేఎమ్‌కేఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా నర్సింహ, బాలకృష్ణ
తెలంగాణ మత్స్య కారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులుగా గోరెంకల నర్సింహ (రంగారెడ్డి), లెల్లెల బాలకృష్ణ (రాష్ట్ర సెంటర్) ఎన్నికయ్యారు. మరో 19మంది ఆఫీస్ బ్యారర్స్, 51 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో నూతన కమిటీని రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శీలం శీను, చనమోని శంకర్ (రంగారెడ్డి), గాండ్ల అమరావతి (హైద్రాబాద్), చిరుమల్ల బిక్షం(నల్లగొండ), పగడాల నాగేశ్వరరావు (ఖమ్మం), పిట్టల వెంకన్న (మహబూబాబాద్), కార్యదర్శులుగా కొప్పు పద్మ (హైదరాబాద్), బక్కి బాలమని (మేడ్చల్ మల్కాజ్‌గిరి), బి.చందు (మంచిర్యాల), తేలు ఇస్తారి (సిద్దిపేట), మురారి మోహన్ (నల్లగొండ), బి.మధు (కామారెడ్డి)తోపాటు రెండు కో- ఆప్షన్లతో 19 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.



