భారతదేశానికి ఇప్పుడు అత్యంత ప్రమాదం దేని నుంచి పొంచి వుందంటే అది false news నుంచి. వెయ్యి అబద్దాల మధ్య ఒక నిజాన్ని ఇరికించి ఇదే నిజమని ప్రచారం చేయడం నైజంగా దేశంలోని ప్రధాన ప్రచార సాధనాలు మారిపోయాయి. ఇది ఈ మధ్య కాలంలో ఎందాకా పోయిందంటే చరిత్రకు కూడా వక్రభాష్యాలు చెప్పడం, చరిత్రకారులని, సామాజికవేత్తలని, రచయితలను, కవులను తమ అజ్ఞానంతో విపరీతంగా ట్రోల్ చేయడం దాకా. ఈ వాట్సప్ యూనివర్సిటీ ఉత్పత్తి చేస్తున్న అభ్యంతరకర విషయాలను చదువుకున్నవాళ్ళు కూడా బలంగా నమ్ముతున్న పరిస్థతి వుంది. ఉపరితలాంశాల మీద తచ్చాడి, సారాన్ని వదిలిపెట్టి, తమకు అనుకూలంగా వాదించుకొని, కొంతమంది తమలాంటివారిని పోగేసి, అది తప్పుడు విషయమని స్థిరీకరించే పెడధోరణి పెచ్చుమీరింది. ఇది క్రమంగా మతాల మీద నుంచి, దేశభక్తి మీద నుంచి, మూఢభక్తి మీద నుంచి ప్రవహిస్తూ చివరకు పుస్తకాల మీదకు కూడా ఎగబాకింది. ఈ పెడధోరణి ఈ మధ్యకాలంలో మరీ పెచ్చుమీరింది.
దేశంలో జరుగుతున్న అనేక దురదష్టకరమైన సంఘటనలలాగే మధ్యప్రదేశ్ లో కూడా ఒక అరాచక సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో 2023లో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడిపై మద్యం మత్తులో ఉచ్చపోసాడు. అత్యంత అమానవీయమైన ఈ సంఘటన ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయి, తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
దీనిపై దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబికాయి. సాటి మనిషి మీద జరిగిన ఈ అమానవీయ, అవమానకర సంఘటనను ప్రజాస్వామ్య శక్తులు జీర్ణించుకోలేక పోయాయి. తెలుగు కవులు ఈ సంఘటన మీద అగ్రహౌదగ్రులయ్యారు. తక్షణ స్పందనగా కవిత్వమయ్యారు. దానిని కవయిత్రి మెర్సీ మార్గరెట్ ‘ఉచ్చల జలధి తరంగ’ పేర ఆ కవిత్వాన్ని సంకలనం చేసింది.
జనగణమణ జాతీయ గీతాన్ని అవమానించారంటూ వాట్సప్ యూనివర్సిటీ మేధావులు సోషల్ మీడియాలో ఈ పుస్తకం మీద రచ్చ చేసారు. వారి ప్రధాన అభియోగం ఆ పుస్తకానికి ‘ఉచ్చల జలధి తరంగ’ అని పేరు పెట్టడమే. ఆ పుస్తకంలో ఏముందో.. ఎందుకు ఆ పుస్తకం రాసారో.. ఆ పేరు ఆ పుస్తకానికి ఎందుకు పెట్టవలసి వచ్చిందో కూడా వారికి తెలియదు. అసలు ఆ పుస్తకం వారు తెరిచి ఎరుగరు. మెర్సీ గత చరిత్ర తవ్వి, ఈమెకెలా యువ పురస్కారం ఇచ్చారని వాపోయారు. తీరాచూస్తే ఆ ఆదివాసీ మీద ఆ కులదురహంకారి ఉచ్ఛ పోసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు. ఈ దుశ్చర్య భారతదేశానికి తలవొంపులని వీరిలో ఒక్కరూ తలచినట్టు లేదు. ఖండిచినట్టు లేదు.’ఉచ్చల జలధి తరంగ’ అనేది attention seeker అని, కవిత్వంలో అది ఒక pun అని, ఇందులో రాసిన ఏ కవీ, కవయిత్రికీ జాతీయ గీతాన్ని అనమానించే ఉద్దేశ్యం లేదని పుస్తకం చదివితే తెలిసేది. కేవలం జరిగిన అమానవీయ సంఘటన పట్ల ఆగ్రహం మాత్రమే వుంది.
దీనిని గర్హిస్తూ ముందుమాటలో ప్రముఖ కవి ప్రసేన్ ఇలా అంటున్నాడు- ”ఇప్పుడిక్కడ మధ్యప్రదేశ్ మూత్ర విసర్జన గురించి మాట్లాడడమంటే కేవలం ఆ సంఘటన గురించి మాత్రమే మాట్లాడటం కాదు. ఒక అ వ్యవస్థ గురించి మాట్లాడటం, కులం గురించి, దాని వైపరీత్యంతో పాటు మతం గురించి, వాటికి వత్తాసు పలికే వర్గం గురించి, మొత్తంగా అమానవీయ హింస గురించి, సిగ్గువిడిచిన దౌర్జన్యం గురించి మాట్లాడటం” అని. దీని గురించి ఈ దేశభక్తులకు అక్కర లేదు.
పురాతన ఆదివృక్షంలా నిలబడ్డ నా ఆదివాసీ శిరస్సును ఈ దేశపు ముఖచిత్రంగా దర్శించండి.’ (మెర్శీ మార్గరెట్) అనడంలో ఇది పరాకాష్టకు చేరింది. మెర్సీ ‘నిద్ర నటించకుండా నాతో నిలబడండి’ అనడంలో నిరసనని కూడగట్టడం వుంది. అసహాయత వుంది. ఆక్రోశం వుంది. ముఖ్యంగా ఆదివాసీ దుఃఖాన్ని దేశం ముఖచిత్రంగా దర్శించండి అనడంలో దేశంలో ఆదివాసీల పట్ల మనకు వున్న చిన్నచూపుని, అజ్ఞానాన్ని , పట్టించుకోనితనాన్ని, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. ఇదే కదా ప్రజాస్వామ్యవాదులుగా మనకు ఉండాల్సిన దృష్టి.
”కూల్చాల్సింది వాడి ఇంటిని కాదు
జాతి నిర్వీర్యపరుస్తున్న
కుహనా ధార్మికుల నిర్మిత
కుల దురహంకార దుర్గమాలను” అని అనడంలో ఒక సమస్య పట్ల కవుల దక్పథం ఎలా వుండాలో చెపుతున్నాడు. ఒక్క ఉపరితలాంశాల మీదే కాకుండా సమస్య Root cause లోకి చూపుని నిలపాలని చెప్పే ప్రయత్నం ఇది.
నిజం చెప్పాలంటే ఇది ఒక్క మధ్యప్రదేశ్ ఘటన మీద మాత్రమే కవుల ఆగ్రహం కాదు. తరతరాలుగా జరిగిన కొన్ని వేల దుర్మార్గ సందర్భాల పట్ల నిరసన..ఒక్క ధాష్టీకాన్నయినా ఈ పుస్తకం ఆపగలిగితే చాలు కదా అన్నది ఆశ. జరగబోయే ఘటనల గుండెల్లో ఈ పదఘట్టనలు వణుకు పుట్టించాలన్న ఆకాంక్ష.
ప్రతీసారీ దుఃఖం తీరం దాటుతున్నట్టే వుంటుంది. కన్నీటి ముసురు మాత్రం షరా మామూలే (మెర్సీ మార్గరెట్) అనడంలో ఈ దుర్ఘటలు ఈ దేశంలో పదేపదే పునరావృతం అవడం పట్ల ఆందోళన, ఆవేదన వుంది.
Sioban Timmer అన్నట్టు Strength is not rising from the ashes as a phoenix. Strength is emerging with your song extinguished, your feathers scorched and finding a way to sing and fly again. లాగ కవిత్వం నిరసన గీతాలై పెగలాలి. వీథుల వెంట అరుచుకుంటూ ప్రవహించాలి. మరోసారి దుర్మార్గం తలపెట్టే రాజ్యం వెన్నులో జలజల వణుకు పుట్టాలి. మెర్సీ అన్నట్టు ఈ పుస్తకం ఒక చిన్న ఆశారవ్వ రగిలిస్తుంది.
దేశంలో జరిగిన ఒక దుర్మార్గమయిన చర్యను బాధ్యతగా రికార్డు చేసిన పుస్తకంగా ‘ ఉచ్చల జలధి తరంగ’ నిలబడుతుంది.
- పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449