Tuesday, July 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగడ్కరీయం

గడ్కరీయం

- Advertisement -

దేశంలో పేదల సంఖ్య ఏటికేడు పెరుగుతూ పోతుండగా, సంపద మాత్రం పలుకుబడి కలిగిన వ్యక్తుల వద్దే కేంద్రీకృతం అవుతోందంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటిది జరగరాదంటే సంపద వికేంద్రీకృతం కావాల్సిన అవసరముందన్నారు. గ్రామీణప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పారు. అదికూడా ఆరెస్సెస్‌ కేంద్రమైన నాగ్‌పూర్‌ వేదికగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. జులై4న ప్రధానమంత్రి దూరదర్శన్‌ సందేశంలో తమ పదకొండేండ్ల పాలన శ్రామికుల సంక్షేమం చుట్టూ సాగిందని, ఉపాధి కల్పన, సాంఘిక సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించామని పేర్కొన్నారు. అదే సందర్భంలో కార్మికుల సాధికారత, సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కూడా తెలిపారు. మోడీ మాట్లాడిన రెండురోజులకే గడ్కరీ పై వ్యాక్యలు చేయడం గమనార్హం. ఈ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు ఏమైన్పటికీ గడ్కరీ ఇప్పటికైనా నిజాలు మాట్లాడారు. మోడీ చెప్పేవన్నీ ఒట్టి ఢాంబికాలే అని ఆయన మాటలతో తేెటతెల్లమైంది. ఇప్పటికైనా మన కండ్లకు కమ్ముకున్న పొరలు వీడితే వాస్తవాలు బయట పడతాయి.
ప్రపంచ ఆకలి సూచీలో గత పదకొండేండ్లుగా మనదేశ ర్యాంకు అధోపాతాళానికి పడిపోతున్నది. నేడు దేశంలో ప్రజల పరిస్థితి ”అన్నవస్త్రాలు అడిగితే ఉన్న వస్త్రాలు పోయినట్టు”గా మారిపోయింది. 2014లో ఆకలిసూచీలో 55వస్థానంలో ఉన్న మనదేశం 2024లో 105వ స్థానానికి దిగజారడం వాస్తవం. కుటుంబ ఆదాయాన్ని రోజుకు మూడు డాలర్లుగా చూపే 2021నాటి అంతర్జాతీయ దారిద్య్రరేఖ కొలమానంగా చేసిన మదింపు ఇది. దారిద్య్రరేఖను కనిష్ట స్థాయికి దింపి పేదరికం తగ్గిందని సంతృప్తి పడటానికి తప్ప దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. సంపద వికేంద్రీకృతంకావాల్సిన అవసరముందని.. శతకోటీశ్వరులు సహస్ర కోటీశ్వరులవుతున్నారన్న విషాయాన్ని సైతం గడ్కరీ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.
నేటికీ దేశంలో ఆకలిచావులు లేని రోజులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణభారతంలో నలభైశాతం మందికి రెండుపూటలా తిండికూడా దొరకడం లేదు. ఆకలి, వాతావరణ మార్పులు, లింగ అసమానత్వం… ఈ మూడింటి మధ్య నేరుగా సంబంధం ఉన్నదని ఇప్పటికే ఎన్నో నివేదికలు మోడీ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపాయి. ఈ భిన్న దృక్పథాల్లోని సత్యాన్ని గుర్తించి, గౌరవించే గుణం వీరి ప్రభుత్వానికి లేనే లేదు. గత 11ఏండ్లలో అటువంటి సుగుణాన్ని అలవరచుకునే ప్రయత్నమేదీ ఏ కోశానా చేయలేదు. ఈ గణాంకాలన్నీ దేశంలో పెరుగుతున్న పేదరికానికి చిహ్నాలు. ప్రభుత్వరంగ సంస్థలను, ప్రకృతివనరులను మోడీ ప్రభుత్వం కారుచౌకగా వీరికి ధారాదత్తం చేస్తోంది. ఫలితంగా దేశంలో శత కోటీశ్వరులు సంఖ్య అంతకంతకూ పెరగడం వీరి ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలకు నిదర్శనం. ఒకవైపు మోడీ ”మాది సుభిక్ష పాలన” అని ఢంకా బాజాయిస్తుంటే… మరోవైపు ఆయన క్యాబినెట్‌ సహచరుడు మాత్రం పెరుగుతున్న పేదరికంపై యుద్ధం చేయాలని అంటున్నారు.
తలసరి ఆదాయంలో మనం చాలా వెనుకబడే ఉన్నామన్నది వాస్తవం. సంపద పంపిణీలో అంతరాలు మరింత పెరగడం ఆందోళన కరం. ఆర్థిక అసమానతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. జనాభాలో ఓ పెద్దభాగం ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, మారుతున్న వినియోగ విధానాలను పరిగణనలోకి తీసుకుని పేదరికాన్ని లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. దేశంలో కోట్లాది మంది బతుకులు నిత్య అనిశ్చితి, పేదరికం, నిరుద్యోగం, భయంతో నాశనమవుతున్నాయి. భారతదేశ వృద్ధిరేటును పెంపొందించే లక్ష్యంతో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలను అమలుపరిచామని పాలకుల మాటలు ఎంతడొల్లో గడ్కరీ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి.
ఒకవైపు చదువుకు తగిన ఉపాధిలేక, ఉపాధికి అవసరమైన చదువు అందక నిరుద్యోగం దినదిన ప్రవర్తమానమవుతుంటే, మరోవైపు దేశంలో ప్రబలుతున్న అసహనం, అరాచకం, మతోన్మాదం, దిగజారుతున్న విలువలు యువతరం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
మోడీ పాలనలో దేశానికి నిరుద్యోగం ఇప్పటికే ఒక ప్రధాన సమస్యగా ఉన్నదన్న విషయాన్ని గడ్కరీ చెప్పకనే చెప్పారు. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వంటి నినాదాలతో దశాబ్దకాలంగా మోడీ సర్కార్‌ నిరుద్యోగులను వంచిస్తూనే ఉంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం వెనుక ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయాలనే కుట్ర కనిపిస్తోంది. కానీ, కోట్లాది సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని మోడీ సర్కారు చెప్పుకోవటం శోచనీయం. ఉద్యోగాలు సృష్టించే, ఆర్థికవృద్ధికి ఊతమిచ్చే ఆర్థికవ్యవస్థ గురించి పరిశీలిస్తున్నామని చెప్పారు. అంటే ఇప్పటివరకు ఆపని జరగలేదన్నది తేలిపోయింది. పాలకులు ఎవరైనప్పటికీ వారు కార్పొరేట్లకు, సంపన్నులకు సేవచేసే వారిగానే ఉన్నారన్నది స్పష్టమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -