Wednesday, May 7, 2025
Homeజాతీయంగాలి జనార్దన్‌రెడ్డికి ఏడేండ్లు జైలు

గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేండ్లు జైలు

- Advertisement -

– ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు
– 15 ఏండ్ల సుదీర్ఘ విచారణ..ఐదుగురు దోషులుగా నిర్ధారణ
– చంచల్‌గూడ జైలుకు తరలింపు
– నిర్దోషులుగా నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం
హైదరాబాద్‌:
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళ వారం తుది తీర్పు వెలువరించింది. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులు గా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దన్‌ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా నలుగురికి ఏడేండ్ల పాటు జైలు శిక్షను విధించింది. రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అదే విధంగా ఓబుళాపురం మైనింగ్‌ కంపె నీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్ర మల శాఖ కార్యదర్శి కృపా నందంనూ సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
వీడీ రాజగోపాల్‌కు అదనంగా
మరో నాలుగేండ్లు జైలు శిక్ష
ఈ కేసులో వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేండ్లు జైలు శిక్ష విధించింది. భూగర్భగనుల శాఖ డైరెక్టర్‌ గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వాధికారిగా ఉంటూ అక్ర మాలకు పాల్పడినందున మొత్తంగా 11 ఏండ్ల పాటు అతడికి జైలు శిక్ష పడింది.
ఓఎంసీ కేసులో కొన్ని ముఖ్యాంశాలు..
2007 జూన్‌18న ఓఎంసీకి లీజులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్దేశపూర్వకంగానే ‘క్యాప్టివ్‌’ అనే పదాన్ని తొలగించారని, తద్వారా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009లో డిసెంబర్‌ 7న తొలిసారి సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో స్టే రావడం, మళ్లీ డివిజన్‌ బెంచ్‌ స్టే ఎత్తివేయడం.. ఇలా పలు రకాల పిటిషన్లు వేయడంతో దాదాపు 15 ఏండ్ల పాటు విచారణ కొనసాగింది. కేసు దర్యాప్తునకే ఐదేండ్లు సమయం పట్టింది. 2009 నుంచి 2014 వరకు సీబీఐ నాలుగు చార్జిషీట్‌లను దాఖలు చేసింది.
ఓఎంసీ వ్యవహారంలో 2011లో చార్జిషీట్‌ను తొలిసారి వేయగా.. 2014లో తుది చార్జిషీట్‌ తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిగింది. 219 మంది సాక్షులను విచారించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు సాక్ష్యాలు, ఆధారాలను సీబీఐ సేకరించింది.
అనంతపురంలోని ఓబుళాపురంలో గనుల కేటాయింపు, తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సీబీఐ ఆధారాలు సేకరించింది. అక్రమంగా తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు సీబీఐ గుర్తించింది. ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి ఆధారాలు, సాక్ష్యాల సేకరణతో 2014లో తుది చార్జిషీట్‌ దాఖలైంది.
విదేశాలకు అక్రమంగా దాదాపు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, అక్రమ బినామీ లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.
ఈ కేసు విచారణలో మొత్తంగా 3337 డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన 68 హెక్టార్లలో కాకుండా పెద్ద ఎత్తున మైనింగ్‌ చేపట్టినట్లు సీబీఐ గుర్తించింది.
తాజాగా ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 కె.మెఫజ్‌ అలీఖాన్‌లను దోషులుగా తేల్చిన కోర్టు.. ఏ8 కృపానందం, ఏ9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందగా.. ఏ6 శ్రీలక్ష్మిని 2022లో ఈ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది. కాగా, శిక్ష పడిన వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -