Saturday, April 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగణపతి బతికే ఉన్నారు

గణపతి బతికే ఉన్నారు

- Advertisement -

లొంగిపోయినవారు పార్టీపై నిషేధం ఎత్తేయాలనడం ఏమిటి?
రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మాత్రమే మిగిలారు
వారూ సరెండరై ప్రభుత్వ చేయూతను అందుకోవాలి : డీజీపీ
డీజీపీ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు


నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణరావు ఎలియాస్‌ గణపతి బతికే ఉన్నారనీ, అయితే ఆయన దండకారణ్యంలో మాత్రం లేరని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం 42 మంది మావోయిస్టులు 36 ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో శివధర్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రానికి చెందిన గణపతితో సహా ఐదుగురు మావోయిస్టులు మాత్రమే లొంగిపోవాల్సినవారిలో ఉన్నారనీ, తాజాగా లొంగిపోయినవారిని కలిపి ఇక రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయిందనీ, పీపుల్స్‌ లిబరేషన్‌ ఘెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కార్యకలాపాలు కూడా అంతమయ్యాయని ఆయన ప్రకటించారు.

గణపతితో పాటు ఆయన భార్య జాడె రత్నాబారు, కేంద్ర కమిటీ సభ్యుడు పుసునూరి నరహరి, ముత్తు, రూబీలు మాత్రమే రాష్ట్రానికి చెందినవారిలో మిగిలిపోయినవారు ఉన్నారని తెలిపారు. తాజాగా లొంగిపోయిన 42 మందిలో నిఖిల్‌ ఎలియాస్‌ మహేందర్‌ మాత్రమే తెలంగాణకు చెందినవారనీ, మిగిలిన 41 మంది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవారని అన్నారు. వీరిపై ఉన్న రూ.1.93 కోట్ల రివార్డును త్వరలోనే అందజేయడం జరుగుతుందనీ, అయితే అందులో నిఖిల్‌కు రూ.4 లక్షలు, మిగతావారికి ఒక్కొక్కరికి రూ.25 వేల చెక్కులను అందజేస్తున్నామని ఆయన ప్రకటించారు. మిగతా డబ్బులను వారి బ్యాంకు అకౌంట్లు, పాన్‌ కార్డులు, ఆధార్‌కార్డులను తెరిచాక అందజేయడం జరుగుతుందని చెప్పారు.

లొంగిపోయినవారి నుంచి ఏకే-47, ఇన్సాస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, 303 రైఫిల్స్‌, పిస్తల్స్‌, జీఎంకే గన్‌, ఎయిర్‌రైఫిల్స్‌తో సహా 36 ఆయుధాలను, 2007 లైవ్‌ బుల్లెట్లను, 300 మ్యాగ్జిన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో గాలింపు చర్యలు తీవ్రతరం కావడంతో వీరంతా ఒక చోట సమావేశమై తెలంగాణ ఎస్‌ఐబీ వద్ద లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నారనీ, అందుకు ఎస్‌ఐబీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు వీరిని సురక్షితంగా లొంగుబాటులో నడిపించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన తెలిపారు. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని లొంగిపోయిన మాజీలు డిమాండ్‌ చేయడం సరికాదనీ, వారు మావోయిజానికి, పార్టీకి దూరమయ్యాక దానితో సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 206 మంది మావోయిస్టులు లొంగిపోయారనీ, గత రెండేండ్లతో కలిపితే వారి సంఖ్య నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 21 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిపి 763కు చేరిందనీ, ఆయుధాల సంఖ్య 300కు పైగా చేరిందని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు స్వేచ్ఛగా తమ నూతన జీవితాలను రాష్ట్రంలో గడుపుతున్నారనీ, వారిపై ఎలాంటి నిర్బంధాలూ లేవని డీజీపీ స్పష్టం చేశారు. ”దేశంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్టేనా?” అనే ప్రశ్నకు అది కేంద్రం చెప్పగలదనీ, అయితే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మావోయిస్టుల కార్యకలాపాలు ఆగిపోయినట్టేననీ, కొద్దిమేర అటు, ఇటుగా ఉంటే చెప్పలేమని ఆయన తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హెల్త్‌కార్డులు తయారవుతున్నాయనీ, త్వరలోనే వాటిని పంపిణీ చేస్తామని అన్నారు. మొత్తమ్మీద తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు నిలిచిపోయాయనీ, గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా దృష్టిని కేంద్రీకరించిందనీ, అందుకు తమ పోలీసు అధికారులు కూడా తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో గ్రేహౌండ్స్‌ అదనపు డీజీ అనిల్‌ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్ కుమార్‌, ఎస్‌ఐబీ ఐజీ సుమతి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -