Sunday, January 25, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్ఫోన్‌ వదిలి పుస్తకం పట్టుకున్న గణేష్‌

ఫోన్‌ వదిలి పుస్తకం పట్టుకున్న గణేష్‌

- Advertisement -

ఒక పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న గణేష్‌ అనే బాలుడు ఉన్నాడు. అతను అంత బాగా చదివేవాడు కాదు. ప్రతి పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో అతని తల్లిదండ్రులు తరచూ ప్రధానోపాధ్యాయుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసేవారు. ప్రధానోపాధ్యాయులు గణేష్‌ గురించి ఆరా తీశారు. అప్పుడు తెలిసింది ఏమిటంటే… గణేష్‌ ఇంటికి వెళ్ళగానే పుస్తకాలు చదవకుండా ఎక్కువ సమయాన్ని ఫోన్‌లో గడుపుతున్నాడని. ఫేస్బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ రీల్స్‌ చూసుకుంటూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు ఒక మంచి ఆలోచన చేశారు. పాఠశాల అసెంబ్లీలో అన్నీ విద్యార్థులను ఉద్దేశించి ఇలా ప్రకటించారు… ”మీరు అందరూ వంద రోజులు ఫోన్‌కు దూరంగా ఉంటే, మీ కోసం ఒక అద్భుతమైన బహుమతిని ఇస్తాను. ఫోన్‌ చూడాలని అనిపించినప్పుడల్లా, మీ చేతిలో ఫోన్‌ బదులు ఒక పుస్తకం పెట్టుకోండి. అది విజ్ఞాన శాస్త్రం కావచ్చు, లేదా భాషా పదాలు కావచ్చు. చదువును అలవాటు చేసుకోండి. వంద రోజులు ఇలా క్రమశిక్షణతో ఉన్న వారిని స్కూల్‌ అసెంబ్లీలో గౌరవించి బహుమతిని ఇస్తాను.”

ఈ మాటలు గణేష్‌ మనసును బాగా తాకాయి. కొన్ని రోజులు ఫోన్‌కు దూరంగా ఉండి, ఏం చేయాలో అర్థం కాక, ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు రోజూ పాఠ్యాంశాలను చదవడం మొదలుపెట్టాడు. క్రమంగా, ఫోన్‌లో ఎంత నిమగమయ్యాడో, ఇప్పుడు చదువులో అంతే మమకారంతో మునిగిపోయాడు. ఆ మధ్యలో సమ్మేటివ్‌ అసెస్మెంట్‌ పరీక్షలు వచ్చాయి. గణేష్‌ క్రమశిక్షణతో చదివి, మొదటిసారి పాఠశాలలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ ఫలితాన్ని చూసి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఆశ్చర్యపోయారు.
తల్లిదండ్రులు గర్వంగా చెప్పారు… ”మా అబ్బాయి గత కొన్ని నెలలుగా ఫోన్‌ చూడకుండా ఇంటికి వచ్చి ఇచ్చిన హోంవర్క్‌ అన్నీ చేస్తూ, బాగా చదువుకుంటున్నాడు. చాలా మార్పు వచ్చింది” అని.

గణేష్‌ జీవితంలో వచ్చిన ఈ మంచి మార్పును చూసి ఇతర విద్యార్థులు కూడా అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టారు. పాఠశాలలో చాలా మందిలో సానుకూల ఆలోచన పెరిగింది. ఫోన్‌ లేదా టెక్నాలజీని ఉపయోగించడం తప్పు కాదు, కానీ దాని వినియోగంపై మనకు నియంత్రణ ఉండటం చాలా అవసరం. మన ప్రాధమిక కర్తవ్యాలు, విద్య, ధర్మం (నైతిక బాధ్యత) ముందు ఉండాలి. క్రమశిక్షణ, నిబద్ధతతో పాఠ్యపుస్తకాలను నేర్చుకోవడం, జీవితంలో విజయం సాధించడానికి అత్యంత అవసరమైన మూలస్తంభాలు. గణేష్‌ ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. తన జీవితంలో మంచి మార్పును తెచ్చుకున్నాడు. విద్యార్థులుగా మనం టెక్నాలజీని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. అదే ఆధారం కాకూడదు మనస్సుని జ్ఞానంతో నింపుకోవడమే నిజమైన సంతప్తి మరియు విజయానికి దారి తీస్తుంది.

డా పూసపాటి వేదాద్రి , 9912197694

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -