– పోలీసుల అదుపులో 10 మంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న 10 మందిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 414 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం టాస్క్‌ఫోర్సు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌కు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్, శంషాబాద్ కేంద్రంగా ‘మెట్రో గ్యాస్ ఏజెన్సీ’ నిర్వహిస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని గ్యాస్ కొరతను, డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా గ్యాస్ డెలివరీ బారులు మొహమ్మద్ యూసుఫ్, మొహమ్మద్ ఇస్మాయిల్, ఎ.రామారావుతోపాటు బంజారాహిల్స్‌కు చెందిన లోక్ కుమార్‌కు చెప్పాడు. కూలీగా మొహమ్మద్ సక్రుద్దీన్, డ్రైవర్‌గా మొహమ్మద్ మినాజ్ అన్సారీ, రాజేష్‌పాల్‌ను నియమించుకున్నారు. గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసేందుకు నల్లపోచమ్మ దేవాలయ అధ్యక్షుడైన రామ్‌రాజ్ సింగ్‌ను కలిసి స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. ఒక ముఠాగా ఏర్పడిన వీరు ఎవరికీ అనుమానం రాకుండా బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక శ్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. తన సిబ్బంది సహాయంతో అవసరమున్న ఖాతాదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వాహనాలతోపాటు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్‌ఐ డి.రవిరాజ్, బంజారాహిల్స్ పోలీసులు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



