బీహార్‌లో దారుణం
పాట్నా : మిలటరీ పోలీసు బలగాల్లో చేరాలనుకున్న ఒక మహిళపై అనూహ్యమైన పరిస్థితుల్లో సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన బోథ్‌గయలో గురువారం చోటు చేసుకుంది. బీహార్ మిలటరీ పోలీసు (బీఎంపీ) విభాగంలో చేరేందుకు శారీరక ధారుడ్య పరీక్షలకు సిద్ధమైన మహిళ ఫిజికల్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా కండ్లు తిరిగిపడిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అంబులెన్సులో తీసుకెళుతుండగా ఆమెపై ఈ దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్‌ను అరెస్టు చేశారు. బాధితురాలు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్‌గయ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గయలోని అనుగ్రహ నారాయణ్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి (ఎఎన్‌ఎంసీహెచ్)లో చికిత్స నిమిత్తం తీసుకెళుతుండగా అంబులెన్సులో ముగ్గురు నలుగురు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని బాధితురాలు తెలిపింది. ఫిర్యాదు నమోదైన రెండు గంటల్లోనే వారి అరెస్టులు జరిగాయి. తనకు స్పృహ రాగానే తనపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందని ఆమె చెప్పారు. కాగా ఈ సంఘటనపై రాజకీయపార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ, బీహార్‌లో వున్నది రాక్షస ప్రభుత్వమా లేక గూండాల రాజ్యామా అని విమర్శించారు. మోడీ, నితీశ్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా పోలీసు బలగాల పనితీరును ప్రశ్నించారు.
అంబులెన్సులో యువతిపై సామూహిక అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -