– నిత్య చైతన్య శ్రమజీవి వినయకుమార్
– ‘పేపర్ బాయ్ టూ ఎడిటర్’ సభలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ- వనపర్తి
సమాజంలోని సామాజిక అంతరాలను తొలగించాలని, అప్పుడే సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్ట్ కార్యదర్శి, ప్రజాశక్తి మాజీ ఎడిటర్ ఎస్.వినయకుమార్ జీవిత చరిత్ర ‘పేపర్ బాయ్ టు ఎడిటర్’ పుస్తక ఆవిష్కరణ సభ మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బండారు నగర్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. ఎస్.వినయకుమార్ మొదటగా పేపర్ బాయ్‌గా ప్రస్థానం ప్రారంభించి జర్నలిస్టుగా.. పత్రిక ఎడిటర్ స్థాయికి ఎదిగారని తెలిపారు. సమాజంలోని రుగ్మతలను సామాజిక అంశాలను ప్రశ్నించడానికి జర్నలిస్టు అయితేనే సాధ్యమవుతుందన్న ఆలోచనతో ఈ రంగాన్ని ఎంచుకున్నారని తన పుస్తకంలో పేర్కొన్నారని చెప్పారు. ఆయన అభిరుచే జర్నలిజం వైపు నడిపిందన్నారు. తాను పనిచేసే పత్రికకే ఎడిటర్ అయ్యే అవకాశాన్ని.. ఆయన సామాజిక విజ్ఞానం, వినయం, విలువలే తీసుకొచ్చాయని గుర్తు చేశారు. సమాజంలో ఎదగాలంటే సాహిత్యాన్ని సామాజిక విలువలను అధ్యయనం చేయాలని సూచించారు. మనిషిగా సామాజిక దృక్కోణాన్ని ఎన్నడూ విడనాడలేదని, మానవతా విలువలు, సమానతను.. సంబంధాల ను పెంపొందించడంలో ఆయన దిట్ట అని చెప్పారు. వియనకుమార్ కుటుంబంతోపాటు సహచర జర్నలిస్టులు, పార్టీ, సంఘాల నాయకులు అందరూ కూడా విలువైన మనిషిగా చూడటానికి ఆయన వ్యక్తిత్వమే నిదర్శనం అని చెప్పారు.
నేటి సమాజంలో మనిషి మనిషినిగా గౌరవించటం లేదని, మానవతా విలువలు సంబంధాలు పూర్తిస్థాయిలో ధ్వంసం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకథే ఒక మానవీయమైనదని తెలిపారు. ఆయన తండ్రి గోపాల్ కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షలే వినాయకుమార్‌ను ఈ స్థాయికి చేర్చాయని తెలిపారు. చిన్ననాటి నుంచి నేటి వరకు మార్క్సిస్టు పార్టీ దృక్కోణంలో ఉంటూ రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నారని, ఎక్కడా వివాదాలకు తావివ్వలేదని చెప్పారు. మంచి కమ్యూనిస్టు అంటే ఇలానే ఉంటారని అన్నారు. దాదాపు 70 ఏండ్ల వయసులో కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ద్వారా సామాజిక సాంస్కృతిక ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని, నిత్య చైతన్య శ్రమ జీవి ఆయన అని కొనియాడారు. వనపర్తి నుంచి ఎంతోమంది ఆదర్శప్రాయులు ఉన్నారని చరిత్ర చెబుతోందన్నారు. కానీ నేటి యువత పుస్తకాలను చదవడం మానేసిందని, ఇలాంటి సభలు సమావేశాలను యువత వినియోగించుకొని విజ్ఞానం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ బుక్ హౌస్ సంపాదకులు ఆనందాచారి, వినయకుమార్ గురువు సోమసుందర్, కవులు రచయితలు యాదగిరి, రాఘవాచారి, జర్నలిస్టు మల్యాల బాల స్వామి, సీపీఐ(ఎం) నాయకులు పుట్ట ఆంజనేయులు, ఎండి జబ్బార్, కవులు కళాకారులు, సాహిత్య వేదిక సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
సమాజంలోని అంతరాలు తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



