నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామపంచాయతీ పరిధిలోని పదవ వార్డు ను పంచాయతీ వాళ్లు పట్టించుకోకపోవడంతో చెత్త చెదారంతో నిండి అస్తవ్యస్తంగా ఉందని వార్డు ప్రజలు అంటున్నారు. సోమవారం నవతెలంగాణతో వార్డు ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పదవ వార్డులో అత్యధికంగా ప్రజానీకం నివసిస్తున్నారని, దానివల్ల చెత్త కూడా అధికంగానే వెళుతుందని పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు కానీ సిబ్బంది గానీ ఈ వార్డు పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చెత్తచెదారం పేరుకుపోయిన మురికి కంపు కొట్టి అనారోగ్యం బారిన పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త ట్రాక్టర్ ఈ బజారుకు అసలే రాదు. ప్రజలు వినియోగించిన అనేక రకాల వ్యర్ధాలు బజార్ల నిండా పేరుకుపోయి ఉన్నాయి. అసలే వర్షాకాలం వ్యర్ధాల మురుగు వెరసీ దోమలు ఈగలు విస్తృతంగా వ్యాపిస్తుండడంతో వార్డు ప్రజలు మలేరియా డెంగు వైరల్ జ్వరాలతో సతమతమైపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోయింది. అధికారులను పంచాయితీ ప్రత్యేక అధికారులుగా నియమించటం వల్ల సంబంధిత శాఖ అధికారుల పని భారంతోనే సరిపోతుందని ఎప్పుడూ ఒకసారి కంటి తుడుపు చర్యగా పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చెత్త నివారణ చర్యలను చేపట్టాలని, చెత్త ఎప్పటికప్పుడు తీసుకుపోయే విధంగా ట్రాక్టర్ను బజారులో తిప్పాలని
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పించాలని అనారోగ్యాల బారిన పడితే సహించబోమని ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ప్రముఖ నాయకులుమువ్వా భాను ప్రకాష్, భైరి గణేష్, దూపాటి సంతోష్ ప్రజలు పాల్గొన్నారు.