అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేద విద్యార్థుల ఆత్మగౌర వాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ రజినీకాంత్, టి నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని పేర్కొన్నారు.
విద్యార్థులను ”శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని తప్పుపట్టారు. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి, డ్రాపౌట్ తగ్గించడానికి, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయాన్ని గరికపాటి పరిగణలోకి తీసుకోకుండా హేళన చేయటం తగదని హితవు పలికారు.
దేశంలో సుమారు 84 శాతం మంది తల్లులు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో, విద్యార్థులకు అందించే గుడ్డును ”గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలినీ, పేదరికాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం ప్రభుత్వ బాధ్యతనీ, దాన్ని ”బిచ్చం”గా అభివర్ణించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి, పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమనీ, ఇలాంటి వ్యాఖ్యానాలను మానుకోవాలని హెచ్చరించారు.
పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



