Sunday, March 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి''గరిక''పాటి ప్రవచనం

”గరిక”పాటి ప్రవచనం

- Advertisement -

”నారాయణ” అంటూ నారదుడు సత్యలోకంలోకి ప్రవేశించాడు. అక్కడంతా గందరగోళంగా ఉంది. బ్రహ్మదేవుడు బిక్క మొహం వేసుకుని ఆలోచిస్తున్నాడు.
”ఏమిటి తండ్రీ? అంతా గందరగోళంగా ఉన్నది. మీరేమో విచారవదనంతో కన్పిస్తున్నారు! మా తల్లిగారెక్కడీ” అని అడిగాడు నారదుడు.
”మీ తల్లిగారు కన్పించడం లేదనే విచారం నాయనా!” అన్నాడు బ్రహ్మదేవుడు.
”అదే తండ్రీ! నా తల్లి సరస్వతీ దేవి ఎక్కడికి వెళ్లింది?” మళ్లీ అడిగాడు నారదుడు.
”ఎక్కడికి వెళ్లిందో తెలియటంలేదు! నారదా! నా పుత్రులకు అవమానం జరిగితే నేను భరించలేను! అంటూ వెళ్లిపోయింది. మళ్లీ కనబడలేదు!” అన్నాడు బ్రహ్మదేవుడు.
”మనం కైలాసం వెళ్లి మహాదేవుడి సహాయం కోరుదాము పదండి!” అంటూ బ్రహ్మదేవుడిని తీసుకుని కైలాసం వెళ్లాడు నారదుడు.
అక్కడ కూడా శివుడు విచారవదనంతో ఉన్నాడు.

”మహాదేవా! సత్యలోకంలో సరస్వతిదేవి లేదు! కైలాసంలో పార్వతీదేవి లేదు! ఏమి ఈ వింత? వీళ్లిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లినారో మీ దివ్యదృష్టికి పరిశీలించండి!” అన్నాడు నారదుడు.
మహాదేవుడు దివ్యదృష్టితో చూశాడు. తనకు కన్పించిన దృశ్యాన్ని బ్రహ్మదేవుడికి, నారదుడికి కన్పించేలా చేశాడు.
అది ఏ లోకమో తెలియదు! ఎంతో అందంగా ఉన్నది. ప్రకృతి శోభరమణీయంగా ఉన్నది. ఒక పారిజాతం చెట్టు కింద సరస్వతి, పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.
”ఏదేమైనా నీవు బ్రహ్మలోకం వదలి రావటం సరైన పనికాదు చెల్లీ!” అన్నది పార్వతి.
”నా పుత్రులైన పండిత, విద్వాంసులకు అవమానం జరగటం నేను భరించలేను! అందుకే బ్రహ్మలోకం నుండి వచ్చేశాను. అవమానం భూలోకంలోనే జరిగింది! భూలోకవాసులు తెలివి తక్కువవారై పండితులను, అందునా బ్రాహ్మణ పండితులను అవమానించుట నేను సహించలేకున్నాను!” అన్నది సరస్వతి దేవి.

”నీ పుత్రులకు ఏ అవమానం జరిగిందో తెలుపుము!” అడిగింది పార్వతీదేవి.
”గరికపాటి, చాగంటి లాంటి వారు నా పుత్రులు! తమ వాక్కుయందు నన్ను నిలుపుకొన్నవారు! నా అనుగ్రహం పూర్తిగా పొందినవారు! అలాంటి పండితోత్తములను యూట్యూబ్‌ ఛానళ్లలో, సోషల్‌ మీడియా విపరీ తంగా అవమానిస్తున్నారు! పరమ పవిత్రమైన పాఠశాలలో గుడ్డు వద్దంటే ఇంతగా ట్రోల్‌ చేయాలా?” ప్రశ్నించింది! సరస్వతి దేవి.
”నీ అనుగ్రహం పూర్తిగా ఉన్నవాడే.. కాదనను! కాని అతడు నీకేద్రోహం చేస్తున్నాడు!” అన్నది పార్వతిదేవి.
సరస్వతి దేవి తికమకపడింది!
”అతడు నాకు ద్రోహం చేయటమేమిటి?” ప్రశ్నించింది సరస్వతిదేవి.
”ఎవరైనా విద్యను నేర్చుకుంటేనే నీ అనుగ్రహం సంపాదించినట్లు! చదువురాకుంటే ఆ వ్యక్తికి నీ అనుగ్రహం లేనట్లు అంతేకదా!” అడిగింది పార్వతిదేవి.

”అవును అంతే!” అన్నది సరస్వతిదేవి.
”మరి గరికపాటి కూడా ఒకప్పుడు నీ అనుగ్రహం లేనివాడే! అంటే ఎప్పుడో ఒకప్పుడు, సరిగ్గా చెప్పాలంటే చిన్నపుడు అతనికీ నీ అనుగ్రహం లేదు! అతనిలాగే చాలామంది చిన్నపిల్లలకు నీ అనుగ్రహం లభించలేదు! గరిక పాటిలాగే వారు కూడా పాఠశాలకు వెళ్లి చదువుకునే అవకాశం లభిస్తే, గరికపాటిని మించిన ఘనాపాటీలు అవుతారు!” అన్నది పార్వతీదేవి.
”మరి చిన్నపిల్లలందరినీ చదువుకోవద్దని నేను అనటంలేదు! నాకు పిల్లలందరూ సమానమే!” అన్నది సరస్వతిదేవి.
”పిల్లలను నీవు చదువుకోవద్దని అనకపోవచ్చు. కాని వారి కుటుంబ స్థితిగతులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు వారిని నీ అనుగ్రహానికి దూరం చేస్తున్నాయి!” అన్నది పార్వతీదేవి.
”గరికపాటి కూడా పేదవారిని చదువుకోవద్దనలేదు కదా!” అన్నది సరస్వతిదేవి.
పార్వతీదేవి చిన్నగా నవ్వింది.

”ఒక పేదవాడి కొడుకో, కూతురో చదువుకోవాలని కోరుకుంటారు! వారు ఉదయం పాఠశాలకు వెళితే సాయంత్రమే ఇంటికి వస్తారు! వారికి మధ్యాహ్నం తినటానికి వంట చేయాల్సిన తల్లిదండ్రులు తమ బిడ్డ పాఠశాలకు వెళ్లకముందే నాలుగురాళ్లు సంపాదించుకునేందుకు తమ రెక్కల కష్టం ఎవరికైనా అమ్ముకునేందుకు వెళ్లిపోతారు! ఆ పసిబిడ్డకి మధ్యాహ్న భోజనం వస్తుంది! తల్లిదండ్రులను భోజనం పెట్టమని, చదువుకుంటానని ఆ పసిబిడ్డ అడిగితే ఏ సమాధానం వస్తుందో తెలుసా చెల్లీ!” అడిగింది పార్వతి.
ఏమి సమాధానం వస్తుందన్నట్లు చూసింది సరస్వతిదేవి!
”నీవు బడికిపోతే నీకు భోజనం పెట్టలేము బిడ్డా! అందుకే నీవు చదువుమానేసి, మాతోపాటు పనిలోకి రా!” అంటూ ఆ కష్టజీవులు తమ బిడ్డను చదివించలేక బడి మాన్పించి, పనిచేయిస్తారు! ఇక ఆ పేదబిడ్డ నీ అనుగ్రహం ఎలా పొందగలడు?” ప్రశ్నించింది పార్వతిదేవి.
సరస్వతిదేవి కళ్లలో నీళ్లు తిరిగాయి! పార్వతిదేవి ఆమెను అనునయించింది!

”ఇవన్నీ నీకు తెలియనివికావు! ఒక పండితుడిని అవమానించారన్న బాధతో ఇవన్నీ ఆలోచించలేదు! పాఠశాల పరమ పవిత్రమైనదే. కాని పిల్లలందరూ ముఖ్యంగా పేదపిల్లలు చదువు నేర్చుకోవటం అన్నిటికన్నా పరమ పవిత్రమైనది! ఇక గుడ్డు సంగతి! గుడ్డు పోషకాలకు నిలయం! పిల్లలకు ఎంతో అవరసం! అందువల్ల పాఠశాలలో గుడ్డు పెట్టడం అపచారం కాదు! నా అవతారాలైన పోచమ్మ, మైసమ్మ, కాళిక లాంటి దేవతల గుళ్లలో కోళ్లను, గొర్రెలను బలిస్తారు! నేనేనాడు అభ్యంతర పెట్టలేదు! నా గుళ్లు మైలపడ్డాయని ఎవర్ని శపించలేదు! నా మీద భక్తితో తను నచ్చినవాటిని నాకు ప్రసాదంగా పెడతారు! ఏ ప్రసాదమైనా వారి స్థితిగతులను, వారి ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది! గుడ్డును మాత్రం పిల్లలకు పెడుతున్న ప్రసాదంలా చూడాలి!” అన్నది పార్వతిదేవి.

”నిజమే!” అన్నది పార్వతిదేవి.
”కొందరు తాము సర్వజ్ఞులమని భావిస్తూ ఎదుటివారిని ఏమీ తెలియని అజ్ఞానులుగా ఎంచి ప్రవచనాలు చెబుతుంటారు! ప్రవచనం ఎప్పుడూ ఉత్కృష్టంగా ఉండాలి! కాని కొన్ని ప్రవచనాలు నికృష్టంగా ఉంటున్నాయి! రెక్కల కష్టం అంటే ఏమిటో తెలియకపోవడమే దీనికి కారణం! అందువల్ల ఈ ప్రవచనకారులను పొలం పనిచేయటానికి, లేదా ఫ్యాక్టరీలో పనిచేయించడానికి పంపించాలి! అప్పుడు రెక్కల కష్టం విలువతో అక్షరం విలువ కూడా సంపూర్ణంగా అర్థమౌతుంది!” అన్నది పార్వతిదేవి
సరస్వతిదేవి ”అవును!” అంటూ నవ్వింది.

ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -