– తప్పిన పెను ప్రమాదం
– మెరుగైన వైద్యం కోసం హన్మకొండకు తరలింపు
నవతెలంగాణ–పాలకుర్తి
గ్యాస్ మొద్దుకు రెగ్యులేటర్ ను అమర్చే పిన్ను సరిగా పనిచేయకపోవడంతో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఇంటి యజమానితో పాటు మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం మండల కేంద్రం పాలకుర్తిలో చోటుచేసుకుంది. పాలకుర్తి గ్రామానికి చెందిన చిదురాల నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం కొడకండ్లకు చెందిన శ్రీ యాకూబ్ సాయి భారత్ గ్యాస్ ఏజెన్సీ లో భారత్ గ్యాస్ కనెక్షన్ ఉందని తెలిపారు. గత నెల రోజుల క్రితం గ్యాస్ మొద్దును కొడకండ్ల శ్రీ యాకూబ్ సాయి భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ మొద్దును బుకింగ్ అనంతరం అందజేశారని తెలిపారు.
తమ కుటుంబ అవసరాలకు వాడుకుంటున్న గ్యాస్ అయిపోవడంతో కొడకండ్ల భారత్ గ్యాస్ ఏజెన్సీ అందించిన గ్యాస్ మొద్దును శనివారం అమర్చామని తెలిపారు. గ్యాస్ మొద్దుకు రెగ్యులేటర్ అమర్చడంతో గ్యాస్ లీకై వాసన వస్తుందని అన్నారు. గ్యాస్ వాసన రావడంతో రెగ్యులేటర్ ను ఆఫ్ చేసేందుకు వెళ్లగా పక్కనే ఉన్న దేవుని గుడిలో దీపం వెలగడంతో లీకైన గ్యాస్ ఒక్కసారిగా అంటుకొని మంటలు చెలరేగాయని తెలిపారు. ప్రాణ రక్షణ కోసం, ఇంట్లో ఎవరికీ నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో మంటలు చెలరేగుతున్న గ్యాస్ మొద్దును బయటకు పడేశానని తెలిపారు. ఇదే సమయంలో నాతో పాటు చిన్నారి చిదిరాల రిషిక కు తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు.
గ్యాస్ మంటలతో గాయాలైన నర్సయ్య, రిషికను పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. గ్యాస్ మంటలకు 40 శాతం గాయాలయ్యాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారని నర్సయ్య కుటుంబ సభ్యులు అన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ మొద్దులను కస్టమర్లకు అందజేసేటప్పుడే గ్యాస్ పిన్ను సక్రమంగా ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉండగా గ్యాస్ నిర్వహకులు అంటి ముట్టనట్లుగా వ్యవహరించడంతో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అధికారుల పర్యవేక్షణ లోపిస్తుందని విమర్శలు వస్తున్నాయి.



