నవతెలంగాణ – జుక్కల్
పదో తరగతి పరీక్షల షెడ్యూల్పై ‘గ్యాస్’ నీడలు ముసురుకుంటున్నాయి. 10, 12 రోజుల్లో పూర్తికావాల్సిన పరీక్షలను.. విద్యా శాఖ ఉన్నతాధికారులు ఏకంగా 34 రోజులకు పెంచారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు అంటే సుమారు నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ ఆఫీసర్లు షెడ్యూల్ రూపొందించారని సమాచారం. ఒక్కో పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజుల సుదీర్ఘ విరామం ఇచ్చారు.
ఈ సాగదీత వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవడమే కాకుండా, హాస్టళ్లలో ఉండేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, షెడ్యూల్ మార్చాలని అప్పట్లోనే విద్యార్థి, టీచర్ల సంఘాలు కోరినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. తాజాగా రాష్ట్రంలో మొదలైన గ్యాస్ సంక్షోభంతో మరోసారి టెన్త్ పరీక్షల షెడ్యూల్ అంశం తెరపైకి వచ్చింది.సిలిండర్ల కొరతతో గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో వంట కష్టాలు మొదలు కావడంతో టెన్త్ షెడ్యూల్ కుదించాలన్న డిమాండ్లు ఊపం దుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు డీఈవోలతో అధికారులు అత్యవసర రివ్యూ ఏర్పాటుచేయడం ఆసక్తి రేపుతోంది.



