ఉద్యోగం కోసం ఊరొదిలి వచ్చినోడికి, ఇంటినుంచి వచ్చే చాలీచాలని డబ్బుతో కాలం భారంగా గడుపుతున్నోడికి, నెలనెలా అద్దెడబ్బు కట్టలేక ఓనర్ నుంచి దాక్కునే వోడికి, హోటల్ తిండితో బక్కచిక్కిపోతున్నోడికి ఏ రాత్రయినా ఎలా నిద్రపడుతుంది.
మంచం మీద పడుకుని పైకి చూస్తే సీలింగూ, దానితో అవినాభావ సంబంధం వున్న ఫ్యాను కనపడ్తయి కాని కన్నుమూస్తే సమస్యలు క్యూకట్టి నిలబడతయి, నిద్ర దవడ పళ్లు రాలగొడ్తయి. సరిగ్గా నిద్రపోకపోతే మర్నాడు కొలువు కోసం ఎక్కే గడప ఎక్కలేడు కనక దిగే గడప దిగలేడు. అందువల్ల ఎలాగైనా సరే కన్ను మూయాల్సిందే అనుకున్నాడు మల్లీశ్వర్రావు.
బలవంతంగా కన్నుమూసి నిద్రపోవడానికి తనవంతు కృషి చేశాడు ఊళ్లో కృషీవలుడి కొడుకు. కన్ను మూసినట్టే వున్నాడు. నిద్రపోయినట్టే వున్నాడు. ఉన్నట్టుండి మంచం మీదినుంచి ఎట్లాగున్నవాడు అట్లాలేచి ఫ్యాను రెక్కలు విరిచి సీలింగు పక్కకు జరిపి ఆకాశయానం చెయ్యసాగాడు.
ఇదేంటి గదిలో కన్నుమూస్తే ఇలా మబ్బుల్లో తేలుతున్నాను అనుకున్నాడు. అప్పుడు చూశాడు ఈ పక్కా ఆ పక్కా పగలు చూసినా రాత్రి చూసినా జడుసుకునేట్టు వున్న ఇద్దరినీ, చెరో రెక్కా పుచ్చుకుని ఈడ్చుకుపోతున్న తెల్లగడ్డాలు, నల్లమీసాలు, జుట్టులో జులపాలు వున్నోళ్లని. ‘ఏరు! ఎవరు మీరు! ఎక్కడికిలా లాక్కుపోతున్నారు’ అని అరిచాడు.
‘మా ముఖాలు చేస్తే తెలియట్లే’ అన్నాడు ఒకడు.
‘పాపం యమలీల సినిమా వచ్చాక వచ్చిన తరం వాడు కదా తెలీదులే. ఉరేరు నువ్వు కన్నుమూశావురా’ అన్నాడు ఇంకొకడు.
‘అవును నిద్దరోవడానికేగా’ అన్నాడు మల్లీశ్వర్రావు అయోమయంగా.
‘కన్నుమూయడం అంటే ఇదేరా ఇన్నోసెంట్ ఫెలో యూ ఆర్ నో మోర్ ఆన్ ది ఎర్త్’ అని ఒకడంటే ‘వీ ఆర్ ట్రావెలింగ్ టు యమపురా’ అన్నాడు మరొకడు.
అప్పుడర్థమైంది మల్లికి తను నిద్రపోవాలనుకుని కన్నుమూశాడని. నిజంగానే కన్నుమూశానా? ఏ జబ్బూ లేనోడ్నే, పైలా పచ్చీసుదాటి పదేళ్లు కూడా కాలేదే అని ఏడ్చినంత పని చేశాడు. ‘ఉరేరు బర్త్ డేట్ కూడా డెత్ డేట్‌కు సంబంధం ఇల్లే. టైం అయి పూడ్చిందా, భూమ్మీద నిల్లే’ అన్నాడు కుడి రెక్క పుచ్చుకు తోస్తున్నవాడు. ‘వీడితో ‘చలసాని కబుర్లు’ మన కవసరమా, మన సిటీలోకి ఎంటరైపోయాం. సార్ కాళ్లముందు గిరాటేద్దాం’ అన్నాడు ఎడం రెక్క పుచ్చుకుని గెదుముతున్నవాడు.
ఊక బస్తాలా దబ్బున కింద పడ్డాడు మల్లీశ్వర్రావు. ఎత్తుమీద ఓ చేత్తో మీసాలు దువ్వుతున్న భారీ కట్‌అవుట్ వున్నవాడు. ‘వీడికేం శిక్షో చెప్పవోరు! అవతల నాకు డ్రింక్స్ టైం అయింది’ అన్నాడు. ‘సార్! సార్! ‘ఎం’లా నూటిరవయ్యిన్ని నూరవయ్యిన్ని రెండొందల ముప్పయిమూడిన్ని. ఇన్ని చాల్లే ఎన్ని సెక్షన్లు అప్పచెప్పుతావు పాయింటుకి రా అని గద్దించాడు ‘యంబాస్’.
మరేంటేదు సార్ వీడి బయోగ్రఫీ ప్రకారం వీడికి ‘హాట్ ఆయిల్ బేకింగ్’ శిక్ష అమలు చెయ్యాలి అన్నాడు యంబాస్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.
‘దెన్ వై లేట్. పెద్ద డేకిశా తెప్పించండి, పామాయిలో, సన్‌ఫ్లవరో ఏది చీప్ అయితే అది తెప్పించండి, అగ్గిపుల్ల వెలిగించండి, పొయ్యి మండించండి, నూనె మరిగించండి, వీణ్ణి వేగిరం వేగించండి’ అన్నాడు బాస్.
‘అదే ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం సర్! నో గ్యాస్! నో పొయ్యి, నో మంట, నో బేకింగ్. గ్యాసు షార్టేజ్ కారణంగా వీడ్ని ఇందాక చెప్పిన సెక్షన్ల ప్రకారం నూనెలో మిరపకాయ బజ్జీలా వేయించలేం. ఇంకా ఇలా వేగించాల్సిన వాళ్లు చాలామంది క్యూలో వున్నారు మరి’ అన్నాడు ఆడిటర్.
కాసేపు గదకేసి, కాసేపు మీసం చివర వంపుకేసి చూసుకున్న యంబాస్ ‘మన స్పెషల్ వీటో పవర్ ఉపయోగిద్దాం. గ్యాసులో లింకయి వున్న శిక్షలు పడ్డవారందనినీ కిందకి తోసెయ్యండి తక్షణం. గ్యాసు సంక్షోభం ముగిశాక వీళ్ల వేపుళ్ల సంగతి చూద్దాం’ అన్నాడు.
దబ్బున మంచం మీది నుంచి నేలమీద పడ్డాడు మల్లీశ్వర్రావు ఈ సారి ఊక బస్తాలా కాదు ఒంట్లో ఎముకలు ఫట్టుమనేలా. అబ్బా నొప్పి అయ్యో నొప్పి అనుకుంటూ లేచి కూచున్నాడు. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే అని పాడుకుంటూ ఇప్పట్నించి కన్ను మూయకూడదు నిద్రపోవాలి అంతే అనుకుంటూ.
బ్రేక్ ఫాస్ట్‌కని బైకు మీద బయలుదేరిన మల్లీశ్వర్రావు పాత డొక్కుబైకు దారి మధ్యలో రాను! నే రాను! బొంబయికి ఆను! అని మొండిపట్టు పట్టింది. వంటిళ్లల్లో పొయ్యి మండటానికి గ్యాసు రోడ్లమీద బైకు రన్నవటానికి పెట్రోలు కావాలని గుర్తొచ్చిన మల్లీశ్వరుడు తొయ్యోరు తొయ్యోరు మల్లీ తొయ్యోరు అనుకుంటూ బైకుతోసుకుంటూ చెమట కార్చుకుంటూ బంకులోకి వెళ్లాడు. ‘నో స్టాక్’ బోర్డు చూసి నోట మాట రాలేదు. అక్కడెక్కడ్నో కొట్లాడుకుంటున్రంట గద, అం దుకే పెట్రోల్ లేదు. ఇంకొంచెం దూరంల ఇంకో బంకు ఇంది కద పోరాదు అన్నాడు బంకు సీను. బండితోసే ఓపిక లేక దాన్ని ఓ మూల నిలబెట్టి మళ్లీ వస్తానంటూ కడుపు మోసుకుంటూ బయలుదేరాడు మల్లి.
హోటల్లో జనం అట్టేలేరు కాని ఐటెమ్స్ కూడా లేవు. పూరీ అయితేనేం, దోశ అయితేనేం, బోండా అయితేనేం ఆఖరుకి ఇడ్లీఅయితేనేం అన్నీ గ్యాసు గత ప్రాణాలే కద. ఉన్నవాటి ధరలు విని కళ్లు బైర్లు కమ్మినయి. తిరిగే కళ్లను ఆపాలని నిమ్మరసం మాత్రం తాగాడు. దానికి గ్యాసు అవసరం లేదు కనక చవకబేరం అని. అయితే బిల్లులో సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టితో పాటు గ్యాస్ క్రైసిస్ చార్జి కూడా వుంటటం ఏమిటని ప్రశ్నిస్తే హోటల్ వాడు అన్ని బిల్లుల్లోనూ జీసిసి చేర్చేశాం, ఇంక ముందిలాగే కంటిన్యూ చేస్తాం అని భ్రమరయుగం సినిమాలో మమ్ముట్టిలా నర్మగర్భంగా ఒడుంకుతిర చడుంకుతిరలో ఫరద్‌ఫజిల్‌లా అర్థం అయ్యీ అవకుండా నవ్వాడు.
నవ్వకుండా పనిచెయ్యలేదు. కడుపులో బరువు పడితే తప్ప అడుగుపడదు. సూర్యుడు జనాలచేత బనీన్లు కూడా విప్పించే ప్రయత్నంలో వున్నాడు. ఎలా? హౌ? అనుకుంటూ రోడ్డు మీద అడ్డంగా నిలబడ్డ మల్లీశ్వర్రావుకి ఎదురుగ్గా మ్యారేజిహాల్లో మంగళ వాయిద్యాలు కనపడి వినపడ్డవి. నాకే నేనెవరో తెలీదు. వాళ్లకేం తెలుస్తుంది. యమ అర్జెన్సీ తప్పదు అనుకుంటూ అడుగు పెట్టాడు మండపంలోకి కాదు, లంచ్ బఫే హాల్లోకి.
రెండు స్వీట్లు, రెండు హాట్లు, పనీర్‌కర్రీ, బిర్యానీ, రైతా, అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలూ… మళ్లీ రేపటిదాకా తిండి సంగతి ఎత్తనే ఎత్తను అనుకుంటూ ప్లేట్ మోసుకుంటూ లైన్లో వెళ్లాడు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయా? ప్లేట్లో ఓ బియ్యం పాకెట్టు, రెండేసి చొప్పున ప్యాక్ చేసిన కూరగాయల పాకెట్టు, చిన్న పంచదార పొట్లాం, ఓ పెరుగు పాకెట్టు పెట్టారు. మైక్‌లో ఓ పెద్దాయన… గ్యాసు కొరత కారణంగా వండని వస్తువులే ఇస్తున్నామని, ఇళ్లకు వెళ్లి ఇండక్షన్ పొయ్యి మీదో, కట్టెల పొయ్యిమీదో వండుకు తినండని, అసౌకర్యానికి క్షమించడని రిక్వెస్టు చేస్తున్నాడు.
తన్ను తాను మొయ్యడమే కష్టంగా వుంటే ఈ పాకెట్ల మోతేమిటని అవన్నీ అక్కడే వదిలేసి రోడ్డు ఎక్కాడు మల్లీశ్వర్రావు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చినట్టు వీపు మీద కొడితే మూతిపళ్లు రాలినట్టు అక్కడెక్కడో ఓ తిక్కలోడు దేశాల మీద పడి వీరంగం చేస్తుంటే ఇక్కడ మనకీ గ్యాసు కష్టాలేమిట్రా అని జనం వాపోయారు కొత్త స్టయిల్ పెళ్లి భోజనం బ్యాగుల్లో సర్దుకుంటూ.
– చింతపట్ల సుదర్శన్
9299809212



