Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంగస్సాల్‌ సగటు జీవితాల ఆవిష్కరణ

గస్సాల్‌ సగటు జీవితాల ఆవిష్కరణ

- Advertisement -

నాలుగు దశాబ్దాల ఆనందాచారి నడకలోంచి పుట్టిందే ఈ కథా సంపుటి : పుస్తకావిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాలు పితకడం ఊరి వాళ్లకు తెలుసు… మెదళ్లను పితకడం కంపెనీలకు తెలుసు… హోం సికయ్యానని అనుకుంటున్నారందరూ… అది హోం సిక్‌కాదు.. హ్యూమానిటీ సిక్‌….ఇంత దయార్ద్రహృదయాలు చూస్తుండగానే ఒక కుటుంబం ఒక్క రక్తపు బొట్టు పడకుండానే విముక్తి పొందింది…. అంటూ నేటి సమకాలీన సమాజంలోని కష్టాలను, కన్నీళ్లను, బాధలను ఆవిష్కరించింది గస్సాల్‌ కథల సంపుటి” అని ప్రముఖ కవి ఏనుగు నర్సింహరెడ్డి అన్నారు. నవతెలంగాణ బుకహేౌస్‌ ఎడిటర్‌ కటుకోజ్వల ఆనందాచారి రాసిన ‘గస్సాల్‌’ మరికొన్ని కథల సంపుటి పుస్తకాన్ని తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంధ్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. మొదటి ప్రతిని పానుగంటి నర్సింహాచారి, సత్యవతిలకు రచయిత అందజేశారు. అనంతరం నర్సింహరెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల తన జీవితపు అనుభవాలను రచయిత పుస్తకంలో ఆవిష్కరించారని పేర్కొన్నారు. కొంతమంది ప్రజల జీవితాలపై ఉక్కుపాదం మోపిన సీఐఏ భూతాన్ని ‘హిందూ సితా హమారా’లో, గ్లోబలైజేషన్‌ దెబ్బకు పనులు దొరకక ఆగమై చితికి పోయిన వృత్తులను ‘ఆచూకీలేని హత్య’లో వెంకటాచారి పడ్డ కష్టాలను, ప్రభుత్వ భూముల్లో పేదలేసుకున్న గుడిసెలను పోలీసుల బందోబస్తులో కూల్చేసిన వాస్తవ ఘటనలను ‘గూడు’లో రచయిత ఆవిష్కరించారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంపుటిలోని పద్నాలుగు కథల్లో ఒక్కో కథ ఒక్కో నేపథ్యంలోంచి పుట్టిందని అన్నారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాలను రచయిత అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. ముల్కనూర్‌ ప్రజా గ్రంథాలయం డైరెక్టర్‌ వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ ఆనందాచారి కథల సంపుటి ఆద్యంతం సరళమైన భాషలో, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉందని కొనియాడారు. ముఖ్యంగా గస్సాల్‌ కథ కొత్తగా సాహిత్యంలోకి వచ్చే కవులు, రచయితలకు ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ నన్నయ కాలం నుంచి నేటి వరకు సాహిత్యం, కథలు అనేక మార్పులు చెందాయని గుర్తు చేశారు. ఏ కాలంలో అయినా ప్రజల వేదనను, ఆవేదనను తాకిన కథలే చివరి వరకు నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. నేటి సామాజిక అసమానతలు, కష్టాలను ఇతి వృత్తంగా చేసుకుని తన జీవితపు అనుభవాలను రంగరించి రచయిత ఈ కథా సంపుటి తీసుకొచ్చారని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గస్సాల్‌ హ్యూమన్‌ డాక్యుమెంట్‌ అని పేర్కొన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్‌ నామోజు బాలాచారి మాట్లాడుతూ చెత్తోడు కథ తనను బాగా కదిలించిందని తెలిపారు. ప్రముఖ కవి, విమర్శకులు ఆర్‌.సీతారాం మాట్లాడుతూ రచయిత తన చుట్టూ ఉన్న వాస్తవమైన జీవితాన్ని కథలుగా మలిచారని పేర్కొన్నారు. జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ గస్సాల్‌ కథలు చదువుతుంటే తనకు కూడా కథలు రాయాలన్న జిజ్ఞాస కలుగుతోందని చెప్పారు. కథల సంపుటి రచయిత ఆనందాచారి తన స్పందన తెలియజేస్తూ కథల నేపథ్యాన్ని వివరించారు. కార్యక్రమానికి అనంతోజు మోహనకృష్ణ అధ్యక్షత వహించగా, డాక్టర్‌ ఎస్‌కే.సలీమ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత్రి నస్రీన్‌ఖాన్‌, తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, చిత్రకారుడు చరణ్‌ పరిమి, సాయివంశీ, ఏబూషి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -