Saturday, September 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమరుభూమిగా గాజా

మరుభూమిగా గాజా

- Advertisement -

పాలస్తీనా ఏర్పాటు అసంభవం : నెతన్యాహూ
ఇజ్రాయిల్‌ దాడుల్లో మరో 50 మంది మృతి


గాజా స్ట్రిప్‌ : ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా గాజా నగరం ఇప్పుడు మరుభూమిలా మారిపోయింది. నగరంలోని ఆకాశ హర్మ్యాలను ఇజ్రాయిల్‌ ఇప్పటికే నేలమట్టం చేసింది. ఒకప్పుడు వేలాది మంది నివసించిన ఆ భవనాలు నేడు శిథిలాలుగా దర్శనమిస్తున్నాయి. గత కొన్ని వారాల వ్యవధిలోనే కనీసం యాభై బహుళ అంతస్తుల భవనాలు నామరూపాలు లేకుండా పోయాయని పాలస్తీనా పౌర రక్షణ విభాగం తెలిపింది. ప్రజలను బలవంతంగా నగరం నుంచి తరిమేసేందుకు ఇజ్రాయిల్‌ సేనలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. గాజా శివారులోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాదాపుగా అదృశ్యమై పోయాయి. నగరంలోని జెయిటన్‌ ప్రాంతంలోనే ఆగస్ట్‌ నుంచి ఇప్పటి వరకూ పదిహేను వందల ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కనీసం ఒక్క భవనం కూడా కనిపించడం లేదు.

యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గాజా శివారు ప్రాంతాలలో 23 లక్షల మంది నివసించే వారు. ఇప్పుడు ఆ సంఖ్య బాగా పడిపోయింది. జనాభాలో పది శాతం మంది ఇజ్రాయిల్‌ దాడులలో చనిపోవడమో లేదా గాయపడడమో జరిగింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తోంది. వారంతా నగరం నుంచి గాజా స్ట్రిప్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆ ప్రాంతాలన్నీ ఇప్పటికే కిక్కిరిసిపోవడంతో కొందరు చేసేదేమీ లేక తిరుగు ముఖం పడుతున్నారు. దక్షిణ ప్రాంతం వైపు వెళ్లడానికి సలాV్‌ా అల్‌-దిన్‌ స్ట్రీట్‌, కోస్తా అల్‌-రషీద్‌ స్ట్రీట్‌ మాత్రమే అనువుగా ఉంటాయి. వీటిలో సలహా అల్‌-దిన్‌ను దుండగులు మూసేశారు. ఇక మిగిలిన ఏకైక ప్రాంతం అల్‌ రషీద్‌ నిరాశ్రయులైన ప్రజలతో జనసమ్మర్దంగా ఉంది. దారి పొడవునా ఏర్పాటు చేసిన శిబిరాలలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు.

ఇప్పుడు గాజాలో సురక్షిత ప్రాంతమంటూ ఏదీ లేదు. దక్షిణ కోస్తా ప్రాంతమైన అల్‌-మవాసీని ఇజ్రాయిల్‌ ‘మానవతా జోన్‌’గా పిలుస్తోంది. ఆ ప్రదేశం కూడా సురక్షితం కాదు. ఓ వైపు దాడులు చేస్తూనే మరోవైపు గాజా నగరంలోని ప్రజలను అల్‌-మవాసీ ప్రాంతానికి దక్షిణ దిశగా తరలించేందుకు ఇజ్రాయిల్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఖాన్‌ యూనిస్‌లో ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. వీరంతా కేవలం 28 చదరపు కిలోమీటర్ల పరిధికే పరిమితం కావడంతో మానవతా సంక్షోభం మరింత తీవ్రమైంది. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా శివారు ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. అనేక ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. గాజా నగరంలోని షేక్‌ రద్వాన్‌ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ దళాలు ముమ్మరంగా దాడులు సాగిస్తున్నాయి. ఇక్కడి మార్కెట్లు జనంతో కిటకిటలాడుతుంటాయి. అయితే వీధులన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా షేక్‌ రద్వాన్‌, రెమల్‌, టఫా, సబ్రా, జెయిటన్‌, షుజయే, బెయిల్‌ లహియా, బెయిట్‌ అన్నన్‌, జబాలియా తదితర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. కాగా ఇజ్రాయిల్‌ క్షిపణి దాడులతో అమాయక జనం చనిపోతూనే ఉన్నారు. శుక్రవారం జరిపిన దాడుల్లో మరో 50 మంది మృతిచెందారు. వీరిలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది ఉన్నట్టు పాలస్తీనా అధికారవర్గాలు ధ్రువీకరించాయి.

పాలస్తీనా ఏర్పాటు అసంభవం : నెతన్యాహూ
పాలస్తీనా దేశం ఏర్పాటు అసంభవమని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ నెలలో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాలస్తీనాను గుర్తిస్తామని ఫ్రాన్స్‌, కెనడా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నెతన్యాహూ మాత్రం తన మొండిపట్టు వీడడం లేదు. వెస్ట్‌బ్యాంక్‌లోని మాలే అడుమిమ్‌ సెటిల్మెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నెతన్యాహూ మాట్లాడుతూ ‘పాలస్తీనా దేశమనేదే లేదు. నిజం…ఇది మా ప్రాంతం. మా వారసత్వాన్ని, భూమిని, భద్రతను మేము చూసుకుంటాం. మా నగర జనాభాను రెట్టింపు చేసుకుంటాం’ అని చెప్పారు. ఈ ప్రాంతం జెరుసలేం శివారులో ఉంది. ఇక్కడ వేలాది ఆవాసాల నిర్మాణం జరుగుతోంది. వివాదాస్పద ఈ1 సెటిల్మెంట్‌ విస్తరణ ప్రణాళికను అమలు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై నెతన్యాహూ సంతకం చేశారు. తద్వారా పాలస్తీనా కోరుతున్న వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం తమదేనని తేల్చి చెప్పారు. ఈ1 ప్రాజెక్ట్‌ వెస్ట్‌బ్యాంక్‌ను రెండు భాగాలుగా చేస్తుంది. దానిని తూర్పు జెరుసలేం నుంచి వేరు చేస్తుంది. ఈ ప్రణాళికకు రక్షణ మంత్రిత్వ శాఖ సివిల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదం తెలిపింది. తూర్పు జెరుసలేంకు తూర్పు దిశగా, నగరానికి పశ్చిమం వైపున మాలే అడుమిమ్‌లో 3,412 నివాస గృహాల నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం ఒక బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -