ప్రతి గంటకూ ఒక చిన్నారి కన్నుమూత
ప్రతి 33 మందిలో ఒకరు మృతి
గాజా మారణకాండకు రెండేండ్లు
అంతర్జాతీయ ఉదాసీనతకు నిలువెత్తు చిహ్నం
గాజా, జెరూసలేం : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండకు రెండేండ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘకాలంగా ఇజ్రాయిల్ మిలటరీ సాగించిన వైమానిక, భూతల దాడుల్లో గాజా స్ట్రిప్ మరుభూమిగా మారింది. ఊళ్ళకు ఊళ్ళు శిధిలాల దిబ్బలుగా మారాయి. వేలాదిమంది మరణించారు. మరికొన్ని వేలమంది శిధిలాల కింద సజీవ సమాధులయ్యారు. లక్షల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. వీరిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు ఎందరో. అంతర్జాతీయంగా ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఎంత ఒత్తిడి ఎదురైనా ఇజ్రాయిల్ తన మొండి, మూర్ఖత్వ వైఖరి విడనాడలేదు. దానికి అమెరికా, మిత్రపక్షాలు ఇచ్చే మద్దతు కూడా తోడైంది…వెరసి రెండేండ్ల కాలంలో గాజాలో పోయిన వారు పోగా వున్న వారు జీవచ్ఛవాలుగా మారారు. గాజాలోకి వచ్చే మానవతా సాయం కూడా అందనివ్వకుండా ఇజ్రాయిల్ సాగించే అమానుష చర్యలతో, ఆంక్షలతో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అంతర్జాతీయంగా నేతల ఉదాసీనతకు నిలువెత్తు చిహ్నంగా మారింది.
హమాస్ కీలక డిమాండ్లు
ఇదిలావుండగా, కైరోలో ఇజ్రాయిల్, హమాస్ మధ్య చర్చలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చల్లో హమాస్ తన కీలక డిమాండ్లను ప్రవేశపెట్టింది. గాజా ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు గల అన్ని అడ్డంకులను అధిగమించాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. శాశ్వత, సమగ్ర కాల్పుల విరమణ వుండాలి, గాజా నుండి ఇజ్రాయిల్ బలగాలు పూర్తిగా వైదొలగాలి, ఎలాంటి ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందనివ్వాలి, నిర్వాసితులందరూ తమ ఇళ్ళకు చేరాలి, గాజాలో సంపూర్ణ పునర్నిర్మాణ ప్రక్రియ తక్షణమే చేపట్టాలి. దీన్ని పాలస్తీనా జాతీయులతో కూడిన సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందం న్యాయబద్ధంగా వుండాలని హమాస్ ప్రతినిధి ఫవ్జి బర్హౌమ్ చెప్పారు. నెతన్యాహు గతంలో జరిగిన చర్చలన్నింటినీ ఉద్దేశ్యపూర్వకంగా చెడగొట్టారని, ప్రస్తుత చర్చలైనా ఎలాంటి అవరోధాలు లేకుండా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
శిధిలాల దిబ్బలే..
92శాతం నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. 88శాతం వాణిజ్య సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 62శాతం మంది ప్రజలు తమకు సంబంధించిన అన్ని రకాల లీగల్ పత్రాలు పోగొట్టుకున్నారు. 2300కి పైగా విద్యా సంస్థలు శిధిలాల కుప్పలుగా మారాయి. వీటిలో 63 యూనివర్శిటీ భవనాలు కూడా వున్నాయి. 92శాతం పాఠశాలలు పూర్తిగా పునర్నిర్మాణం చేసుకోవాల్సిందే. దాదాపుగా 1700మంది వైద్య సిబ్బంది మరణించారు. 300మంది మీడియా సిబ్బంది విధి నిర్వహణలో వుంటూ ఈ దాడుల్లో మరణించారు. మంగళవారం కూడా గాజాలో దాడులు కొనసాగాయి. దాడులను తక్షణమే ఆపాలంటూ ట్రంప్ పిలుపిచ్చిన శుక్రవారం నుండి ఇప్పటివరకు 104మంది మరణించారు.
సిగ్గుతో తలదించుకోవాలి
గాజాలో ప్రస్తుతం నెలకొన్న బీభత్సమైన, దయనీయమైన పరిస్థితులకు అంతర్జాతీయ సమాజం సిగ్గుతో తలవంచుకోవాలని హమాస్ విమర్శించింది. ఇజ్రాయిల్ ఇంతలా రెచ్చిపోయి మారణకాండను సృష్టిస్తున్నా ప్రపంచ దేశాలు మౌనంగా, ఉదాసీనంగా వ్యవహరించాయని విమర్శించింది. మరోవైపు ఇజ్రాయిల్‌లో కూడా ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బందీలను విడిపించడంలో, యుద్ధాన్ని ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దారుణమైన రీతిలో మిలటరీ ఆపరేషన్లు, అమెరికా నుంచి అడ్డూ అదుపు లేని రీతిలో మద్దతు వున్నా వారి లక్ష్యాన్ని నెరవేరనివ్వబోమని హమాస్ ప్రతినిధి బర్హౌమ్ స్పష్టం చేశారు.
అమానుషదాడుల్లో…
రెండేండ్ల అమానుష దాడుల్లో 67,173మంది మరణించారు. అంటే గాజాలోని ప్రతి 33మందిలో ఒకరు చొప్పున మరణించినట్లైంది. అలాగే మృతుల్లో దాదాపు 20వేల మంది చిన్నారులు వున్నారు. అంటే దాదాపుగా ప్రతి గంటకు ఒక చిన్నారి మరణించాడు. 1,69,780మంది గాయపడ్డారు. అంటే గాజాలోని ప్రతి 14మందిలో ఒకరు గాయపడ్డారు. మరికొన్ని వేలమంది శిధిలాల కింద సమాధయ్యారు. 10,800మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ జైళ్ళలో దుర్భర పరిస్థితుల్లో మరణిస్తున్నారు. వీరిలో 450మంది చిన్నారులు కాగా, 87మంది మహిళలున్నారు. 3,629మంది ఎలాంటి అభియోగాలు, విచారణ లేకుండా ఆ కూపాల్లో మగ్గుతున్నారు.