ఇక పగటిపూట కాల్పుల విరమణ లేదు :ప్రకటించిన ఇజ్రాయిల్ మిలటరీ
తాజా దాడుల్లో 59మంది మృతి
63వేలు దాటిన గాజా మరణాలు
గాజా : గాజా నగరాన్ని ‘ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతం’గా ఇజ్రాయిల్ మిలటరీ శుక్రవారం ప్రకటించింది. మానవతా సాయాన్ని తీసుకెళ్ళే ట్రక్కులను అనుమతించేందుకు గానూ మధ్యాహ్నం పూట కాల్పులకు విరామం ఇవ్వడాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆహారం, ఇతర సహాయం అనుమతించేందుకై ఉదయం 10గంటల నుండి రాత్రి గంటల వరకు గాజా, డేర్ అల్ బాలాV్‌ా, మౌవసి తదితర ప్రాంతాల్లో ఇజ్రాయిల్ దాడులను నిలిపివేసేది ఈ ప్రాంతాల్లో వేలాదిమంది నిర్వాసితులు తల దాచుకున్నారు. అయితే గాజాలో తన దాడులను మరింత విస్తరించేందుకు ఇజ్రాయిల్ సన్నద్ధమవుతోంది. కీలకమైన ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు మొదలయ్యాయి. వేలాదిమంది రిజర్విస్ట్‌లను కూడా రంగంలోకి దించింది. అయితే తాజాగాదాడులను మరింత ఉధృతం చేసినట్లైతే గాజాలో పరిస్థితులు అదుపు తప్పుతాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరించింది. ఇజ్రాయిల్ ఆర్మీ వైఖరితో ఇప్పటికే ఆహార డెలివరీలకు సవాళ్ళు ఎదురయ్యాయని నార్వే శరణార్ధ మండలి ప్రకటించింది. గాజాలో ఆహార సరఫరాలను సమన్వయంచేసే సహాయక గ్రూపుల సంకీర్ణ సంస్థ ఇది. గతంలో ఎన్నడూ లేని రీతిలో విపరీతమైన ఆంక్షలను, కట్టుబాట్లను ఎదుర్కొంటున్నామని ఆ సంస్థ ప్రతినిధి షాయినా లౌ శుక్రవారం చెప్పారు. ఉధృతమైన మిలటరీ కార్యకలాపాల వల్ల తమ కార్యకలాపాలు మరింత దెబ్బ తింటున్నాయని చెప్పారు. విస్తరించిన సైనిక చర్యలో భాగంగా ఆర్మీ దాడులు కూడా మొదలుపెట్టినట్లు మిలటరీ ప్రతినిధి ఆదారీ శుక్రవారం ఎక్స్ పోస్టులో తెలిపారు. ”ఇక వేచి వుండేదిలేదు. ప్రాధమిక కార్యకలాపాలు ఆరంభమయ్యాయి.” అని ప్రకటించారు. నగర శివార్లలో ప్రస్తుతం దాడులు ఉధృతంగాకొనసాగుతున్నాయన్నారు.
పోషకాహార లోపంతో మరో ఐదుగురు మృత్యువాత
గత 24గంటల్లో గాజాలో 59మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో ఆహారం కోసం వెళ్ళి చనిపోయిన వారు 23మంది వున్నారు. మరో 224మంది గాయపడ్డారు. అలాగే కరువు బారిన పడి మరో ఐదుగురు చనిపోయారు. దీంతో పోషకాహార లోపంతో మృతి చెందిన వారి సంఖ్య 322కి చేరుకుంది. వీరిలో 121మంది చిన్నారులే వున్నారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయిల్ ప్రారంభించిన ఈ యుద్ధంలో 63,025మంది మరణిం చారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆహారం కోసం రేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతూ, అక్కడ జరిగే దాడుల్లో కన్ను మూసిన వారి సంఖ్య 2203కి చేరుకుంది. ఈ దాడుల్లో 16,228మంది గాయపడ్డారు.
హమాస్ లొంగకపోతే, గాజాను విలీనం చేసుకుంటాం
హమాస్ లొంగకపోతే, గాజాను విలీనం చేసుకుం టామని ఇజ్రాయిల్ మంత్రి ఒకరు హెచ్చరించారు. హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టడానికి నిరాకరిస్తే, గాజా స్ట్రిప్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రారంభించాలని ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి బెజలెలె స్మోట్రిచ్ గురువారం పిలుపునిచ్చారు.