Monday, July 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాకు సాయం అందాల్సిందే

గాజాకు సాయం అందాల్సిందే

- Advertisement -

అభిప్రాయపడుతున్న అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు
వాషింగ్టన్‌ డీసీ :
ఆకలితో అల్లాడిపోతున్న గాజా ప్రజలకు తక్షణమే ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాలను అందించాలని అమెరికా ప్రతినిధి సభలోని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. గాజాకు అత్యవసర సామగ్రి అందకుండా ఇజ్రాయిల్‌ దిగ్బంధనం చేయడాన్ని కొందరు తీవ్రంగా నిరసించారు. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై కాంగ్రెస్‌ సభ్యులు స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయిల్‌ మద్దతుతో నడుస్తున్న జీహెచ్‌ఎఫ్‌ ఆహార పంపిణీ కేంద్రాలపై దుమ్మెత్తి పోశారు. కేంద్రాల వద్ద సాయం కోసం ఎదురు చూస్తూ వెయ్యికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ గాజాను నిర్మూలించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని ప్రోగ్రెసివ్‌ సెనెటర్‌ బెర్నీ సాండర్స్‌ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది వాస్తవం. తీవ్రవాద ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల మంది పాలస్తీనియన్లను చంపడమో గాయపరచమో చేసింది. వీరిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. గాజాను తుడిచిపెట్టడానికి ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఆకలిని వాడుకుంటోంది’ అని ధ్వజమెత్తారు.
అమెరికా ప్రతినిధి సభ కాంగ్రెస్‌ అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ చర్యలను సమర్ధిస్తోంది. ఏటా ఆ దేశానికి అనేక బిలియన్‌ డాలర్ల సైనిక సాయం అందించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇస్తోంది. అయితే తాజాగా ఇజ్రాయిల్‌ చర్యలపై కాంగ్రెస్‌లో వ్యతిరేకత కన్పిస్తోంది. అయితే ఇజ్రాయిల్‌ ప్రభుత్వంపై ఆంక్షలు విధించే స్థాయికి ఆ వ్యతిరేకత ఇంకా చేరుకోలేదు. గత వారమే ఇజ్రాయిల్‌ క్షిపణి రక్షణ కోసం ఐదు వందల మిలియన్‌ డాలర్లు అందించే ప్రతిపాదనను ప్రతినిధి సభ భారీ మెజారిటీతో ఆమోదించింది. కాగా గాజాలో పనిచేస్తున్న మానవతా సహాయ గ్రూపులను మార్చడంపై నెతన్యాహూ, ట్రంప్‌లపై డెమొక్రటిక్‌ సెనెటర్‌ క్రిస్‌ వాన్‌ హాలెన్‌ మండిపడ్డారు. ఇది మరింత విధ్వంసానికి, మరిన్ని మరణాలకు దారితీస్తుందని తెలిపారు. గాజాలో ప్రతి రోజు భయం పెరిగిపోతోందని చెప్పారు. ఇది ఎంత మాత్రం కొనసాగరాదని స్పష్టం చేశారు.
మానవతా సాయాన్ని అడ్డుకోవడం ద్వారా గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ సభ్యుడు జాన్‌ గారామెండీ విమర్శించారు. ప్రోగ్రెసివ్‌ కాంగ్రెస్‌ సభ్యులలో కొందరు మాత్రమే ఇజ్రాయిల్‌ చర్యలను తప్పుపడుతుండగా అమెరికాలోని ప్రముఖ హక్కుల గ్రూపులు, ఐరాస నిపుణులు మాత్రం ఇజ్రాయిల్‌ సైనిక చర్యను జాత్యాహంకారంగా అభివర్ణించారు.
నౌకలో పాత్రికేయురాలు తానియా ‘తాన్‌’ సాఫీ, మానవ హక్కుల కార్యకర్త రాబర్ట్‌ మార్టిన్‌ సహా 21 మంది ఉన్నారని ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా కొయలేషన్‌ తెలిపింది. నౌకలో ఇద్దరు ఆస్ట్రేలియా వాసులు ఉన్నారన్న విషయం తమకు తెలుసునని, టెల్‌ అవీవ్‌లోని తమ అధికారులు అక్కడి వారితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆస్ట్రేలియా విదేశాంగ, వాణిజ్య శాఖ ప్రతినిధి చెప్పారు. నౌకలో అల్‌ జజీరాకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు కూడా ఉన్నారు. ఫ్రాన్స్‌ రాజకీయ నేతలు ఎమ్మా ఫోరియో, జాతీయ అసెంబ్లీ ఎంపీ గాబ్రియేల్‌ కాథలా సైతం ఉన్నారు. నౌకలోని కెమేరాలు పనిచేయకుండా చేశారని, దీంతో దానితో సంబంధాలు తెగిపోయాయని కొయలేషన్‌ చెప్పింది.
సహాయ నౌకను అడ్డుకున్న ఇజ్రాయిల్‌
ఇదిలావుండగా సహాయ సామగ్రిని తీసుకొని నౌకలో గాజాకు బయలుదేరిన ఇద్దరు ఆస్ట్రేలియన్లను ఇజ్రాయిల్‌ దళాలు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ ధృవీకరించింది. గాజాకు నిత్యావసరాలను చేర్చేందుకు ప్రయత్నించిన తన సిబ్బందిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఫ్రీడమ్‌ ఫ్లోటిల్లా కొయలేషన్‌ గ్రూప్‌ ఆరోపించింది. నవారెన్‌ అనే నౌక ఈజిప్ట్‌ తీరానికి యాభై కిలోమీటర్లు, గాజాకు పశ్చిమంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇజ్రాయిల్‌ దళాలు దానిని అడ్డుకున్నాయి. గాజా తీరంలోని మారీటైమ్‌ జోన్‌లోకి ఈ నౌక అక్రమంగా ప్రవేశించిందని, అందుకే దానిని ఆపేశామని ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ చెబుతోంది. నౌకలోని ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపింది. తన ఆంక్షలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం, చట్టవిరుద్ధమని, ప్రస్తుతం గాజాలో కొనసాగుతున్న మానవతావాద ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగిస్తుందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -