– జిల్లాలోని గీత కార్మికులు తరలిరావాలని పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి
గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026 – 27 బడ్జెట్‌లో రూ.5000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సైదగౌని వెంకట్ గౌడ్ తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందన్నారు.
గత సంవత్సరం బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయించినప్పటికీ, నిధుల కొరత పేరుతో వాటిని విడుదల చేయలేదని, కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారని విమర్శించారు. కనీసం ఈ ఏడాది బడ్జెట్‌లో అయినా రూ.5000 కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తుచేస్తూ, పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ.4000కు పెంచాలని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. గీత కార్మికుల హక్కుల సాధన కోసం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో కల్లు గీత కార్పొరేషన్‌కు రూ.5000 కోట్లు కేటాయించాలి.
కల్లు గీత వృత్తి చేసే వారందరికీ “కాటమయ్య రక్షణ కవచం” అమలు చేయాలి. పెన్షన్‌ను రూ.4000కు, ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలి. పెండింగ్ ఎక్స్‌గ్రేషియా డబ్బులను వెంటనే విడుదల చేయాలి. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి. నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. నెక్లెస్ రోడ్డులో మూసివేసిన నీరా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాలి. చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి.
కల్లు గీత సొసైటీలను బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి. సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి. కల్లు లోని పోషకాలు, ఔషధ గుణాలను ప్రభుత్వం ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. లిక్కర్ షాపుల్లో గౌడులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి. కల్లు షాపులపై నార్కోటిక్స్, ఎక్సైజ్ దాడులను అరికట్టాలనీ తదితర డిమాండ్ల అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజా గౌడ్, ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, స్వామి గౌడ్, సాయ గౌడ్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



