– జిల్లా మహాసభకు భారీగా తరలిరావాలి
– మండల అధ్యక్షుడు అనపురం చంద్రమౌళి గౌడ్
నవతెలంగాణ -పెద్దవంగర: కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు అనపురం చంద్రమౌళి గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని అవుతాపురం లో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభ కరపత్రాలను రాష్ట్ర సలహాదారు గునిగంటి మోహన్ గౌడ్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 14 న జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా మూడవ మహాసభ కు గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గీత కార్మికుల ఫెన్షన్ రూ.4,000/- పెంచి, సభ్యత్వం కలిగి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఎక్స్‌గ్రేసియా రూ.10 లక్షలకు పెంచాలని, గీత సొసైటీలో సభ్యత్వం కలిగి సహజ మరణం పొందిన గీత కార్మికుడికి రూ.5 లక్షల గీతన్న బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎరుకల సమ్మయ్య, బొమ్మెర శ్రీను, బొమ్మెర బిచ్చాలు, యాకయ్య, సోమల్లు, మద్దెల గురువయ్య, వెంకన్న, సత్యనారాయణ, సంపత్, లచ్చయ్య, సోమన్న తదితరులు పాల్గొన్నారు.



