Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జెన్కో అధికారులు లీజ్ ఆలోచనను విరమించుకోవాలి

జెన్కో అధికారులు లీజ్ ఆలోచనను విరమించుకోవాలి

- Advertisement -

భూ నిర్వాసితుల హక్కుల సాధన పోరాట అధ్యక్షుడు  కేశారపు రవి
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను లీజుకు తీసుకునే ఆలోచన జెన్కో అధికారులు తక్షణమే విరమించుకోవాలని భూ నిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేశారపు రవి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా డేంజర్ జోన్లో నిత్యం ప్రాణాపాయ పరిస్థితుల్లో జీవిస్తున్న తాడిచెర్ల, కాపురం గ్రామాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యతను పూర్తిగా విస్మరించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టిఎస్ జెన్కో) అధికారులు,ఇప్పుడు ఇళ్లను లీజుకు తీసుకొని నెలనెలా డబ్బులు ఇస్తాం అంటూ చేస్తున్న ఆలోచన ప్రజల ప్రాణాలతో బహిరంగంగా చెలగాటమాడడమేనని ఆరోపించారు.

డేంజర్ జోన్లో ప్రజలను అలాగే ఉంచి, అద్దెల పేరుతో సమస్యను తాత్కాలికంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం తీవ్రమైన పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగితే, దానికి పూర్తి బాధ్యత జెన్కో అధికారులదేనన్నారు. డేంజర్ జోన్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ జెన్కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఆందోళనకరమన్నారు.

ఉన్నత అధికారుల ఆదేశాలను కూడా అమలు చేయని తీరును చూస్తే, ప్రజల ప్రాణాల పట్ల జెన్కో అధికారులకు ఎలాంటి బాధ్యతాభావం ఉందో అర్థమవుతోందన్నారు. ఇండ్లకు విద్యుత్ మీటర్లు ఉండాలి, ఇంటి పన్నులు చెల్లించి ఉండాలి, మొదటి సర్వేలో ఉన్న ఇండ్లకే చెల్లిస్తాం అంటూ నిబంధనలు విధించడం అవివేకపు, మానవత్వ రాహిత్య నిర్ణయంగా ఉందన్నారు.

ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ముందుగా రక్షించాల్సిన బాధ్యతను వదిలేసి, ఇప్పుడు డాక్యుమెంట్ల పేరుతో షరతులు విధించడం చట్ట స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమన్నారు. డేంజర్ జోన్లో నివసిస్తున్న ప్రతి కుటుంబం,ఇల్లు రకం, విద్యుత్ మీటర్, ఇంటి పన్నులు ఉన్నా లేకపోయినా రాష్ట్ర రక్షణకు అర్హులేనని, జీవించే హక్కును రాజ్యాంగం హామీ ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. డేంజర్ జోన్ నుంచి శాశ్వత పునరావాసం ఎలాంటి షరతులు లేకుండా గెజిట్ చేసిన ప్రతి ఇంటికి పూర్తి నష్టపరిహారం, పునరావాసం ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -