Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంసేవా రంగంలో లింగ అసమానతలు

సేవా రంగంలో లింగ అసమానతలు

- Advertisement -

వేతనాల్లో భారీ అంతరాలు
పురుషుల కంటే సగమే సంపాదిస్తున్న మహిళలు
స్త్రీల భాగస్వామ్యమూ తక్కువే
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులివి
నిటి ఆయోగ్‌ నివేదిక

భారత్‌ సేవా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్తున్నప్పటికీ.. అందులో ఇప్పటికీ అనేక సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా లింగ అసమానత ఆందోళన కలిగిస్తున్నది. వేతనాల్లో భారీ వ్యత్యాసాలు, మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటం, అది కూడా ఏటికేడూ పడిపోతుండటం, గ్రామీణ-పట్టణ అంతరాలు వంటివి ఇప్పటికీ సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. నిటి ఆయోగ్‌ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

న్యూఢిల్లీ : భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సేవా రంగంలో నిమగమైన మహిళలు భారీ వేతన అసమానతలను ఎదుర్కొంటున్నారు. పురుషులు సంపాదించే దానిలో సగం కంటే తక్కువ మాత్రమే సంపాదిస్తున్నారు. పట్టణాల్లో కూడా ఈ అసమా నత ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే తక్కువే. ఇక్కడ పురుషులు సంపాదించే దానిలో మహిళలు 84శాతం సంపాదిస్తున్నారు. ‘ఇండి యాస్‌ సర్వీస్‌ సెక్టార్‌ : ఇన్‌సైట్స్‌ ఫ్రమ్‌ ఎంప్లాయి మెంట్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్టేట్‌ లెవల్‌ డైనమిక్స్‌’ పేరుతో విడుదలైన ఈ నివేదిక పలు అంశాలను వివరించింది.

ఈ నివేదికను నిటి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిటి ఆయోగ్‌ సభ్యులు అరవింద్‌ వీరమణి, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌లు ఉన్నారు. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ఉద్యోగ విభజన, ఉన్నత స్థాయి పదవుల్లో మహిళల తక్కువ ప్రాతినిధ్యం, నైపుణ్యాల లోపం వంటి అంశాలు ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సేవా రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం సరిపోదనీ, వేతన సమానత్వంతో పాటు వారికి ఉన్నత విలువ కలిగిన ఉద్యోగాల్లో ప్రవేశం కల్పించాలని నిటి ఆయోగ్‌ అభిప్రాయపడింది.

సేవా రంగంలో భారత స్థితి
మొత్తం భారతీయ కార్మిక శక్తిలో 30 శాతం అంటే 18.8 కోట్ల మంది సేవా రంగంలో ఉన్నారు. ఇక వ్యవసాయ రంగం 29.2 కోట్ల మందికి ఉపాధిని ఇస్తున్నది. సాంప్రదాయ రంగాలైన ట్రేడ్‌, ట్రాన్స్‌ పోర్ట్‌, ఎడ్యుకేషన్‌, వృత్తిపరమైన సేవలు వంటి మొదలైనవాటిలో 80శాతం ఉద్యోగాలు (15.5 కోట్లు) ఉన్నాయి. ఆధునిక సేవా రంగాలైన టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, ఫైనాన్స్‌ వంటి వాటిలో 13 శాతం ఉద్యోగాలు (2.5 కోట్లు) ఉన్నాయి. అయితే ఈ ఆధునిక సేవలే అధిక ఉత్పాదకత, మంచి వేతనాలు కలిగిన రంగాలుగా ఉన్నాయి. అయినప్పటికీ తక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండటం గమనార్హం. కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (0.79), హెల్త్‌ (0.74), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (0.74) వంటి రంగాల్లో ఉద్యోగాల వృద్ధి వేగంగా ఉన్నది. రవాణా (0.53), వాణిజ్యం మరియు మరమ్మత్తు (0.39) వంటి రంగాలు తక్కువ ఉద్యోగ వృద్ధిని కలిగి ఉన్నాయి.

గ్రామీణ-పట్టణ వ్యత్యాసం
పట్టణ ప్రాంతాల్లో సేవా రంగం 60.8 శాతం ఉద్యోగాలను కలిగి ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 18.9 శాతం మాత్రమే కావటం గమనార్హం. అది కూడా.. 2017-18 నుంచి 2023-24 మధ్య గ్రామీణ ఉపాధిలో సేవల వాటా 19.9 శాతం నుంచి 18.9శాతానికి తగ్గింది. గ్రామీణ సేవలు వాణిజ్యం, రవాణా, విద్యకు మాత్రమే పరిమితంగా కాగా.. పట్టణ ప్రాంతాల్లో ఇవి ఆర్థికం, సమాచార సాంకేతిక, ఆరోగ్యం వంటివిగా ఉన్నాయి. సేవా రంగంలో పైన తెలిపిన కాలంలో పురుషుల భాగస్వామ్యం 32.8 శాతం నుంచి 34.9 శాతానికి పెరిగింది. మహిళల భాగస్వామ్యం మాత్రం 25.2 శాతం నుంచి 20.1 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళా శ్రామికశక్తి (76.9 శాతం) అధికంగా వ్యవసాయ రంగంలో నిమగమై ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 24 శాతం మంది పురుషులు సేవా రంగంలో నిమగమై ఉండగా.. మహిళల వాటా 10.5శాతమే కావడం గమనార్హం. పట్టణ ప్రాంతా ల్లో పురుషులు (61 శాతం), మహిళలు (60 శాతం) ఇద్దరూ సమాన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు.

నిటి ఆయోగ్‌ సూచనలు
అయితే సేవా రంగంలో నెలకొన్న ఉపాధి, వేతన అంతరాలను తగ్గించడం చాలా ముఖ్యమని బి.వి.ఆర్‌ సుబ్రహ్మణ్యం చెప్పారు. సంప్రదాయ రంగాల నుంచి ఆధునిక రంగాలకు కార్మికుల మార్పును వేగవంతం చేయాలని నిటి ఆయోగ్‌ సూచించింది. ఇందుకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, సేవా క్లస్టర్‌ అభివృద్ధి వంటి చర్యలు అవసరమని పేర్కొన్నది. దేశంలోని ప్రతి రాష్ట్రమూ తమకంటూ ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకోవాలని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -