లక్నో సూపర్‌జెయింట్స్ ఎంపిక
లక్నో : శ్రీలంక లెగ్ స్పిన్నర్, లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాడు వానిందు హసరంగ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హసరంగ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దీంతో అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ జార్జ్ లిండ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ ఎంచుకుంది. వానిందు హసరంగను వేలంలో రూ.2 కోట్లకు దక్కించుకున్న సూపర్‌జెయింట్స్.. జార్జ్ లిండ్‌ను అతడి రిజర్వ్ ధర రూ. 1 కోటికి కొనుగోలు చేసింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సఫారీ ఆల్‌రౌండర్ జార్జ్ లిండ్.. ఆ జట్టు తరఫున 3 టెస్టులు, 4 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. టీ20ల్లో 35 వికెట్లు పడగొట్టిన లిండ్.. 403 పరుగులు చేశాడు. గత ఏడాదిగా బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్ సహా పలు గ్లోబల్ లీగ్‌ల్లో ఆడుతున్న లిండ్.. 250 టీ20ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే గాయం బారిన పడిన హసరంగ ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు మరింత సమయం పట్టనుండటంతో.. ఈ సీజన్‌లో ఆడలేనని సూపర్‌జెయింట్స్‌కు హసరంగ సమాచారం ఇచ్చారు. దీంతో సఫారీ స్పిన్నర్‌ను సూపర్‌జెయింట్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంచుకుంది.



