Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆడపిల్లలకి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించండి

ఆడపిల్లలకి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించండి

- Advertisement -

– సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణలో ఆ వ్యాక్సిన్‌ది కీలక పాత్ర
– ఐదేండ్లలో 10 శాతం క్యాన్సర్‌ కేసులు పెరిగే ప్రమాదం
– వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభంలో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఇంట్లో 14 ఏండ్ల ఆడబిడ్డ ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించాలని తల్లిదండ్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. అది క్యాన్సర్‌ వ్యాధి నివారణకు దోహదపడుతుందని చెప్పారు. క్యాన్సర్‌ నివారణ కోసం సమగ్ర పాలసీ తీసుకురాబోతున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న బాలికలకు సర్టిఫికెట్లను మంత్రితో పాటు ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..మూడు నెలల పాటు ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలి నెల రోజుల పాటు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, ఏరియాస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా క్యాన్సర్‌ మహమ్మారి కోరలు చాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో కూడా ఏటా 55,000 నుంచి 60,000 క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయనీ, వచ్చే ఐదేండ్లలో ఆ సంఖ్య మరో 10 శాతం పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్‌ వైద్య సేవలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ములుగు, ఆదిలాబాద్‌ వంటి మారుమూల జిల్లాల్లో కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామనీ, వ్యాధిని ముందే గుర్తించడానికి మొబైల్‌ స్క్రీనింగ్‌ యూనిట్స్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. త్వరలోనే క్యాన్సర్‌ను నోటిఫైబుల్‌ వ్యాధిగా గుర్తించామని తెలిపారు. దేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్‌ క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉందనీ, తెలంగాణలో ఏటా 3,200 మంది ఆ వ్యాధి బారిన పడుతున్నారని వివరించారు. ప్రపంచంలో ముందస్తుగా నివారించగలిగే ఏకైక క్యాన్సర్‌ ఇదేననీ, అది సోకిన 99.7 శాతం రోగులకు హ్యూమన్‌ పాపిలోమా అనే వైరస్‌ వల్లే వస్తుందని తెలిపారు. ఆ వైరస్‌ను అంతం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 నుండి 4 లక్షల మంది బాలికలకు రాబోయే 3 నెలల్లో వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో గార్డాసిల్‌ వ్యాక్సిన్‌ ఒక్క డోసు వేసుకోవాలంటే రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఖర్చువుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -