కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
సీఐటీయూ కరీంనగర్ జిల్లా 11వ మహాసభలు
నవతెలంగాణ-కరీంనగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతి రాంపూర్ లోని కామ్రేడ్ జేఎల్ నరసింహా రెడ్డినగర్‌లో సీఐటీయూ 11వ జిల్లా మహాసభలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు పూర్తిగా అనుకూలంగా మారిపోయిందన్నారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి, కార్మికుల హక్కులను పూర్తిగా నీరు గార్చిందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు నిర్ణయిస్తూ పెండింగ్‌లో ఉన్న జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో సీఐటీయూ మూడేండ్లలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి, కొత్త రంగాలకు విస్తరించిందని అభినందించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మూడేండ్లలో జిల్లాలో నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలపై నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు, బిల్డింగ్, గ్రానైట్, ట్రాన్స్‌పోర్ట్, హమాలీ, రైస్ మిల్లు కార్మికుల సమస్యలపై చేసిన కృషిని వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ, కార్యదర్శి జె.వెంకటేష్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాలువల స్వామి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు యు. శ్రీనివాస్, జనగాం రాజమల్లు, గుడికందుల సత్యం, సహాయ కార్యదర్శులు కొప్పుల శంకర్, కోశాధికారి రాజేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



