Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేలా!

ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేలా!

- Advertisement -

– ప్రపంచ శ్రేణి స్పోర్ట్స్‌ హబ్‌గా హైదరాబాద్‌
– రేపు తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ బోర్డు భేటీ

హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌
2036 ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యం అందిస్తే.. హైదరాబాద్‌ను కనీసం రెండు క్రీడాంశాలకు వేదికగా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన ప్రణాళికపై రేపు తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ముగిసిన తెలంగాణ తొలి స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌లో తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌కు బోర్డు ఆఫ్‌ గవర్నర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డితో పాటు చైర్మెన్‌ సంజీవ్‌ గోయెంకా, కో చైర్మెన్‌ ఉపాసన కామినేని సహా సభ్యులు సన్‌రైజర్స్‌ యాజమాని కావ్య మారన్‌, శశిధర్‌, విటా దనిలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. భారత ప్రఖ్యాత క్రీడాకారులు అభినవ్‌ బింద్రా, కపిల్‌ దేవ్‌, పుల్లెల గోపీచంద్‌, బైచుంగ్‌ భూటియా, రవికాంత్‌ రెడ్డిలు సైతం ఈ భేటీలో పాల్గొననున్నారు. క్రీడాశాఖ నుంచి శాట్జ్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డి, ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సహా స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్లు పాపారావు, శ్రీనివాస్‌లు ఈ కీలక సమావేశంలో భాగం కానున్నారు.

2036 ఒలింపిక్స్‌ కోసం..! :
2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో భారత్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఐఓసీ ఆతిథ్య వేదిక ఎంపిక ప్రక్రియను వాయిదా వేసినా.. భారత్‌ మాత్రం గొప్ప ఆసక్తితో కనిపిస్తోంది. ఇటీవల భారత ఉన్నతస్థాయి క్రీడా బృందం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆఫీస్‌బేరర్లతో చర్చలు జరిపింది. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కితే.. కనీసం రెండు క్రీడాంశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెలిబుచ్చారు. నేటి సమావేశంలో ఇదే అంశం ఎజెండాగా చర్చించనున్నారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం అందించేందుకు హైదరాబాద్‌లో క్రీడా వసతులు, మౌలిక సదుపాయాలు ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు సహా అందుకు బిడ్‌ దాఖలు చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై ప్రధానంగా చర్చించనున్నారు. గతంలో 2002 జాతీయ క్రీడలు, 2003 ఆఫ్రో ఆసియా క్రీడలు, 2007 ప్రపంచ మిలిటరీ క్రీడలు నిర్వహించిన అనుభవం హైదరాబాద్‌కు ఉండటంతో.. ఆ ట్రాక్‌ రికార్డును బిడ్‌ దాఖలుకు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

56 నియోజకవర్లాల్లో మినీ స్టేడియాలు :
తెలంగాణ నూతన క్రీడా విధానంలో పొందుపరిచిన పలు కీలక అంశాలపై సైతం నేడు స్పోర్ట్స్‌ హబ్‌ బోర్డు ఆఫ్‌ గవర్నర్ల సమావేశంలో చర్చ జరుగనుంది. గచ్చిబౌలి-హకీంపేటలో యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పాటు, 14 క్రీడాంశాల్లో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ అకాడమీల అభివృద్ది, తెలంగాణ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ ల్యాబ్‌లు, క్రీడాకారుల సంక్షేమం (ప్రోత్సాహకాలు, ఉపకారవేతనాలు, ఉద్యోగాలు, శిక్షణ మార్గాలు, గురువందనం బీమా)పై ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశంలో దిశా నిర్దేశం లభించనుంది. తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో 56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం సహా ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్‌ స్టేడియం ఉన్నతీకరణకు సంబంధించి నేడు స్పష్టమైన ప్రణాళిక ఈ సమావేశం ఆవిష్కరించే వీలుంది. రాష్ట్రంలో క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చారిత్రక, దర్శనీయ, అడ్వెంచర్‌, సరస్సులు ఉన్నచోట క్రీడా పోటీల నిర్వహణకు సరికొత్త రోడ్‌మ్యాప్‌ రూపొందించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad