Thursday, April 2, 2026
E-PAPER
Homeజాతీయంఏపీలో సద్దుమణగని 'నెయ్యి' వివాదం

ఏపీలో సద్దుమణగని ‘నెయ్యి’ వివాదం

- Advertisement -

నాలుగో రోజు శాసనమండలి వాయిదా
వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో ఛైర్మన్‌ పోడియం చుట్టుముట్టి వైసీపీ ఎమ్మెల్సీల నినాదాలు
అభ్యంతరం తెలిపిన టీడీపీ
అమరావతి :
టీటీడీకి నెయ్యి సరఫరా వివాదం శాసనమండలిలో సద్దుమణగలేదు. టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని వైసీపీ, అభ్యంతరకర అంశంపై చర్చకు అనుమతి ఇవ్వొద్దని అధికార పార్టీ పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలుగో రోజు శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌పై ఎటువంటి చర్చ సాగకుండానే ఏడు నిమిషాల్లో సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 10:07 గంటలకు సభను ఛైర్మన్‌ కె మోషేన్‌రాజు ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు బి కళ్యాణ చక్రవర్తి, తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని వైసీపీ సభ్యులు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, ఎస్‌ మంగమ్మ ఇచ్చిన రెండు వాయిదా తీర్మాలనూ శాసనమండలి చైర్మెన్‌ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. వైసీపీ సభ్యులు సభలో లేచి తామిచ్చిన వాయిదా తీర్మానం చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. ఒకసారి తిరస్కరించిన అంశానికి తిరిగి అనుమతించబోమని ఛైర్మన్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అభ్యంతరకరమైన అంశంపై చర్చకు అనుమతివ్వొద్దని ఛైర్మన్‌ను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కోరారు. దీంతో చర్చకు అనుమతినివ్వాలని వైసీపీ సభ్యులు స్పీకరు పోడియం చుట్టుముట్టారు. కవర్‌లలో వెంట తెచ్చుకున్న వెంకటేశ్వరస్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ చర్చకు అనుమతించాలని ఛైర్మన్‌ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. వెంకటేశ్వరస్వామి చిత్రపటాలను సభలో ప్రదర్శించడాన్ని తప్పుపడుతూ టీడీపీ సభ్యులు సైతం పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ప్లకార్డులు, దేవుని చిత్రపటాలు ప్రదర్శనకు సభలో అనుమతి లేదని చైర్మెన్‌ తెలిపారు. ఈ గందరగోళం మధ్య 10:12 గంటలకు చైర్మెన్‌ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 1:07 గంటలకు తిరిగి ప్రారంభించడానికి వచ్చిన చైర్మెన్‌.. అధికార, ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో ఒక్క నిమిషంలోనే సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు.వైసీపీ ఎమ్మెల్సీలు దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. సభలో గందరగోళం కొనసాగు తుండగానే మంత్రి మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -