అనగనగా ఒక రాజు. ఆ రాజుకు షష్ఠిపూర్తి ఉత్సవం రంగరంగ వైభవంగా జరగింది. ఈ ఉత్సవంలో రాజు ”వచ్చే ఆదివారం నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పినవారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను. కొలువులో ఉద్యోగం కూడా ఇస్తాను” అని ఒక ప్రకటన చేశాడు. మహారాజు ఏం ప్రశ్న వేస్తాడో, ఏమో, జవాబు చెప్పగల అదష్టవంతులెవరో అని చర్చ ప్రారంభమైంది. జనం ఇదే మాట్లాడుకోసాగారు. ఇక పండితులు, మేధావులు సరేసరి. తమ అదష్టాన్ని, తెలివిని పరీక్షించుకుందామని తహతహలాడసాగారు. కొందరైతే శాస్త్రాలు తిరగెయ్యసాగారు. అలా అలా ఈ వార్త గ్రామాల్లోకి పాకింది. ఒక రైతు కూతురు వెన్నెల అనే అమ్మాయి చెవిలో కూడా ఈ వార్త పడింది. వెన్నెల చాలా తెలివైన పిల్ల. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. తను కూడా రాజధానికి వెళతానని వెన్నెల మారాం చేసింది. అమ్మా నాన్నా వొప్పుకొన్నారు.
ఆదివారం రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకొన్నారు. పండితులు, విద్యావేత్తలు, ఎక్కడెక్కడి నుంచో శాస్త్రాలు పట్టుకొని బయలుదేరి వచ్చారు. వెన్నెల కూడా వాళ్లమ్మా నాన్నలతో పాటు వచ్చింది. జనం కిటకిటలాడుతున్నారు. అయినా చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్శబ్దం. అందరూ రాజు ప్రశ్నకోసం ఎదురు చూస్తున్నారు.
రాజు ఇలా చెప్పాడు… ”మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలన్పించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. మసాలా బాగా వెయ్యి. ఘుమఘుమలాడేలా గుత్తి వంకాయ కూర చెయ్యి, అని ఆజ్ఞాపించింది. వంటవాడు రంగంలో దిగాడు. సన్నికల్లు మీద మాసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబాళించేస్తోంది. వంటవాడి కూతురు ఉయ్యాల్లో ఏడుస్తోంది. పొయ్యిదగ్గర వున్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకొంటున్నాడు. ఆ నీళ్ళు పడి మంటలు ఆరుతున్నాయి. వంటవాడికి ఎక్కడలేని కోపం వస్తోంది. ఈ సంగతి వంటవాడి భార్య చూసింది. ఒరే పొయ్యి దగ్గరేం ఏ పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీ చావు మూడుతుంది. జాగ్రత్త’, అని వాణ్ణి తిట్టి దూరంగా లాగింది.
ఎలాగైతేనేం గుత్తి వంకాయకూర తయారైంది. దాని రుచిని మహారాణిగారు మహదానందపడిపొయ్యారు. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. బంగారుకాసులు బహుమానంగా ఇచ్చింది. కథ బాగా విన్నారుగా. రాణీగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులిచ్చింది? ఇదీ ప్రశ్న. సమాధానం కథలోనే వుంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి” అని ముగించాడు రాజు.
పండితులందరూ తలలు గోక్కున్నారు. కొందరు చెత్త ప్రశ్న అన్నారు. కొందరు ఇదెక్కడా శాస్త్రంలో కన్పించలేదు అని గొణుక్కొన్నారు. వెన్నెల వాళ్ళ నాన్న భుజాల మీది కెక్కి ‘రాజా, జవాబు నేను చెబుతా’ అంటూ పెద్దగా అరిచి చేతులూపింది. రాజు ఆ పిల్లను దగ్గరికి పిలిచాడు.
”చెప్పమ్మా. పెద్దవాళ్ళే జవాబు చెప్పనక్కరలేదు. తెలివిలో ఎవరు పెద్దయితే వాళ్ళే పెద్ద” అని ఆప్యాయంగా అడిగాడు.
”రాజా! రాణిగారిచ్చిన కాసులు వెయ్యిన్నూట పదహారు” అని జవాబు చెప్పింది వెన్నెల. రాజు ఆ పిల్లను దగ్గరకు తీసుకొన్నాడు.
‘శభాష్! చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు. సరేగానీ జవాబు ఎలా చెప్పగలిగావు?’ అని వెన్నెలని అడిగాడు. ”జవాబు మీ కథలోనే వుంది రాజా. మసాలా వెయ్యిలో ‘వెయ్యి’ వుంది. నూరుతున్నాడులో ‘నూరు’ వుంది. ఏడుస్తోందిలో ‘ఏడు’ వుంది. ‘ఆరుతున్నాయిలో ‘ఆరు’ ఉంది. మూడుతుందిలో ‘మూడు’ వుంది. మొత్తం కలిపితే ‘వెయ్యిన్నూట పదహారు’ గదా అంది వెన్నెల. సభ కళతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834