తెలంగాణలో గిగ్ వర్కర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారని అంచనా. ఆర్థిక పరిస్థితులు బాగా లేక కుటుంబానికి అండగా నిలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో 18 ఏండ్ల నుంచే యవత గిగ్ వర్కర్లుగా అవతార మెత్తుతున్నారు. వీరికోసం ప్రత్యేక చట్టాలంటూ లేకపోవడంతో కష్టాలు, కడగండ్లు తప్పడం లేదు. కార్మిక రంగంలో గిగ్ వర్కర్ల ప్రాధాన్యం, ఫ్లాట్‌ఫాం ఎంప్లాయిమెంటు పేరిట ‘వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్’ 2020-21లో ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం వ్యవసాయేతర కార్మికశక్తిలో గిగ్ వర్కర్లు 2.6(77 లక్షలు) శాతం మాత్రమే ఉన్నారు. కానీ 2047 నాటికి ఇది 14.89(6.16 కోట్లు) శాతానికి పెరగనుంది.
అంటే ఏడు రెట్ల వృద్ధి. ఇటు గిగ్ ఎకానమీ కూడా 2030 నాటికి దేశ జీడీపీలో 1.25 శాతం, 2047 నాటికి అది నాలుగు శాతానికి చేరే అవకాశముంది. టెక్నాలజీ విస్తరణ, సౌలభ్యత, డిజిటల్ ఫ్లాట్‌పాంలకు వస్తున్న ఆదరణ, ప్రాజెక్టు ఆధారిత ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తిలాంటివి కారణాలుగా చెప్పొచ్చు. హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, ముంబయిలో క్యాబ్‌డ్రైవర్లు, బైక్‌రైడర్లు, పార్సల్, ఫుడ్ డెలివరీ తదితర రంగాల్లో పనిచేస్తున్న గిగ్‌వర్కర్లపై అధ్యయనం చేసింది. జీవనం గడిపేందుకు అవసరమైన ఆదాయం కోసం 63.84 శాతం మంది వారానికి 48 గంటలకుపైగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్టు నివేదిక పేర్కొన్నది.
స్థిరమైన ఆదాయం, సరైన ఉద్యోగ భద్రత, రక్షణ లేకపోవడంతో అభద్రత నెలకొంది. భధ్రతపై కార్మికులు ఫిర్యాదు చేసినప్పుడు వేగంగా స్పందించేలా వ్యవస్థను ఏర్పాటుచేయాలనే డిమాండ్ పెరుగుతున్నది. సగానికిపైగా కార్మికులకు బీమా వంటి వాటిపై అవగాహన లేకపోవడం గమనార్హం. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనీ, దీర్ఘకాలిక ఉపాధి, సుస్థీర ఆదాయం, కెరీర్, నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా కార్మిక విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. గిగ్ కార్మికుల రక్షణ కోసం చట్టాలు చేసి, సోషల్ సెక్యూరిటి కోడ్‌తో అనుసంధానం చేయాలనే డిమాండ్ వస్తున్నది.
ఇందుకు ప్రభుత్వ, ప్రయివేటు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. పనిగంటలు మాత్రం వారంలో కనీసంగా 10 గంటల నుంచి 12 గంటలు ఉంటాయి. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారు కూడా. 75 శాతం మంది గిగ్ వర్కర్లకు కార్మిక సంఘాల్లో సభ్యత్వం లేదు. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ రంగంలో చాలా తక్కువ. పురుషులు అధికంగా రవాణా ఆధారిత రంగంలో పనిచేస్తే, మహిళలు బ్యూటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కష్టపడుతున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం లేకపోవడం, సామాజిక కట్టుబాట్లు, భద్రతాపరమైన రక్షణ సరిగా లేకపోవడం మహిళలకు అడ్డంకులుగా ఉన్నాయి.ఎక్కువగా 22-40 ఏండ్ల మధ్య వయస్సున్న వారు గిగ్ వర్కర్లుగా జీవనం సాగిస్తుండగా, 40-50 ఏండ్ల మధ్యనున్న వారు ఈ రంగాన్ని వదిలేస్తున్నారు.
సొంతంగా పనిచేసుకునే వీలు, వెంటనే వేతనాలు చెల్లింపు, అనుకూలమైన పనివేళలు ఉండటంతో ఫ్లాట్‌ఫాం వర్కర్లుగా చేరుతున్నారు.
కస్టమర్ల తప్పుడు ఫిర్యాదులు, డౌన్‌రేటింగ్, సంస్థ సరిగాచూడకపోవడం తదితర సమస్యలు వారిని వేధిస్తున్నాయి. ఇంటర్, పట్టభద్రులు, మాధ్యమిక, ప్రాథమిక, పోస్‌గ్రాడ్యుయేట్లు, డిప్లొమో, ఓకేషనల్ కోర్సులు చదువుతున్నవారే అధికంగా అడుగుపెడుతుండటం గమనార్హం. యాప్ బేస్‌డ్ ఉద్యోగాల్లో వీరి సంపాదన నెలకు సగటున రూ. 14 వేలే. అయితే పనిగంటలు మాత్రం వారంలో కనీసంగా 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉన్నాయి. ఆర్థిక అవసరాల రీత్యా అమ్మాయిలు, మహిళలు రాత్రి 11 గంటల వరకు బైక్‌లు, ఆటోలు నడుపుతూ పొట్టపోసుకోవడం మెట్రో నగరాల్లో కండ్లకు కడుతూనే ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారంతా జీపీఎస్ ఆధారంగా క్యాబ్‌లు నడుపుకుంటున్నారు. వీరికోసం తెలంగాణ గిగ్, ఫ్లాట్‌ఫాం వర్కర్స్ (రిజస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్) బిల్లు, 2025 ముపాయిదాను అసెంబ్లీలో పెట్టడానికి ప్రయత్నాలు చేపట్టింది. ఈ చట్టం వస్తే దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. తద్వారా గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం శ్రామికవర్గంగా గుర్తించనుంది, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయాలనే డిమాండ్ కార్మిక సంఘాల నుంచి వస్తున్నది. పీఎఫ్, ఇతర సౌకర్యాలు కల్పించాలనీ, ప్రత్యకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నాయి.
గిగ్ వర్కర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



