Friday, December 26, 2025
E-PAPER
Homeజాతీయందేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మె

దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మె

- Advertisement -

ఈ నెల 31 వరకు నిలిచిపోనున్న డెలివరీ సేవలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గిగ్‌ వర్కర్లు ( డెలివరీ బార్సు) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ఇ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లైన స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలలో పనిచేస్తున్న డెలివరీ పార్టనర్స్‌ ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెను ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (ఐఎఫ్‌ఎటి), తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ( టిజిపిడబ్ల్యూయు)లు సంయుక్తంగా గురువారం ప్రకటించాయి. ఇది డిసెంబర్‌ 25 (క్రిస్మస్‌) నుండి ప్రారంభమై డిసెంబర్‌ 31 (న్యూ ఇయర్‌ ) వరకు కొనసాగనుంది. ముఖ్యంగా పండుగ సీజన్‌ , సెలవు దినాల్లో డెలివరీలకు విపరీతమైన డిమాండ్‌ ఉండే సమయంలో సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి..

సామాజిక భద్రతను కల్పించండి..
గిగ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, వారికి పిఎఫ్‌ , ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలని వారు కోరుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా డెలివరీ ఛార్జీలను పెంచాలని , ప్రతి ఆర్డర్‌పై గౌరవప్రదమైన ఆదాయం కల్పించాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. పని చేసే సమయంలో డెలివరీ బార్సుకు భద్రతను కల్పించాలని, సమగ్ర ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కంపెనీల ఏకపక్ష నిర్ణయాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని యూనియన్లు కోరుతున్నాయి. పని పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని, కంపెనీలు కేవలం లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ వర్కర్ల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని యూనియన్‌ నేతలు విమర్శించారు.

”అర్ధరాత్రి వరకు, ఎండనక వాననక కష్టపడుతున్న మాకు కనీస గౌరవం కానీ, భద్రత కానీ లేదు. అందుకే ఈ పోరాటం అనివార్యమైంది” అని ఒక యూనియన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీని సమర్థవంతంగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. గిగ్‌ ఎకానమీలో పనిచేస్తున్న లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్లాట్‌ఫామ్‌ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అయితే సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్డర్ల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -