Monday, April 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇంటర్‌లో బాలికలదే హవా

ఇంటర్‌లో బాలికలదే హవా

- Advertisement -

ప్రతిభ చాటిన ప్రభుత్వ విద్యాసంస్థలు
ఫలితాలు విడుదల చేసిన కె.కేశవరావు
ఫస్టియర్‌లో 66.20 శాతం, సెకండియర్‌లో 75.34 శాతం
రెండేండ్ల ఉత్తీర్ణత శాతం 70.60
మే 13 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో ఈసారి బాలికలే పైచేయి సాధించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు సత్తా చాటాయి. 16 రకాల యాజమాన్యాల పరిధిలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా, అత్యధికంగా 94.03 శాతం ఉత్తీర్ణతతో తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు మొదటిస్థానంలో నిలిచాయి. కాంపోజిట్‌ యాజమాన్యంలోని విద్యార్థుల్లో ఉత్తీర్ణత 36.71 శాతంతో అతి తక్కువగా ఉంది.

మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే టీజీఎస్‌ఆర్టీసీ 89.29, సోషల్‌ వెల్ఫేర్‌ 86.79, సెంట్రల్‌ గవర్నమెంట్‌ 86, టీఎస్‌ గవర్నమెంట్‌ స్పోర్ట్స్‌ 84.85, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు 84.46, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 84.20, బీసీ వెల్ఫేర్‌ 83.48, కేజీబీవీ 81.39, ప్రయివేట్‌ అన్‌ ఎయిడెడ్‌ కళాశాలలు 71.57, మోడల్‌ స్కూల్స్‌ 66.15, ఇన్సెంటివ్‌ 65.70, గవర్నమెంట్‌ 59.86, ప్రయివేట్‌ ఎయిడెడ్‌ 55.78, కో ఆపరేటివ్‌ కళాశాలలు 52.43 శాతాలతో ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలోనూ దాదాపు ఇదే రకమైన ఫలితాలు ఆయా యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులు సాధించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాతో కలిసి ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కళాశాల విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ జయప్రద బాయి, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రవి గుప్తా పాల్గొన్నారు.

బాలికలదే పైచేయి
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జనరల్‌ విద్యార్థులు 71.12 శాతం, వొకేషనల్‌లో 65.65 శాతం మొత్తం 70.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 66.20 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలికలు 74.40 శాతం, బాలురు 57.69 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలురు 68.08 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 82.07 శాతంతో పైచేయి సాధించారు. గతేడాది రెగ్యులర్‌ విద్యార్థుల్లో మొదటి సంవత్సరం 66.91 శాతం ఉత్తీర్ణత ఉండగా, ఈ ఏడాది 66.94 శాతానికి పెరిగింది. అదే విధంగా ద్వితీయ సంవత్సరంలోనూ 71.43 శాతం నుంచి 75.61 శాతానికి చేరింది. వొకేషనల్‌ ఉత్తీర్ణతా శాతం మొదటి సంవత్సరంలో 57.69 శాతం నుంచి 59.30 శాతానికి, రెండో సంవత్సరంలో 67.45 శాతం నుంచి 71.15 శాతానికి పెరిగింది.

జిల్లాల వారీగా చూస్తే మొదటి సంవత్సరంలో మేడ్చల్‌ మల్కాజిగిరి 77.02, రంగారెడ్డి 75.69, జయశంకర్‌ భూపాలపల్లి 72.19 శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలవగా, రాజన్న సిరిసిల్ల 51.38, కామారెడ్డి 49.88, మహబూబాబాద్‌ 48.1 శాతంతో చివరి మూడు స్థానల్లో నిలిచాయి. ద్వితీయ సంవత్సరంలో జయశంకర్‌ భూపాలపల్లి 81.95, ములుగు 81.68, కొమరం భీమ్‌ (ఆసిఫాబాద్‌) 80.57 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉండగా, కామారెడ్డి 59.56, వరంగల్‌ 58.76, రాజన్న సిరిసిల్ల 55.68 శాతంతో పూర్తిగా వెనుకబడ్డాయి. గ్రూప్‌ల వారీగా ఫలితాలను విశ్లేషిస్తే మొదటి సంవత్సరం ఎంపీసీలో 75.51, ద్వితీయ సంవత్సరంలో 78.01 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు మొదటిస్థానంలో నిలిచారు. హెచ్‌ఈసీ మొదటి సంవత్సరంలో కేవలం 34.34 శాతం, ద్వితీయ సంవత్సరంలో 49.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,70,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 4,89,123 మంది పరీక్ష రాయగా 3,23,807 మంది, రెండో సంవత్సరంలో 5,07,948 మందికి 3,58, 490 మంది ఉత్తీర్ణులయ్యారు.

20 వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ గడువు మే 13 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్‌ పరీక్షల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం సోమవారం (ఏప్రిల్‌ 13వ తేదీ) నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తు, ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. మే 13 నుంచి ప్రారంభం కానున్న అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మే 22న అడ్వాన్స్‌డ్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. రెగ్యులర్‌ విద్యార్థులతో కలిసి తదుపరి విద్యను కొనసాగించేందుకు వీలుగా నెల రోజుల్లోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వంచనున్నారు. ఇంటర్‌ ఫలితాలను ఈ సారి వాట్సాప్‌ ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించారు.

నేను థర్డ్‌ క్లాస్‌లో పాసయ్యా…: ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
తాను థర్డ్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాననీ, అయినా స్టేట్‌ ర్యాంకర్‌ శ్రీదేవసేనతో సమానమైన నాలెడ్జ్‌ తనకుందని కె.కేశవరావు ఈ సందర్భంగా తెలిపారు. పుస్తకంలో ఉన్నదే పూర్తి జ్ఞానం కాదనీ, బయట ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోవడమే పూర్తి నాలెడ్జ్‌ అని చెప్పారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్‌ కావడమంటే చదువురాని వారు కాదన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరముందన్నారు. పాఠశాలలనేవి సమాజాన్ని అర్థం చేసుకునేవిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. 5 నిమిషాలు ఆలస్యమైతే పరీక్షకు అనుమతించకపోవడం లాంటివి పిల్లల్లో భయాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు. వారిలో భయం పోగొట్టేందుకు విద్యావ్యవస్థలో మార్పులు రావాలన్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, వెంటనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామనీ, బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థే మెరుగైనదనేందుకు ఇంటర్‌ ఫలితాలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -